ᐅ ఆనందసౌధం
మాతృదేవి గర్భంలో శిశువు గర్భచెర నవమాసాలూ అనుభవిస్తుంది. ప్రసవ సమయంలో తల్లితోపాటు బిడ్డా వేదన పడుతుంది. గర్భచెర వీడాక ప్రపంచ వాతావరణంలో ఇమడలేక బిడ్డ రోదిస్తే సరి; లేదా గిల్లి ఏడిపించడం లోకంతీరు. తల్లి పురిటి నొప్పుల నుంచే శిశువుకు జీవన పోరాటం ఆరంభమవుతుందన్నమాట! తరవాత ఎన్నో బాలారిష్టాలు. వైద్యశాస్త్రం పెద్దగా అభివృద్ధిచెందని రోజుల్లో ఈ బాలారిష్టాలు ప్రాణాంతకంగా ఉండేవి!
విద్యాభ్యాసంలో బిడ్డ మరిన్ని విన్యాసాలు చేయాల్సి ఉంటుంది. అప్పజెప్పాల్సిన పాఠ్యాంశాల నుంచి ఆటపాటల్లో పోటీదాకా అన్నీ సవాళ్లే! తొలి గురువు తల్లి సాహచర్యంలో మాతృభాష నేర్వడం నుంచి బాంధవ్యాలు నెరపడం నేర్చేదాకా అన్నీ పాఠాలే!
యౌవనంలో తనువు, మనసు వికసిస్తాయి. ఆరోగ్యంతో కాంతులీనే ముఖ వర్ఛస్సుతో ఉండే యువతీ యువకులకు శాంతి లభిస్తుందా? అప్పటికి తగిన సమస్యలు అప్పుడుంటాయి. ఉద్యోగం, వ్యాపారం, జీవిత భాగస్వామి ఎంపిక, సంతానం- ఇలా ఎన్నో సవాళ్లు. మరి మానవ జీవితంలో ఆనందం ఉండనే ఉండదా? ఈ విషయంపై ఎందరో మహనీయులు కసరత్తు చేశారు. మార్గాలూ సూచించారు.
తమ బిడ్డ- అయితే ఓ చక్రవర్తి, లేకపోతే ఓ సన్యాసి అవుతాడని జ్యోతిష పండితులు చెప్పినప్పుడు శుద్ధోధన మహారాజు కలతచెందాడు. తమ కుమారుడు సిద్ధార్థుడు ఓ సన్యాసి కాకూడదని ఎంచి అతడికి ఎటువంటి కష్టమూ తెలియకుండా రాజభవనంలో స్వర్గ సౌఖ్యాల మధ్య పెంచి పెద్దచేశాడు. యుక్తవయస్సు వచ్చాక రాకుమారుడికి ఓ అందాలరాశితో వివాహం జరిపించాడు. ఒకరోజు సిద్ధార్థుడు యథాలాపంగా ఓ వృద్ధుని, రోగిని, సన్యాసిని, శవాన్ని చూసి మనోవ్యాకులత చెందాడు. అంతే! సౌందర్యవతి అయిన భార్యను, ముద్దులు మూటకట్టే కుమారుని, రాజభోగాలను పరిత్యజించాడు. మానవుడు అనుభవిస్తున్న రోగాలు, జరామరణాది దుఃఖాలకు పరిష్కారమార్గం ఉంటే కనుగొనాలని బయలుదేరాడు. విస్తృతంగా దేశ సంచారం చేశాడు. ఓ వటవృక్షం కింద తపస్సు చేసి, జ్ఞానం పొందాడు. బుద్ధుడయ్యాడు. మనిషి 'నేను', 'నాది' అనే భ్రాంతి, కళ్ళెం వేయలేని కోరికలు, అజ్ఞానం వల్లనే దుఃఖభాజనుడవుతున్నాడని గ్రహించాడు. లోకాన్ని అద్వైత దర్శనం చేయగలిగిననాడు అజ్ఞానం తొలగి అతడికి శాంతి, ఆనందం చేకూరతాయని సిద్ధాంతీకరించాడు.
మనుషులు తమ తమ స్థాయుల్లో తమకు అందని వాటిని (ఆనందాన్ని) కోరుకుంటూ దుఃఖానికి లోనవుతుంటారు. సన్నిహితులు అనుభవిస్తున్న సంపద, సౌఖ్యాలు తమకు లభ్యంకానప్పుడు మనిషి పొందే అసూయ, బాధ వర్ణనాతీతం. ఓ జ్ఞాని చెప్పినట్లు సుఖంలాగే దుఃఖం కూడా ఓ మనోజనిత వికారం! 'నాకు దుఃఖం లేదు; నేను ఆనందంగా ఉన్నా'నని మనసును సమాధానపరచగలిగినప్పుడు- దుఃఖపు చారికలు మనసుకు అంటవు. దైవం ఆనందస్వరూపుడు. ఆయన బిడ్డలం. మనకు దుఃఖమేమిటి? ఈ పవిత్రభావన మనిషి జీవితాన్ని బలోపేతం చేస్తుంది. ప్రపంచం నశ్వరం, దుఃఖభాజనమే. అయినా, భయశోకాది మనస్తాపాలు లేని జీవితం కొందరికి లభిస్తునే ఉంది కదా!ఎందరో మహానుభావులు భౌతిక, ఆధ్యాత్మిక సంపదతో విలసిల్లుతున్నవారే! మరి మిగిలిన వారి గతి ఏమిటి? ఇందుకు సమాధానం-భావదారిద్య్రాన్ని వదిలించుకొని, మనిషి దృఢసంకల్ప శక్తితో ఆనందాన్వేషి కావాల్సి ఉంటుందని చెప్పాలి. మనోహరమైన ఆనంద సౌధాన్ని నిర్మించుకొనే అవకాశం వ్యక్తికి ఎప్పుడూ ఉంది. లేదంటే అది ప్రయత్నలోపమే అనిపించుకుంటుంది. ముమ్మాటికీ అది కాదనలేని నిజం!
- గోపాలుని రఘుపతిరావు