ᐅఋష్యాశీస్సులు
మంచి కోరిక, సంకల్పం... వీటికి బలం ఉంది. కోరికను సాధించుకోవాలనుకోవడమే సంకల్పం.
ధర్మబద్ధమైన కోరిక దృఢ సంకల్పమై చక్కగా వ్యక్తీకరించినప్పుడు అది 'సత్యం' అవుతుంది... అని వేదవాఞ్మయం చెబుతోంది. అందువల్లనే శుభకామనలు, శుభ సంకల్పాలు, నిష్కపటంగా వ్యక్తీకరించడమనే సంప్రదాయం ఏర్పడింది. వేదాలను మొదలుకొని మన ప్రార్థనలు, ఆకాంక్షలు ఈ మూడు అంశాలతోనే ఏర్పడ్డాయి. వ్యక్తిత్వాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకొనేందుకు, సత్కార్యాలను సాఫల్యంగా ఆచరించేందుకు ఈ విధమైన ప్రార్థనలు మనోవాక్కర్మలకు స్ఫూర్తినిస్తాయి. వ్యక్తిగతంగానూ, సమాజహితపరంగానూ, ధార్మిక సూత్రాలకుగాను- శుభాన్ని కాంక్షించడం సమంజసం.
* శుభమైన సంకల్పాలు కలవారు, రక్షణను అందించగలిగే బుద్ధిమంతులు, చురుగ్గా పనిచేసేవారు, ఎందరికో ప్రేరణ ఇవ్వగలవారు, సరైన సమర్థులను సమన్వయించగలిగేవారు దేశానికి సంపదలను సమకూర్చగలరు- అని 'రుగ్వేదం' చెబుతోంది. అటువంటివారు పరిపాలకులుగా ఉండాలి- అనే ఆకాంక్ష శాస్త్రంలో కనబడుతుంది. అంటే- నేతల్లో అలాంటి లక్షణాలుండాలి... అనే భావన కూడా ప్రధానం.
* నా దేశంలోని పంటలు ఆరోగ్యాలను ప్రసాదించాలి. ఆయువును దీర్ఘంచేసేలా, రోగరహితమై ఉండాలి- అనే ఆకాంక్ష అధర్వవేదంలో ఉంది.
ఈ శుభాకాంక్షలనే - 'మేము సావధానులమై ఈ దేశ క్షేమానికి అర్పితులమవుదుము గాక!' అనే శుభసంకల్పం కూడా వ్యక్తపరచారు రుషులు. మన బాధ్యతలకు మనమే నిబద్ధులమయ్యేందుకు శుభాకాంక్షలు ప్రార్థనలవుతున్నాయని తెలుసుకోవాలి.
* ఐశ్వర్య సాధనతోపాటు, దాన్ని సమనీతిలో విభజించేలా మా బుద్ధులు పనిచేయాలి. హింసకులను మా ప్రయత్నాలు అదుపు చేయుగాక!- అని రుగ్వేద భావన.
* దేశాభివృద్ధికి అపరాధ ప్రవృత్తులను, దేష్యులను తొలగించమని దేవతలను కోరడం రుగ్వేదం ఎనిమిదో మండలంలో కనబడుతుంది. సమాజహితాన్ని దెబ్బతీసేవారు ఒక గుంపుగా ఏర్పడకుండా వారిని నిర్మూలించమని ప్రార్థించడమూ ఉంది.
* 'నేను అవినీతిపరుల పట్ల దయచూపను. వారిని శిక్షించవలసినదే' అనే భావన దేశహితాన్ని కోరేవారికి, ఉండాలని అధర్వవేదం చెబుతోంది.
* భూసంపదను భూమత సంతానమైన మానవులందరూ సమానంగా అనుభవించాలి- అనే సమభావన అధర్వవేదంలో పల్లవించి ఫలించి కనిపిస్తోంది.
ఆకాంక్షను ప్రార్థనగా మార్చడంవల్ల, మన సంకల్పం దైవసంకల్పమై సిద్ధిస్తుందని ఆర్షదృష్టి.
* నేను, నావారు మనోబలంతో ఉండాలనే కాంక్ష పలుచోట్ల వేదాల్లో కనబడుతోంది. మన పుత్రపౌత్రులు కూడా బలాఢ్యులై, సమర్థులై ఉండాలి- అనే కుటుంబ సంక్షేమ సంభావన రుషి ఆలోచన. దృఢశరీరులైన పౌరులుండాలి. వారే దేశానికి సైతం బలం.
* 'నా ఇంట పూలమొక్కలు, చక్కని తృణాలు దూర్వాదులు సమృద్ధిగా ఉండాలి. కొరతలేని నీరు ఉండాలి' అనే రుగ్వేద ప్రార్థనలో, ఒక చక్కని ఇల్లు ఎలా ఉండాలి అనే మంచి ఆలోచన ప్రాచీన కాలంలో మనదేశంలో ఎంత స్పష్టంగా ఉందో అవగతమవుతుంది.
* కాలంలో పరిణమించే రుతువులు, సంవత్సరాలు, ప్రకృతి మార్పులు- మనలను అభివృద్ధి పరచాలనే శుభాశంస/ యజుర్వేదంలో, అధర్వవేదంలో కొన్ని మంత్రాలు స్పష్టం చేశాయి. కాలంలోని మలుపులు కలిసిరావాలి అని ఆశలుండటం ఒక సహజ శుభాకాంక్ష.
* లోకానికి హితం కలిగించే స్వభావం కలవారు, జ్ఞానానికి ప్రాధాన్యమిస్తూ, మితి కలిగిన సంపదను మాత్రమే అనుభవించేవారు దానానికి తగినవారు- అని చెబుతున్నది వేదం. అటువంటివారు నా దానాన్ని గ్రహింతురు గాక!- అని వాంఛించాలి. ఇదీ ఆర్ష సంస్కృతి.
* మేధాశక్తి, రక్షణశక్తి కలిసి నడిచే సమాజం పుణ్యలోకమే- అని భావిస్తూ, అలాంటి చోటుగా మా ప్రాంతం భాసించాలి- అనే ఆశయం వేదరుషి హృదయంలో మెరుస్తోంది.
* ఒకే లక్ష్యంతో కలిసి నడిచే సమభావన, సహకారం, సమసంకల్పం కలిగిన వాళ్లమై మేలు కలిగించుకోవాలి- అనే సమాజ క్షేమ సూత్రాలను రుషులు అందించారు.
* 'యమరాజ్యం' కావాలనే అద్భుత భావన యజుర్వేదంలో ఉంది. 'యమం' అంటే 'నియంత్రణ'.
యమ-నియమ-సంయమ... ఈ మూడూ వ్యక్తిలోనూ, సమాజ జీవన సరళిలోనూ ఉంటేనే భద్రత, పురోగతి. నిగ్రహశక్తితో కూడిన సత్యం, ఇంద్రియ నియంత్రణ, అహింస, అక్రమార్జన లేకుండటం, అవినీతి రాహిత్యం-యమం.
స్వధర్మ పాలన, అధ్యయనం, శౌచం, సంతోషం, తపస్సు, ఈశ్వరార్చన- నియమం. ధ్యానం, ధారణ- సంయమం.
అసంఖ్యాకమైన శుభంకర ఆలోచనలను ఎన్నింటినో ఇచ్చిన రుషుల వాక్కుల్లో కొన్ని తళుకులు మాత్రమే ఇవి. వీటిని మన దృష్టిలో నిలుపుకొని సాగిననాడు మన కాలాన్ని మనమే విజయవంతం చేసుకోగలం.
- సామవేదం షణ్ముఖశర్మ