ᐅఅహం బ్రహ్మాస్మి



ᐅఅహం బ్రహ్మాస్మి!

జీవితంలోంచి భగవంతుడు మాయమైతే... ఏమీ లేదు. శూన్యం కూడా కాదు. ఉనికే లేదు. ఆలోచించేందుకిక్కడ ఏమీ మిగలదు. నాస్తికుడు, భగవత్‌ ద్వేషి కూడా ఆస్తికుడికంటే, భక్తుడికంటే అధికంగా భగవంతుని స్మరిస్తాడు. మరి ద్వేషించేందుకైనా ఒక శాల్తీ అంటూ ఉండాలి కదా? ఈ విషయాన్ని మనకు హిరణ్యకశ్యపుడు, కంసుడు లాంటి హరిద్వేషులు తేటతెల్లం చేస్తారు. సంకల్ప సహితంగానో, సంకల్ప రహితంగానో మనిషి సదా సదానందుని స్మరణలోనే, స్మృతిలోనే ఉంటాడు. ఎందుకంటే మనిషి 'నేను'నైనా మరచిపోతాడేమోగానీ నారాయణుని మరచిపోడు. తానంటూ లేనినాడు, నేనంటూ లేనినాడు- మిగిలేది 'ఆయనే'. ఆ స్పృహ కలిగి ఉండటమే- భక్తి, ప్రేమ. అదే, జన్మరాహిత్యానికి మార్గం.
మనం ఒకటి ఆలోచించాలి. సృష్టిలో ఏదీ సంకల్ప రహితంగానో, యథాలాపంగానో, ఉద్దేశరహితంగానో ఉనికి కలిగిలేదు. అంటే, తనకు తాను తెలీకుండా పుట్టిన జీవి... జీవిస్తూ, తన జన్మోద్దేశాన్ని నిర్వర్తిస్తూ ఉందంటే దాని వెనక కర్త అంటూ ఒకరుండాలి కదా? ఆ ఒకరే, ఆ కర్తే... భగవంతుడు. మనను, సమస్త బ్రహ్మాండాలను సృష్టించినవాడు. ఆ క్రీడామయుడి, క్రీడాప్రియుడి క్రీడలో మనం పావులం. పాత్రలం. క్రీడ అంటేనే గెలుపోటములు. అంతకంటే ముందు క్రీడించటం. ఆ చెలగాటాన్ని ఆనందించటం. ఆ క్రీడలో వైవిధ్యం, వైరుధ్యం. దీనికి సహకరించేదే 'మాయ'. మన విషయంలో అయితే అదంతా కలిపి 'జీవితం'. భగవంతుడెంత దయామయుడంటే క్రీడను తానొక్కడే ఆస్వాదించకుండా పావులమైన మనమూ ఆస్వాదించే అవకాశాన్ని కల్పించాడు. కష్టసుఖాలు, చెలగాటాలు, గెలుపోటములు... ఈ జీవితం ఎంత చైతన్యవంతం... ఎంత వైవిధ్యం!

ఆయన సృష్టించిన జీవితం ఇది. ఆయన నిర్ణయించిన ఆట ఇది. ఆయన కేటాయించిన పాత్ర మనది. ఆ స్పృహలోనే ఉంటూ ఆటను ఆనందించాలి. నిర్వహించాలి. ప్రతిక్షణం, ప్రతికోణం, ప్రతి పని, ప్రతి ఫలితం... ఆయనే. ఆయనే. ఈ స్పృహ మనకుండాలి. నిజం... భగవంతుడు లేకుండా జీవితం ఏమీ లేదు. ఏమీ మిగలదు. శూన్యం కూడా ఆయనే. ఈ మాత్రానికి 'నేను' అంటూ అహం ఎందుకు, దేవుడు లేడనే వితండ వాదం ఎందుకు? బాల్యంలో తండ్రి అజమాయిషీలో, పెద్దయ్యాక గురువు, ఆ తరవాత జీవిత భాగస్వామి, చివరగా పిల్లలూ... ఇదీ మానవ జీవిత క్రమం. వీరి అజమాయిషీలోనే మనం జీవిస్తాం. ఆయా సమయాలకు అది అజమాయిషీగా చికాకు, ఇబ్బంది కలిగించినా- పోనుపోను... ఆ అజమాయిషీ వెనక వారికి మనపట్ల ఎంత శ్రద్ధ, భద్రతపట్ల బాధ్యత, ప్రేమ ఉన్నాయో అర్థమవుతుంది. భగవంతుడు సృష్టించిన ఈ బంధుబలగాల అజమాయిషీనే మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, అంగీకరించగలిగినప్పుడు- వారిని, మనను, సమస్త విశ్వాసాలనూ సృష్టించిన ఆ భగవంతుని నమ్మేందుకు, ఆయన అజమాయిషీని అంగీకరించేందుకు, కృతజ్ఞులమై, బద్ధులమై, విధేయులమై ఉండేందుకు... ఏమిటి సందేహం, ఏమిటి సంకోచం? ఇంతకంటే అమాయకత్వం మరొకటి ఉందా! ఈ పసి మనస్తత్వం నుంచి బయటపడదాం. ఈ పద భావనను తొలగించుకుందాం. 'మార్జాల కిశోర న్యాయం'లా తల్లి పాత్రలో ఆయన ఉండి మననేం చేయాలో, ఎక్కడుంచాలో, ఎక్కడికి చేర్చాలో ఆయనే చేస్తున్నప్పుడు, ఆయన ప్రమేయం లేకుండా శ్వాసకూడా పీల్చలేని మనం, అర్భకులం కుహనాహంకారంతో ఎగిరిపడటం ఎందుకు? మనకు తెలుసా? మనం ఎవరో కాదు. అమృత పుత్రులం. బ్రహ్మపుత్రులం. అద్దంలో చూసుకునేదాకా మనం అమ్మలా ఉన్నామన్న సంగతి మనకు తెలీదు. ఆత్మలో స్థితులమయ్యేదాకా మనం ఆత్మ అన్న సంగతి మనకు కూడా తెలీదు. ఆత్మ ఎవరో కాదు. పరమాత్మే! పరబ్రహ్మమే!

అహం బ్రహ్మాస్మి!

- చక్కిలం విజయలక్ష్మి