ᐅమౌన క్రతువు
భగవంతుడు కరుణాసముద్రుడు. అనంత కరుణామయుడు కాబట్టే సముద్రంతో పోలుస్తారు. ప్రతి ఒక్కరూ ఆయన కృపకు పాత్రులే. కృపను పొందాలంటే భక్తి ముఖ్యం. మనం ఆయనను ఆరాధించినకొలదీ ఆయన మాధుర్యం పెరుగుతూనే ఉంటుంది. ఆయన దయను అనుభవించిన కొలదీ ఆయన నుంచి ప్రవహించే అమృత ప్రవాహాల్లో మన జీవితాలు పులకించిపోతాయి మరింతగా. సముద్ర మథనం చేస్తే అమృతం లభించింది దేవతలకు. భగవంతుడే ఒక సుధాసాగరం భక్తులకు.
భగవంతుణ్ని ఎలా ఆరాధించాలి? భగవంతుణ్ని సంతృప్తిపరచడానికి మనం ఏ గుణాలు ప్రోది చేసుకోవాలి? ముక్తి అనేది ఒక మౌన శిఖరం. నీరవత. ఏ పనీ చేయకుండా నిశ్శబ్దంలో నిమగ్నం కావడం. ఏమీ చేయకుండా నిష్క్రియత్వం పొందడం తేలిక అనిపిస్తుంది. కాని ప్రయత్నం చేస్తేనేగాని ఆ మౌనవ్రతం ఎంత కష్టమో తెలియదు.
ఒక ఆలయంలో ఓ వ్యక్తి మౌనంగా కూర్చొనేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. మిగిలినవారు ఆలయాన్ని శుభ్రం చేసేవారు. పూజారులు పూజాదికాల్లో మునిగేవారు. అతను మాత్రం ఏ పనీ చేసేవాడు కాడు. పూజారులు ప్రసాదం పంచిపెట్టే సమయంలో అతనికి కొంచెం ఎక్కువగానే పెట్టేవారు. పగలంతా పనిచేసేవారికన్నా ఆ వ్యక్తికి ఎక్కువ ప్రసాదం ఎందుకు పెడుతున్నారా అని మిగిలినవారు ఆశ్చర్యపడేవారు. ఏ పనీ చేయకుండా మౌనవ్రతం పాటించడం చాలా కష్టం అని పూజారులు వారికి చెప్పారు. భగవంతుణ్ని ధ్యానం చేయాలంటే మౌనాన్ని పాటించి తీరాలి. మనం ఎప్పుడూ మాట్లాడుతుంటే భగవంతుణ్ని గురించి ఎలా ఆలోచించగలం? ఆలయంలో పూజ చేస్తున్నా, భగవంతునివైపు తిరిగి ప్రణామం చేస్తున్నా మనం మాట్లాడుతూనే ఉంటాం. అటువంటి సంభాషణలు మన దృష్టిని మరల్చివేస్తాయి. మన ఆలోచనలు భగవంతుడి దాకా చేరలేవు.
భగవంతుడు రాశీభూతమైన జ్ఞానం. అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టే కాంతి స్వరూపం. ఆలయదీపాలు, కర్పూరజ్వాలలు అందుకు సాక్ష్యం. ప్రపంచ జ్ఞానం కోసం కాకుండా ఆత్మజ్ఞానం కోసం భగవంతుణ్ని ప్రార్థించాలి. మానవాళి అందరి సంక్షేమం కోసం ప్రార్థించాలి. కాని మనలో చాలామంది తమకోసమే ప్రార్థించి వూరుకొంటారు. ప్రార్థన జీవితంలో భాగం కావాలి. కాదు, జీవితమే కావాలి.
జ్ఞానాన్ని పొందాలంటే మనకు (మనశ్శరీరాలకు) క్రమశిక్షణ అవసరం. ఈ క్రమశిక్షణ, ఏకాగ్రత కోసమే యజ్ఞయాగాది క్రతువులు ఏర్పరచారు మన పెద్దలు. ఆ క్రతువులు ఆరాధన కాదు. హృదయంతో ప్రార్థించడం కానేకాదు. అవి బాహ్య ఉపకరణాలు మాత్రమే. యజ్ఞాలవల్ల లభించే స్వర్గసుఖాలు మన లక్ష్యాలు కాకూడదు. నిజమైన ప్రార్థన దేన్నీ కోరదు.
సత్య సాక్షాత్కారం పొందడానికి జీవితాన్ని ఒక సౌందర్య యజ్ఞంగా మలచుకోవాలి. జీవితమథనంతో భగవంతుని కారుణ్య అమృతం కోసం జీవితాన్నే ఒక మౌన ఆనంద క్రతువుగా మార్చుకోవాలి. జీవితాన్ని దివ్య మానవతాయాగంగా తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే భగవంతుడి కరుణాదృష్టి, కరుణావృష్టి మనపై వర్షిస్తాయి. అప్పుడే మన జీవితాలు నవ వేదాలవుతాయి. మన నిశ్శబ్దాలు విశ్వమంత్ర ధ్వానాలవుతాయి. మౌనం అమృతగానం అవుతుంది. జీవనదీపాలు మహోన్నత భవితవ్యాలవైపు, మహోజ్జ్వల ప్రస్థానాల వైపు హోమాగ్ని శిఖలై ప్రజ్వరిల్లుతాయి.
- కె.యజ్ఞన్న