ᐅ త్రిశంకు స్వప్నం
ᐅ త్రిశంకు స్వప్నం
ఒకవైపు ఆధ్యాత్మికలోకాల పిలుపులు, మరోవైపు జీవన మాధుర్యాల తలపులు. అటు దైవం, ఇటు జీవితం. సత్యశివ సౌందర్యాలు దూరతీరాలనుంచి రా రమ్మని ఆహ్వానిస్తుంటాయి. మమ్మల్ని వదలేస్తావా అని నిత్య భవబాంధవ్యాలు కలవరిస్తుంటాయి.
ఈ జీవితం స్వర్గ, వాస్తవాల మధ్య వేళ్లాడే త్రిశంకు స్వప్నం. జీవితాన్ని వదులుకోలేం పూర్తిగా. ఆధ్యాత్మికత వైపు తిరిగి ప్రయాణించకుండా ఉండలేం. ఇది చాలామంది పరిస్థితి. యథార్థ స్థితి. చివరికి రెంటికీ చెడిన రేవడులా మారిన స్థితి. నైరాశ్యం, అసంతృప్తి, ఏదో కోల్పోతున్నామన్న పరివేదన, నిరాసక్తత, నిస్సహాయత, నిర్వీర్యత, నిర్లిప్తత- ఇదీ జీవితం! ఇదా జీవితం, ఇదేనా?
జీవితంలోనే ఉండి భగవంతుణ్ని సాక్షాత్కరింపజేసుకోలేమా? అలా దైవాన్ని పొందగలిగిన భక్తులు గతంలో లేరా? అది అసంభవమా, అలా చేయడం తప్పా? జీవితం 'సగం విరిగిన వీనస్' కాదు. భగవంతుడిపై వెల్లివిరిసిన ఆలోచనల ప్రవాహాల్లో జీవితం పూర్ణ వికసిత బింబంగా, దివ్య ప్రతిమగా మారుతుంది.
బాధల గండశిలలు దాటిన పిమ్మట ఆనందతీరాలు కనిపిస్తాయి. పొరపాట్లు, తప్పిదాలు, అసత్యాలు అస్తమించిన చోట సత్యం నిండుగా ప్రకాశిస్తుంది. చీకటి మబ్బులు చెదిరిపోయిన సీమలో వెలుగుధారలు కురిసిపోతాయి. జుగుప్సావహమైన లోకపు వైకల్యాల వెనక ఒక అతిలోక సౌందర్యం రాశీభూతమై ఉంటుంది రహస్యంగా.
వికృత రూపాలు నిండిన ఈ లోకాన్ని చూసి అవతారాలు, దేవతలు ఏనాడూ అసహ్యించుకోరు. అలా లోకాన్ని నిరసిస్తే వారు అవతారాలే కాదు. వైకల్య శాపగ్రస్త అయిన కుబ్జ శ్రీకృష్ణుని భువనమోహన స్పర్శతో అతిలోక రమణీయ రూపసిగా మారలేదా? కబంధుడు వికృత స్వరూపుడు. శ్రీరాముడి దివ్యాస్త్రం అగ్నిస్పర్శతో తన వైకల్యాన్ని పోగొట్టుకున్నాడు కదా! మానవ వైకల్యానికి సత్యమే దివ్య ఔషధం.
భగవంతుడివైపు తిరిగినప్పుడు సగం విరిగిన జీవన ప్రతిమ పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. అంతమాత్రాన ప్రతిమ తన ప్రత్యేక విలువను పోగొట్టుకోలేదు.
సర్వ మానవాళిలో దివ్య సౌందర్య మహత్వాన్ని వీక్షించి, ప్రేమించి, ఆనందాన్ని పొందితే అంతకుమించిన భగవత్ సాక్షాత్కార దర్శనం ఉంటుందా?
'నీలో దైవాన్ని దర్శించు, నీ పొరుగువాడిలో దైవాన్ని తిలకించు. దేశంలో దైవాన్ని వీక్షించు. మానవాళిలో దైవత్వాన్ని చూడు. చెట్టులో, రాయిలో, మృగంలో, ప్రపంచంలోపలా, వెలుపలా దైవాన్ని చూడటం నేర్చుకో'- అన్న తత్వవేత్తల ప్రవచనసారం తెలుసుకుంటే చాలు, జీవితం ధన్యమవుతుంది, సార్థకత చెందుతుంది. పూర్ణత పొందుతుంది.
ప్రపంచాన్ని చిరంతన భగవద్రూపంగా దర్శించగలిగితే మనం విముక్తులవుతాం. భగవంతుని అక్షరధామంలో ముక్తి పురుషులుగా భాసిస్తాం.
ఆ అనుభవమే ఈ భూమిపై జీవన్ముక్తికి కాంతి మార్గం. భగవంతుని భువన సామ్రాజ్యంలో నిత్యులమై నిరవధిక ఆనందం పొందుతాం! యోగులైనా, జీవన విరాగులైనా, జీవన ప్రేమికులైనా చేరవలసిన మహోన్నత శిఖరం అదే, అదే!!
- కె.యజ్ఞన్న