ᐅ సంతృప్తి



ᐅ సంతృప్తి

'తృప్తి చెందని మనిషి సప్తద్వీపాల్లోనూ బాగుపడడు' అని కవివాక్కు. నిజమే. 'తృప్తిలేనివాడికి సుఖం ఎక్కడిది?' అని సుభాషిత కర్తలూ నొక్కి వక్కాణించారు. అంటే, మనిషి ఏదో ఒక దశలో ఉన్నవాటితో సంతృప్తి చెందడం అవసరం. అలా కానప్పుడు అడుగడుగునా దుఃఖం కలగడమే కాక, మనశ్శాంతి కూడా కరవై, అనారోగ్యాల పాలబడటం అనివార్యం.
మనిషి తనకు కావలసిన ప్రాథమికావసరాలైన కూడు, గుడ్డ, గూడు కోసం తొలుత ప్రయత్నిస్తాడు. పూటగడవని పరిస్థితిలో పట్టెడు అన్నం దొరికితే చాలు అదే పదివేలని అనిపిస్తుంది. ఒక్క జత బట్టలతో కాలంగడవని దుస్థితిలో మారు జత ఉంటే ఎంత బాగుండునని ఆశ కలుగుతుంది. పరుల పంచన కాలక్షేపం చేస్తున్నప్పుడు సొంతంగా ఒక పూరిగుడిసె అయినా సమకూర్చుకోవాలనే తపన బయలుదేరుతుంది. ఈ కనీసావసరాలు లభించగానే మనిషిలో అత్యాశ మొదలవుతుంది. పంచభక్ష్య పరమాన్నాలకోసం, పట్టుపీతాంబరాలకోసం, ఖరీదైన భవనాలకోసం మనిషి ఎగబడుతాడు. వీటిని సాధించడానికి అహోరాత్రాలు శ్రమిస్తాడు. బుద్ధి వక్రిస్తే పక్కదారులు వెదకి, పాపకర్మలు చేసి అయినా సుఖపడాలని అనుకొంటాడు. కానీ, లభించినది చాలునని వూరుకోడు. ఇది మానవసహజ స్వభావం.

మనిషి మనుగడకు ఎంతచోటు కావాలి? ఈ ప్రశ్నకు ఆరు అడుగుల నేల చాలునని వేదాంతులు చెబుతారు. నిజానికి మనిషికి అంతే చోటు చాలు. కానీ అతడు అంతటితో సంతృప్తిపడతాడా? ఎంతమాత్రం సంతృప్తి చెందడనీ, ఈ భూమండలమంతా ఇచ్చినా, ఇంకా చాలదని అంటాడనీ పెద్దలు చెబుతారు.

పూర్వం ఇలాంటి దురాశాపరుడొకడు బ్రహ్మదేవుడికోసం తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఏమికావాలో కోరుకొమ్మన్నాడు. అప్పుడతడు తనకు తగినంత భూమి కావాలన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు- 'నాయనా! నీవు ఇక్కడినుంచి ఓపిక ఉన్నంత దూరం పరుగెత్తు. నీవు ఎంత దూరం వరకు వెళ్తావో, అంతదూరం వరకుగల భూమి నీ సొంతం అవుతుంది. ఇక వెళ్లు!' అని ఆశీర్వదించి, అంతర్థానమైపోయాడు. అప్పుడు ఆ భక్తుడు దురాశతో, సూర్యాస్తమయందాకా పరుగుతీస్తే చాలా భూమి నా సొంతం అవుతుందికదా అని పరుగుతీయడం ప్రారంభించాడట. నట్టనడి ఎండలో మిట్టమధ్యాహ్నం దాకా పరుగుతీసేసరికి, ఆయాసంతో రొప్పుతూ, నేలపైపడి, గుండె ఆగి, మరణించాడు. కొంత భూమి చాలనుకొని తృప్తిపడక, దురాశ పడినందుకు ఎంతటి దుర్గతి పట్టిందో అర్థమవుతుంది.

నేడు మనిషికి సంతృప్తి ఉందా అంటే, అనుమానమే! ఏనుగులు కావాలనుకొనేవాడికి ఎలుకలు ఒక లెక్కా అన్నట్లు- పరిమిత సంపాదనతో తృప్తిపడని మానవుడికి కొండలూ గుట్టలూ కూడా కబళించే పదార్థాలే అవుతున్నాయి. ఎవరైనా తన అవసరానికి తగినంత మాత్రమే దాచుకొని, మిగిలినదంతా పరులకు పంచిపెట్టాలని ఈశావాస్యోపనిషత్తు ప్రబోధిస్తోంది. భోగం ఒక్కటే జీవితం కాదు. త్యాగం కూడా జీవితమే. త్యాగంతో కూడిన బతుకు ధన్యమవుతుంది. లోభంతో కూడిన జీవితం వ్యర్థమవుతుంది. కనుక త్యాగమే జీవితం.

అసంతృప్తిపరుడు త్యాగం చేయలేడు. లభించినదానితో సంతృప్తిపడేవాడికి, మిగిలినదంతా పరోపకారానికి వినియోగించాలనిపిస్తుంది. పరోపకార జీవనమే శ్రేయస్కరం.

కొందరు ఎన్ని ఉన్నా బిచ్చగాళ్లవలె దీనత్వాన్ని నటిస్తుంటారు. అన్నీ ఉన్నా ఏమీ లేదంటుంటారు. ఏమీలేదని ఎల్లప్పుడూ మనసులో వెలితిని నింపుకొంటే మనిషికి ఏమీ మిగలకుండానే పోతుంది. నిత్యతృప్తుడే నిరామయుడని ఒక సూక్తి. తృప్తిగలవాడికి ఆరోగ్యం లభిస్తుంది. అసంతృప్తితో రోగాలు మొదలవుతాయి. రోగాలవల్ల ఆయుష్షు తగ్గిపోతుంది. కనుక మనిషి ఎప్పుడూ నిత్యతృప్తితో ఉండటమే మంచిది. 'నేను ఎంతో బాగున్నాను. నాకేమీ తక్కువ లేదు' అనుకొనే మనిషి నూరేళ్లు సంపూర్ణంగా బతుకుతాడు.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