ᐅ పలాయన మంత్రం తగనిది
ᐅ పలాయన మంత్రం తగనిది!
ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కర్తవ్య వైముఖ్యం తగనిది. సమస్యల నుంచి పారిపోవడం పరిష్కారం కాదు. పారిపోతున్న కొద్దీ సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పటికైనా వాటిని ఎదుర్కోవాల్సిందే. మానవులందరిలోనూ యోగబలం ఉంటుంది. సమస్యలను అధిగమించడానికి సాధనతో యోగబలాన్ని ప్రకటితం చేసుకోవాలి. ఎంతటి కష్టాన్నైనా భరించగల బలమే యోగబలం. సమస్యలు ఆవహించినప్పుడు కొందరు భగవన్నామ స్మరణ చేస్తారు. తీర్థయాత్రలు చేస్తామని ముడుపులు కడుతుంటారు. మంత్రాలు చదువుతారు. ఇవన్నీ సమస్య నుంచి చేసే పలాయన మంత్రాలే!
మనిషికి దైవం ప్రజ్ఞను ప్రసాదించాడు. శరీరంలో శక్తినిచ్చాడు. ఆలోచనా పటిమనిచ్చాడు. కష్టాలు సంభవించినప్పుడు దైవం మనకు కల్పించిన యోగాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎలాంటి అవాంతరాలనైనా అధిగమించవచ్చు.
రావణుడితో యుద్ధానికి సంసిద్ధం కాగానే శ్రీరాముడికి వానరసేనతో సహా సముద్రాన్ని దాటాల్సిన సమస్య ఎదురైంది. వంద యోజనాల సముద్రాన్ని దాటడం కష్టమే. తాను అంగీకరిస్తే హనుమంతుడు సీతను లంకనుంచి తీసుకురాగలడు. సమస్యకు అది పరిష్కారం కాదు. అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడికి సముద్రుడు వరసకు మామ! కనుక తొలుత మామను ప్రాధేయపడ్డాడు. దారి కల్పించాల్సిందిగా వేడుకొన్నాడు. సమాధానం రాకపోవడంతో ఆహారం మాని దర్భశయనం చేసి మామపై అలుక ప్రదర్శించాడు. అయినా సముద్రుడు మారుపలకలేదు. సీత లంకలోనే రావణుని చెరలో ఉంది కనుక తన సేనతో అక్కడికి వెళ్లక తప్పదు. క్రోధాన్ని ప్రదర్శించి సముద్రంలో నీటిబొట్టు లేకుండా చేస్తానని బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దెబ్బకు దేవతలైనా దిగివస్తారన్నట్లు సముద్రుడు భయంతో చేతులు జోడిస్తూ సాక్షాత్కరించాడు. తన ఉపరితలంపై ఎంతటి బరువైన వస్తువైనా తేలియాడే వరం ఇచ్చాడు. రామసేనలోని నీలుడి ప్రతిభతో వారధి నిర్మింతమైంది. రావణ సంహారం జరిగింది. శ్రీరాముడు అలా యోగబలంతో సమస్యను పరిష్కరించుకొన్నాడు. మానవ శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడు సైతం సమస్యలను ఎదుర్కొనక తప్పదు. ఈ ప్రపంచంలో సుఖాలన్నీ మరెన్నో కష్టాలను వెంట తెచ్చుకొనే వస్తుంటాయి. వాటన్నింటినీ పరిష్కరించుకొంటూ ముందుకు సాగకతప్పదు.
సమస్యలు ఆవహించినప్పుడు కొందరు భీరత్వం ప్రదర్శిస్తుంటారు. పిరికితనంవల్ల శరీరం బలహీనమవుతుంది. ఎవరైనా బలహీనతలతో బాధపడుతున్నప్పుడు వారికి ధీరవచనాలు బోధించాలి. ధీరత్వంవల్ల శక్తి పుంజుకొంటుంది. ఒక చిన్న ధైర్యవాక్యమైనా ఎదుటివారిని ఉత్తేజితులను చేస్తుంది. మన లక్ష్యమనే శిల్పానికి మనమే శిల్పులం. ఇలా శిల్పిగా మారే అవకాశం మానవేతర జీవులకు లేదు. ఎందుకంటే జంతువును ప్రకృతి నిర్దేశిస్తుంది. సమస్యలు ఎదురైనప్పుడు ప్రకృతిని సైతం మనిషి నిర్దేశిస్తాడు. మనిషిలో రెండు ప్రకృతులు ఉన్నాయి. ఒకటి బాహ్య ప్రవృత్తి. ఈ ప్రవృత్తి బలహీనంగా ఉంటుంది. బాహ్య ప్రకృతిని నమ్మి సమస్యలను పరిష్కరించాలనుకొంటే సాధ్యపడకపోవచ్చు. బాహ్య ప్రకృతిలో భయాలు, పిరికితనాలు, శంకలు, అపనమ్మకాలు ఉంటాయి. ఇవన్నీ సమస్యలకు దూరంగా పారిపోయేలా చేస్తాయి. బుద్ధిగా పేర్కొనే ఆంతరంగిక ప్రకృతి మనిషిలోని మరో ప్రవృత్తి. బుద్ధిని వినియోగిస్తే ఎలాంటి సమస్యనైనా తేలికగా పరిష్కరించుకోవచ్చు. బాహ్య అంతర్గత ప్రవృత్తుల కలయికే మనిషి.
మనిషికి కష్టాలు, నష్టాలు, మానసిక శారీరక బాధలు సంభవించినప్పుడు దైవం మనకు ప్రసాదించిన అనంత తత్వజ్ఞానం ఆవిష్కరింపజేసుకోవాలి. తొలుత మేఘాలతో కప్పబడి ఉన్న సూర్యుడు మబ్బులు తొలగిన తరవాత ఎలా భాసిస్తాడో, అనంత తత్వజ్ఞానంవల్ల కష్టాలు సమస్యలు తొలగి వెలుగులు పరిష్కారమార్గాలు కనపడతాయి. మనిషి భయం వీడి జీవించడం అలవరచుకోవాలి. అప్పుడే సంపూర్ణత్వం సాధ్యమవుతుంది. సంపూర్ణత్వమే మానవుడి పరిణామ ఉచ్చదశ. భగవత్సాయుజ్యమే మానవ లక్ష్యం.
- అప్పరుసు రమాకాంతరావు