ᐅ ఉత్సాహం



ᐅ ఉత్సాహం

ఎనభయ్యేళ్ల వృద్ధుడు తెల్లవారుజామునే లేచి, చకచకా నడుచుకుంటూ వెళుతున్నాడు. దారిలో కనబడినవారినందర్నీ సరదాగా పలకరిస్తున్నాడు. అతడి ముఖంలో ఉత్సాహం తొణికిసలాడుతూ ఉంది. అతడితో మాట్లాడినవారందరిలోనూ లోగడలేని ఉత్సాహం పుట్టుకువస్తోంది. ఒక పదహారేళ్ల కుర్రాడు ఉసూరుమంటూ విద్యాలయానికి బయలుదేరాడు. అయిష్టంగా నడుస్తున్నాడు. 'ఇంత పొద్దున్నే తరగతులు పెట్టకపోతే ఏం పోయింది ఆ పంతులయ్యకి... మా ప్రాణాలు తీయడానికి కాకపోతే...' అని గొణుక్కుంటూ కాళ్లీడుస్తున్నాడు. ఇంతలో వృద్ధుడికి కుర్రాడు తారసపడ్డాడు. 'ఏరా మనవడా! నాతోబాటు నడవగలవంట్రా?' అన్నాడు వృద్ధుడు బోసినోటితో ముసిముసి నవ్వులు రువ్వుతూ! యువకుడు తప్పనిసరై వేగంపెంచి నడవసాగాడు. సమాజంలో ఇటువంటి దృశ్యాలు సామాన్యం. పిల్లలు పెద్దవాళ్లను అనుకరిస్తారు, అనుసరిస్తారు. యువకులకు పోటీతత్వం ఉంటుంది. వాళ్లను ప్రోత్సహించాలేగాని ఎక్కడాలేని ఉత్సాహాన్ని ప్రదర్శించగలరు. ఆ ఉత్సాహమే వారిని ముందుకు నడిపిస్తుంది.
మానవుడికి జీవన గమనంలో ఎన్నో కష్టానష్టాలు ఎదురవుతాయి. వాటినన్నింటినీ గుర్తుచేసుకుంటూ ఉంటే మిగిలేవి కన్నీళ్లే, నిరాశా నిస్పృహలే. వీటితో ఏ పనీ సక్రమంగా చేయలేని దురవస్థ, దుర్భరస్థితి. దీంట్లోనుంచి బయటపడే ఉపాయం ఏది?

రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్లిన తరవాత శ్రీరాముడంతటి మహాపురుషుడూ మానసికంగా కుంగిపోయాడు. ఆ సందర్భంలో లక్ష్మణుడు అన్నయ్యను ఓదారుస్తూ చెప్పిన మాటలు అందరూ నడవదగిన బాటలు.

'అన్నా! అన్నింటికంటే ఉత్సాహం మిక్కిలి బలమైంది. దాన్నిమించిన శక్తి దేనికీ లేదు. ఉత్సాహవంతుడు ఈ లోకంలో దేన్నయినా సాధించగలడు!' అని లక్ష్మణుడు శ్రీరాముడి హృదయాన్ని తిరిగి ఉత్సాహంతో నింపుతాడు. శ్రీరాముడు కార్మోన్ముఖుడై సీతాన్వేషణకు పూనుకొంటాడు. కొన్ని పరిస్థితుల్లో ఏ పనీ చేయబుద్ధి పుట్టదు. ఇలా డీలా పడిపోయి, దిగులుతో కూలబడే పరిస్థితి వస్తూ ఉంటుంది. 'ఎందుకు ఈ బతుకు?' అని భావించుకుంటూ, ఒక నిరుత్సాహ సముద్రంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. అర్జునుడంతటి మహావీరుడికే కురుక్షేత్రంలో ఈ భావన కలిగింది. అస్త్రశస్త్రాలు వదిలేసి నిస్పృహకు లోనయ్యాడు. శ్రీకృష్ణుడు అర్జునుణ్ని 'నీకు ఈ అకర్మణత్వం ఎందుకు వచ్చింది?' అని ప్రశ్నించాడు. 'గీత' బోధించాడు. భగవద్గీత విన్న తరవాత అర్జునుడిలో ఉత్సాహం పొటమరిచింది. విల్లు అందుకున్నాడు. ఇలా శ్రీకృష్ణుడు గీతామృతాన్ని ప్రసాదించి, మానవాళికి దైన్యాన్ని దూరంచేసి, ఉత్సాహంగా జీవన సమరంలో పాల్గొనే మానసిక స్థితిని అనుగ్రహించాడు.

'నిరుత్సాహం అప్రతిష్ఠాకరం... స్వర్గప్రాప్తికి ప్రతిబంధకం... లోకంలో దీనత్వం, విషాదం అనేవాటికి స్థానంలేదు... మన దేహాన్ని, మనసును దుర్భలం చేసే ఆలోచనే పాపం అంటే! ఈ బలహీనతను వదిలిపెట్టాలి... దిగులుపడటం తగనిపని' అని కృష్ణుడు బోధించాడు.

మన పాదాలపై మనం నిలబడాలి. స్వతంత్రంగా ప్రవర్తించాలి. ప్రకృతి బంధాలను తెంచుకోవాలి. ఉపనిషత్తులు దుర్బలత్వం తగదని పలు విధాలుగా హెచ్చరిస్తున్నాయి. బలంగా, దృఢంగా నిలబడమని ప్రబోధిస్తున్నాయి. అభీః (భయంలేకుండా) అనే మాట ఎన్నోసార్లు ఉపనిషత్తుల్లో వినబడుతుంది. ఏ మంచిపని చేయడానికైనా మొదట ఉండాల్సింది ఉత్సాహగుణం. ఆయుధం పట్టి తెల్లవాడిని వెళ్లగొట్టాలని ప్రయత్నించిన అల్లూరి సీతారామరాజుకు ఎంత ఉత్సాహం ఉందో, అహింసాయుత పోరాటం గావించిన గాంధీజీకీ అంతే ఉత్సాహం ఉంది. ధీరులైనవారి ఉత్సాహం రుజుమార్గంలో పయనింపజేస్తుంది. పారతంత్య్రంలో ఆత్మవిశ్వాసం పోగొట్టుకున్న భారతజాతికి వివేకానందస్వామి నూతనోత్సాహాన్ని కలిగించి, కర్తవ్యోన్ముఖుల్ని గావించాడు.

'ఓ వీరపుత్రా! నేను భారతీయున్ని అని గర్వించు. భారతీయుడు నా సోదరుడు. నా ప్రాణానికి ప్రాణం... భారత సమాజం నా బాల్యడోలిక, యౌవనంలో నందన వనం, వార్ధక్యంలో వారణాసి అని సగర్వంగా ప్రకటించు' అని పిలుపిచ్చాడు. వివేకానందుని పలుకులు జాతీయోద్యమానికి వూపిరిపోశాయి. దేశంలో నూతనోత్సాహం వెల్లివిరిసింది.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు