ᐅ వీడా పురుషుడు



ᐅ వీడా పురుషుడు!

భగవంతుణ్ని పరమ పురుషుడన్నారు. పురుషోత్తముడన్నారు. శ్రీరాముణ్ని మర్యాదా పురుషోత్తముడన్నారు. 'పురుష' పదానికి అంతరార్థం, ఆధ్యాత్మికార్థం వేరే ఉన్నా- లోకంలో మగవాణ్నీ పురుషుడనే అంటారు. భగవత్‌ సమానంగా పిలిపించుకునే మగవాడు నీచాతినీచంగా మృగాడని అనిపించుకునే అధోస్థాయికి దిగజారాడేమిటి? పెద్దలు మనకు చెప్పేమాట, చేసే సూచన- 'మన వంశానికి కొత్తగా పేరు తేకపోయినా ఫరవాలేదు. పెద్దలు సంపాదించిపెట్టిన మంచిపేరుకు మచ్చతేవద్దు' అని. తండ్రిగా, సోదరుడిగా, భర్తగా, దైవసమానంగా మెలగాల్సిన మగవాడు తాను పెట్టిన గుడ్లను తానే మింగేసే పాములా స్త్రీని, తన తల్లిని, తన సోదరిని, తన బిడ్డను తానే చిదిమేస్తున్నాడు. కబళిస్తున్నాడు. ఆ పరమేశ్వరి కూడా మాతృరూపంలో అంటే స్త్రీ రూపంలో సంస్థితురాలై ఉంది. బాలాత్రిపుర సుందరిగా బాలికై, బిడ్డయి సేవలందుకుంటోంది. ఆ నారాయణుని సోదరిగా కృష్ణ, నారాయణి అని పిలిపించుకుంటూ పూజలందుకుంటోంది.
పుట్టింది మొదలు తల్లిగానో, సోదరిగానో, భార్యగానో, బిడ్డగానో, చివరకు కోడలిగానో ఓ మగువ తోడు, ఆసరా లేనిది మగవాడికి మనుగడే లేదు. కవచ కుండలాల్లా, కొంగుబంగారంలా స్త్రీ మగవాడిని ఏదో రూపంలో రక్షణ కవచంలా కాచుకుంటూనే ఉంది.

పూర్వం రెండు రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు గెలిచిన రాజు ఎంత క్రూరుడైనా శత్రురాజుల అంతఃపుర కాంతలకు హాని తలపెట్టకపోవటం అటుంచి సోదరి సమానంగా గౌరవించి పంపేవాడు. భార్యను తప్ప లోకంలోని మిగిలిన స్త్రీలనెల్లా మాతృభావంతో మన్నించే సంస్కృతికి నెలవైన భారతదేశంలో ఇప్పుడీ కీచక పర్వం ఏమిటి? మన సంస్కృతిని ఆరాధిస్తూ ఈ అమృతతుల్య దేశాన్ని వీక్షించి ధన్యులమవుదామని వచ్చే విదేశీ వనితలను సైతం వదలటంలేదంటే, ఈ వూహాతీతమైన ధోరణిని నిలదీసేందుకు, నిరసించేందుకు సైతం వాళ్లకు మాటలు రాక నిశ్చేష్టులైపోతున్నారంటే వాళ్లముందు మనం తలలు ఎక్కడ పెట్టుకోవాలి? తల్లిదండ్రులు, గురువు సమానంగా 'అతిథి దేవోభవ' అనే మహామంత్రాన్ని మనకుపదేశించిన మన వేదాలు 'వేద ప్రమాణం' అనే మాటకు తిలోదకాలు వదులుకోవాల్సిందేనా? ఆచరించేవారు లేనప్పుడు ఆ దేశాల అవసరం మాత్రం ఏముంది?

