ᐅ హృదయవాసి



ᐅ హృదయవాసి

దేవుడికి పూజ చేస్తే బావుంటుంది. అతడి నామం జపిస్తే బావుంటుంది. రోజుకు రెండుసార్లు స్నానం చేసి శుద్ధిగా ఉండి నుదుట నామం దిద్దుకుని 'భక్తుడు' అనిపించుకుంటే బావుంటుంది. ఇలా అనిపించుకోవడం వెనక మనసుకు ఏదైనా ఆరాటం ఉందా? ఈ జీవితాన్ని కోరుకునేవాళ్లు ఎందరు? ఎందుకు ఇలా ఉంటే బావుంటుంది? ఇది భగవంతుడికి సంబంధించిన జీవితంలా కనిపిస్తోంది. ఇదే ఆధ్యాత్మికతా, ఇంతటితో దైవసాక్షాత్కారం అయిపోతుందా?
దేవుడి కోసం కొండలు, కోనలు తిరిగినవాళ్లు ఉన్నారు. జుట్టు జడలు కట్టి, పిచ్చివాళ్లయిపోయి ఏకాంతంగా ఆ ఈశ్వరుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నవాళ్లూ ఉన్నారు. సత్సంగాలు, భజనలు, సామూహిక ప్రార్థనలు చేస్తూ జీవితంలో సింహభాగాన్ని వెచ్చిస్తున్న వాళ్లూ ఉన్నారు. పురాణాలు, శాస్త్రాలు, వేదాలు, గురువులను విశ్వసిస్తూ ఏదో ఒక సాధనలో ఎంతో కొంత దూరం వెళ్లి అక్కడ ఆగిన వాళ్లూ ఉన్నారు.

దేవుడి కంటే ముందు మనిషికి, అతడి జీవితం కరుణించాలి. జీవితం అతడికి ఆ అవకాశం ఇవ్వాలి. జీవితం చాలా విలువైనది. జీవితం భగవంతుడి వరప్రసాదం. చక్కగా జీవించాలి. గొప్పగా జీవించాలి. జీవితాన్ని ప్రతిక్షణం ఆనందమయం చేసుకోవాలి. నిజమైన ఆనందాన్ని కనుగొనాలి. జీవిత పుష్పం సృష్టికర్త తోటలో పరిమళాలు గుబాళించాలి.

మనం భగవంతుడి వెంటపడటం కాదు. భగవంతుడే మన వెంటపడాలి. ఎన్ని చేసినా, ఎలా ఉన్నా, ఏ ఆహార్యం ఎలా మార్చుకున్నా బాహ్యాడంబరాలకు ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు దేవుడు. అంతరంగం నిజాయతీగా ఉండాలి. వినయ విధేయతలు కలిగి, మానవ హృదయాల్లో నిండి ఉన్న భగవంతుడి వైపు ప్రేమతో మన జీవితం సాగిపోవాలి. కళ్లముందు కనిపిస్తున్న ఈ ప్రపంచానికి మించిన సాధనావస్తువు మరొకటి లేదు. ఇదెంత సమ్మోహన పరుస్తున్నా, ఈ రంగులు, ఈ మాయలు అక్కర్లేని వాళ్లెవరు? కాని, వీటిని తప్పక అధిగమించాలి. మనం ఎదగాలి. ఆలోచన విస్తృత పరచుకోవాలి. అంతర్ముఖులు కావాలి. ఈ విశ్వచక్రం తిప్పుతున్నవాడిని నిలబెట్టి నిలదియ్యాలి. వాడెక్కడ ఉంటాడో, ఏ ప్రదేశంలో ఉంటాడో, ఎంత అందంగా ఉంటాడో? ఇంత అద్భుతమైన జగత్తును ఒక గొప్ప కళాఖండంగా నివాసయోగ్యంగా తీర్చిదిద్దిన ఆ దివ్య సౌందర్యమూర్తి హృదయం ఎలా ఉంటుందో?ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఆ ప్రేమమూర్తి పలుకులు వినాలి. ఆ రూపాన్ని తనవితీరా దర్శించాలి.

ఎంత దూరమైనా పరుగుతీస్తాను. ఎన్ని కష్టాలకైనా వెనకాడను. ఏ పుణ్యక్షేత్రంలో అతడు దాగిఉన్నా, ఎంత లోతైన లోయలో అతడు తిరుగుతున్నా, ఏ కొండ శిఖరంపైన అతడు కూర్చున్నా, అతడిని పట్టుకుంటాను... ఇలా సాగే ఆలోచనా స్రవంతి భగవంతుడికి మనకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. అతడిపై మనకు ప్రేమ పెరుగుతుంది. ఇప్పుడు ఆట మొదలవుతుంది. కష్టాలు ప్రారంభమవుతాయి. కన్నీళ్లు వస్తాయి. ఎంత దూరం వెళ్తున్నా దైవం జాడలేదు. ఎందుకీ అన్వేషణ? వృథా ప్రయాస అనిపిస్తుంది. వూహించని పరీక్షలు, హఠాత్పరిణామాలు... దైవదూషణ కూడా జరుగుతుంది. ఎంతో కోపంగా, పరుషంగా మాట్లాడతాం. ఎదుట దైవం తలవంచుకుని ఒక వ్యక్తిలాగ నిలుచున్నట్లు భావిస్తూ అతడికి శాపనార్థాలు పెడతాం. మనం ఇప్పుడు భగవంతుడితో మాట్లాడుతున్నాం. ఆ అవకాశం ఆయన ఇచ్చాడు. ఆయన కూడా నిత్యం మనతో మాట్లాడుతూనే ఉన్నాడు... ప్రతి సంఘటనలో, ప్రతి సందర్భంలో అతడు మనకు బోధ చేస్తూనే ఉన్నాడు. ఆ దృష్టికోణం మన దగ్గర లేదు. ఆ నేత్రం ఇంకా తెరుచుకోలేదు.

నిద్రపోతూ కల కన్నాం. ఆ కలలో కొన్ని వేల మైళ్లు ప్రయాణం చేశాం. కళ్లు తెరిచాం. స్వప్నం తొలగిపోయింది. చూస్తే, మన ఇంటిలో మన పరుపు మీదే నిద్రపోతూనే ఉన్నాం. మరి ఈ ప్రయాణమంతా ఏమైనట్లు?

భగవంతుడి కోసం తిరగాలి. తప్పులేదు. కాని, అతడు యథాతథంగా ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఆ దిశలో ప్రయాణం చెయ్యాలి. అదెలా తెలుస్తుంది? గాలి పీల్చుకోవడానికి కాశీ వెళ్లాలా? ఆకాశం చూడటానికి అమర్‌నాథ్‌ వెళ్లాలా? 'నన్ను చూడాలంటే మొట్ట మొదట నిన్ను చూడు' అంటాడు భగవంతుడు. మనకు హృదయం ఇచ్చింది అతడు కూర్చోవడానికే. మనలో లేని భగవంతుడు బయట ఎన్నటికీ ఉండడు. 'ప్రాణులకు ప్రాణమై ఉన్నాడు ఈశ్వరుడు' అంటాడు కబీరు.

- ఆనంద సాయి స్వామి