ᐅనేడు వసంతం
ᐅనేడు వసంతం
పూలు పూయనీ మాననీ నేడు మాత్రం వసంతం' అంటాడు ఓ కవి. నిజమే. ప్రతీ మనిషి వసంతం లాంటి వర్తమానాన్ని నమ్ముకొని ముందుకు సాగినప్పుడే విజేత కాగలుగుతాడు.
కాలం, కెరటం ఎవరికోసం ఆగవు. అవిశ్రాంతంగా ముందుకు పరిగెడుతూంటాయి. అలాగే మనిషి కూడా వర్తమానంలో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా నడిస్తేనే కార్యసాధకుడు కాగలుగుతాడు. అందుకే దేవుడిచ్చిన ప్రతీ క్షణాన్ని, ప్రతీ అవకాశాన్ని మనిషి సద్వినియోగం చేసుకోవాలి.
కాలాన్ని దైవస్వరూపంగా ప్రాచీనులు పేర్కొన్నారు. కాలనిర్ణేత కూడా ఆ భగవంతుడే. కాలానికి అధిదేవత సూర్యభగవానుణ్ని శాస్త్రాలు నారాయణ స్వరూపమని వర్ణించాయి. క్రమం తప్పని సూర్యోదయం ప్రతినిత్యం క్రమశిక్షణతో మెలగాలని మానవాళికి సందేశాన్ని అందిస్తుంది.
మనిషి ఏది పొందాలన్నా కాలం కలిసి రావాలంటారు. అంటే నేటి ఆలోచనలే భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అందువల్ల మనిషి నిరంతరం స్వయంకృషితో ముందుకు సాగాలి.
ఒక్కొక్కప్పుడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు వర్తమానంలో ఎదురవుతాయి. ఆ పరిస్థితులను ఆపే శక్తి ఎవరికీ లేదు. పురాణపురుషులైనా కాలానికి తలొంచి కర్మఫలాలు అనుభవించినవారే.
కాలప్రభావంవల్ల ధర్మరాజు భార్య, సహోదరులతో కలిసి అరణ్యాల్లో గడిపాడు. నల మహారాజు అష్టకష్టాలు అనుభవించాడు. దైవాంశతో జన్మించిన శ్రీరాముడు తనకెదురైన ప్రతికూల పరిస్థితులన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించి వర్తమానంతో రాజీపడుతూ ముందుకు సాగి నడతలో సాటిలేని నాయకుడుగా పేరుపొందాడు. రావణుని సంహరించి అవతార లక్ష్యాన్ని పూర్తిచేశాడు. పుట్టింది మొదలు ఎన్ని కష్టాలు ఎదురైనా దేనికీ చలించకుండా, ఎవరికీ లొంగకుండా దుష్టశిక్షణతో పురోగమిస్తూ ప్రతీ పనిలోను విజయం సాధించాడు శ్రీకృష్ణుడు. అసలైన వ్యక్తిత్వ వికాసమంటే ఏమిటో గీత ద్వారా అందరికీ బోధించాడు.
ఈ సందేశాన్ని అర్థంచేసుకున్న మనిషి వర్తమానంలో జరిగే ప్రతీ సంఘటనను స్థితప్రజ్ఞతతో స్వీకరించి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తాడు.
అందంగా, పచ్చగా కనిపించే ప్రకృతి కూడా కాలగతినిబట్టి నడుచుకోవడం ఎంత విచిత్రం, ఎంత అద్భుతం! గ్రీష్మరుతువు తరవాత తొలకరి ప్రారంభమై వానజల్లులు కురిసి సేద్యానికి అనువుగా పుడమి మారడం, పైరుపంటలు పండటం... ఈ విధంగా ప్రకృతి ప్రాణులకు ఆహారం అందివ్వడం ఎంత గొప్పతనమో కదా. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అంటే, ప్రకృతికి ప్రతీ క్షణం వసంతమే. ప్రతీ రుతువూ ఆనందకరమే.
గతించిపోయినదాన్ని గుర్తుచేసుకుంటూ వర్తమానాన్ని విస్మరించే మనిషికి ఏనాడూ మంచి భవిష్యత్తు ఉండదు. భావిజీవితం గురించి మితిమీరిన ఆశలు పెంచుకోవడమూ ఎవరికీ మంచిది కాదు. స్వయంకృషితో కొనసాగుతూ అంకితభావంతో ముందడుగు వేసే మనిషి ఆశయ సాధనలో విజయం సాధిస్తాడు.
'ఎంత ఆహ్లాదాన్ని కలిగించేదైనా భవిష్యత్తును విశ్వసించవద్దు... గతించిన గతాన్ని గురించి చింతించవద్దు. వర్తమానాన్నే నమ్ముకో, ఈ క్షణం నుంచే... ఇప్పటినుంచీ ధైర్యంతో పనిచేయడం ప్రారంభించు...'- అంటాడు అమెరికన్ కవి లాంగ్‌ఫెలో. ఇది సత్యం. వర్తమానంలో జీవిస్తూ శ్రమించేవాడే నిజమైన సాధకుడు. మనిషి చేసే పనిలో జీవం ఉట్టిపడాలంటే అతడు వర్తమానాన్ని నమ్ముకోవాలి. ప్రతీ క్షణంలో మమేకమవుతూ అంకితభావంతో పనిలో నిమగ్నం కావాలి. అప్పుడే మనిషి విజేత కాగలుగుతాడు. కాలం అమూల్యమైనది. తిరిగి రానిది. అందుకే కార్యసాధకులు గమ్యం చేరడానికి స్పష్టమైన కాలనిర్ణయం చేసుకోవాలి. ఆ కాలపరిమితిలోనే లక్ష్యాన్ని సాధించాలి. సంకల్పబలంతోనే మనిషి అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాడు. ఆత్మవిశ్వాసాన్ని వూపిరిగా చేసుకుని, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఎన్నెన్నో విజయాలు సాధిస్తున్నాడు.
వర్తమానంలో ఎదురయ్యే ప్రతీ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసే మనిషిని ఎలాంటి ఒత్తిళ్లూ దరిచేరవు. అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడవుతాడు. అంతర్ముఖుడుగా మారతాడు. అప్పుడతని హృదయం ఓ ప్రశాంత నిలయం. వర్తమానం ఎల్లప్పుడూ అతనికి నిత్యవసంతం.
- విశ్వనాథ రమ