స్త్రీ పురుషులు అన్నివిధాలా సమానులు. సమాన ప్రతిపత్తి, సమాన శక్తి, సృష్టి చాలనం కోసం శరీర నిర్మాణంలో కొన్ని సర్దుబాట్లు, కొన్ని వెసులుబాట్లు... అంతే. తీగకు వృక్షం పందిరి అవుతుంది. ప్రేమతో ఆదరిస్తుంది. తీగ వృక్షానికి శోభనిస్తుంది. ఆత్మీయ పరిష్వంగాన్నిస్తుంది. ఎంత తీయని అందమైన బంధం! ఆపాటి ఇంగితం లేదా మనుషులకు? మృగాళ్లకు! ఎవరో చేసే దుర్మార్గానికి మగజాతినే నిరసించాల్సి వస్తోంది. అసహ్యించుకోవాల్సి వస్తోంది... తండ్రి అయినా... సోదరుడైనా, బిడ్డ అయినా. ఇదంతా కేవలం స్త్రీల సమస్యే కాదు. పురుషుల సమస్య కూడా. మొత్తం మానవజాతి సమస్య. స్త్రీలు అసహ్యించుకునే జాతిలో తాముండటం వాళ్లకైనా జీర్ణించుకోలేని అంశమే. అవమానకరమే. అభ్యంతరకరమే.

ఈ లోకంలోనే మానవతిగా, అభిమానవతిగా, ఆ గుణాలకు ఉత్కృష్ట సంకేతంగా నిలిచిన స్త్రీ... ఆ అభిమానం ముందు, ఆత్మగౌరవం ముందు ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా తోసిరాజంటుంది. ఆడపడుచంటే మన ఇంటి ఆడపిల్ల ఒక్కతేనా? ఏ ఆడపిల్లయినా ఒక ఇంటి ఆడపడుచు కాదా? మన దేశం కూడా స్త్రీకి సంకేతంగా 'మాతృభూమి'గా మన్ననలందుకుంటోంది. మనం నివసించే, మనను భరించే భూమిని కూడా భూమాత అంటున్నాం. ముక్కోటి దేవతలకు నిలయమైన ఆవును 'గోమాత' అంటున్నాం. ఏ రకంగా అయినా సరే... మన అత్యున్నత గౌరవాన్ని అందుకునే స్థానంలో తప్పనిసరిగా స్త్రీ మూర్తి ఉంటోంది. అలాంటి దేవీమూర్తినా ఇలా ఘోరంగా అవమానించడం?!

ఈ లోకంలోనే పవిత్రతకు, ప్రేమకు, సేవకు తిరుగులేని ప్రతీక స్త్రీ. దురదృష్టవశాత్తు ఆ పవిత్ర పరిమళానికి కోమల దళాలు, సౌకుమార్యం, సున్నితత్వం, స్నిగ్ధత్వం ఉన్నాయి. వాటిని ఆసరాగా చిదిమేస్తున్న అసురుడు మృగాడు. జీవితాన్నే పరిమళింపజేసే స్త్రీని కాలరాస్తున్న కాలయముడు.

నిప్పుకు చెద పట్టదు. కానీ, విచిత్రం... మన సంస్కృతిని జాడ్యం పట్టింది. సంస్కృతి మనను రక్షించే తల్లి. మనం రక్షించుకోవలసిన బిడ్డ కూడా. మన బిడ్డకు జబ్బు చేస్తే- తల్లీ తండ్రీ ఇరువురూ ఒక ఆందోళనై, ఒక ఆత్మీయతై, ఒక ఆత్మ అయి, బిడ్డను కాపాడుకుంటాం. ఒక తల్లికి అనారోగ్యం చేస్తే ఆమె బిడ్డలు ఆడ, మగ తేడా లేకుండా ఆదుర్దా పడతాం. మరి మన సంస్కృతిని అందరూ ఒక్కటై, తల్లీతండ్రీ అయి, బిడ్డలను కూడా రక్షించుకోవలసిన అవసరం ఉంది. భారతీయ సంస్కృతిని తన భుజాల మీద మోసే కంకణబద్ధురాలు స్త్రీ. ఆమెనే కూలదోస్తే ఇక సంస్కృతికి దిక్కెవరు?

- చక్కిలం విజయలక్ష్మి