ᐅ యోగి- భోగి
ᐅ యోగి- భోగి
ఒక భోగి. ఒక యోగి. అక్షరమే తేడా. కానీ ఎంత తేడా! భోగి క్షరుడు. యోగి అక్షరుడు. పొంతనే లేని వ్యాపారం. వ్యవహారం. జీవితాన్ని, ఆయుష్షును కొంతకాలానికే పరిమితం చేసి అంతలోపలే ఆబగా అనుభవించాలనుకునే అమాయకుడు భోగి. ఆయుష్షును ఆత్మతో అనుసంధానం చేసి, ఆ రీత్యా దానికి శాశ్వతత్వాన్ని ఆపాదించి చిరంతానందంలో ఓలలాడుతున్నవాడు యోగి. భోగి తదుపరి పరిణామం రోగి. భోగ కారకమైన ఏ వస్తువైనా, ఏ అనుభవమైనా రోగానికే హేతువవుతుంది. సామాన్య జీవితం నుంచి అసామాన్య భోగలాలసకు ఎగబాకిన ఎవరైనా వైకుంఠ పాళిలోని పాము నోట్లో పడక తప్పదు. విషప్రాయమైపోకా తప్పదు. జీవితం ఇది. జీవించేందుకు. కేవలం మరణించేందుకు కాదు. అయితే ఏది జీవితం, ఏది మరణం? యుగయుగాలుగా మనం ఎందరినో స్మరిస్తున్నాం. మరెందరినో విస్మరిస్తున్నాం. యోగులు, త్యాగులు, విరాగులు, మహాత్ములు, మహోన్నతులు. వీళ్లంతా అమృతమయులు. వీరికి మరణం లేదు. భోగులు, రోగులు (మానసిక), నిరంకుశులు, స్వార్థపరులు (సంపన్నులే కానీగాక. సౌందర్యమూర్తులే కానీగాక)... వీరు మృతప్రాయులు. జీవించీ మరణించినవారు. అలాంటివాళ్లంతా విస్మరణీయులు. ఔన్నత్యానికి మరణం లేదు. నీచత్వానికి జీవితం లేదు. ఈ రెంటినీ అర్థం చేసుకోవాలి.
యోగి ప్రత్యేకంగా ఉండడు. ప్రత్యేక వేషధారణ ఉండదు. జీవితాన్ని దాని నియోగార్థంలో వినియోగించుకున్నవాడు యోగి. అష్టాంగ యోగాన్ని ఔపోసన పట్టవలసిన అవసరం లేదు. ఆత్మను గ్రహించినవాడు, ఆత్మానుభూతితో చరించేవాడు, లోకాన్ని తిరస్కరించవలసిన అవసరం లేకుండా లోకంతో మమత్వంతో కాకుండా మానవీయతతో మమేకమై ఏకాత్మతా భావంతో నిరామయంగా, నిర్వికారంగా ఉన్నవాడు యోగి. అలాంటివాడు యోగి. అతడు నిరాడంబరుడు. ఆడంబరాన్నీ నిరాడంబరంగా మలచుకునే యోగ్యుడు. భోగంలోని మాలిన్యాన్ని మహత్వంగా గెలుచుకునేవాడు. నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగినవాడు. ఆంతర్యంలోనే ఆనందాన్ని దర్శించినవాడు. కళ్లు తెరవాల్సిన అవసరమే లేకుండా అన్నీ పొందిన ఆ భాగ్యశాలికి ఇక కోరికలతో పనేముంది? కోరికల వెంపర్లాట లేనివాడికి క్రోధం లేదు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అసలే లేవు. మరో, మరే ఆశ, ఆలోచన లేనివాడు. నిరంతర ఆత్మావశిష్టుడై ఉంటాడు. ఇంతకంటే మానవ జన్మకు మరో ఉద్దేశం, ఉన్నతాశయం, వూర్ధ్వగమనం... ఏమీ ఉండదు. అతనికి ఎవరూ ఉండరు. కానీ అందరూ అతని వారే. అతనికి అందరూ ఉంటారు. అయినా అతను ఎవరూ లేనివాడే. ఏక నిరంజనుడే.
మనిషి భోగే కావాలనుకుంటే అందుకు మనిషే కానక్కర్లేదు. ఆహార నిద్రాభయ మైథునాలను పశుపక్ష్యాదులు కూడా భోగిస్తాయి- కానీ మానవ జన్మ, జీవితం ఒక యోగం. యోగి కావడమే సహజం కావాలి కూడా. పళ్ల చెట్టు పళ్లు కాస్తుంది. పూల మొక్క పూలు పూస్తుంది. సహజం. యోగమే జీవితంగా జన్మించిన మనిషి మరి యోగి కావడమే సహజం. సహజ వినిమయం. యోగమంటే సన్యాసం కాదు. విసర్జనం కాదు. సవ్య వినిమయం. సమర్థ వినిమయం. వేద విహిత జీవనం. ధర్మబద్ధ జీవనం. దీనికై మనిషి వేద పఠనమే చేయనక్కర్లేదు. ప్రతి అడుగూ ఆధ్యాత్మిక స్పర్శను కలిగి ఉండాలి. ప్రతి శ్వాసా పారమార్థిక పరిమళాలతో నిండాలి. ధర్మం ఆదర్శం కావాలి. ఆచరణ కావాలి. మరి... ఏది ధర్మం, ఏది వేదవిహిత జీవనం? ఎవరు చెప్పేవాడు, సూచించేవారు, నిర్దేశించేవారు? సత్సంగం. సద్గ్రంధ పఠనం. సద్విషయ శ్రవణం. సద్గురు సమాశ్రయం.
కాలం చేతివేళ్ల సందుల్లోని నీళ్లలా మనకు తెలీకుండానే జారిపోతూంటుంది. అలా పోనీయకూడదు. అమృత సమానంగా ఒడిసి పట్టుకుని, ఆచమన సదృశంగా కేశవ నామాలతో పానం చేయాలి. తులసి తీర్థంలా ఆచరణ యోగ్యంగా స్వీకరించిన కాలం మన జీవన ఆంగణాన్ని, ఆంతర్య ప్రాంగణాన్ని పరమపవిత్రం చేస్తుంది. అప్పుడు ప్రపంచమే పరమపదమై మోక్షకారిక సదనంగా భాసిస్తుంది!
- చక్కిలం విజయలక్ష్మి