ᐅ క్షమ... శిక్ష... శిక్షణ
భారతీయతత్వంలోని వివిధ సుగుణాల్లో క్షమ ఒక గుణరాజం. వ్యక్తిత్వాన్ని ఉన్నతం చేసి చూపే తత్వతేజం. ప్రతీకారేచ్ఛ లేని ఈ సత్వగుణ విశేషం మనసులను, వాతావరణాన్ని తేలికపరుస్తుంది. అమలినం చేస్తుంది... క్షమించేవారిదీ ఎదుటివారిదీ కూడా. ఓ వైపు అశాంతితో లావాలా ఉడికిపోతున్న ప్రపంచ దేశాల మధ్య భారతదేశంలో, శాంతియుత వాతావరణంలో ప్రశాంత కాసారంలా శాంతిపవనాలు వీస్తున్నాయంటే దానికి కారణం భారతీయ రక్తంలో ప్రసరించే సహజ క్షమాగుణమే. క్షమాగుణమంటే? ఎవరేం చేసినా చూసీ చూడనట్లుండిపోవడమేనా? ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించడమేనా? కాదేమో. క్షమ చాలా ఉదాత్తమైన అర్థంలో స్వీకరించాలి. అవగాహన లేని క్షమా గుణాచరణ దానికి కళంకాన్ని ఆపాదించటమే అవుతుంది. దాని అసలు ఉద్దేశాన్ని దెబ్బతీయడమే అవుతుంది.
క్షమ వల్ల దాన్ని ప్రదర్శించిన వ్యక్తికి ఆత్మతృప్తి కలగవచ్చు. ఆ వ్యక్తి వ్యక్తిత్వానికి వన్నె ఆపాదించవచ్చు. కానీ ఎలాంటి క్షమ? క్షమవల్ల మనం తృప్తిపడుతున్నామా అనేదానికంటే అది అవతలి వ్యక్తిమీద ఎలాంటి ప్రభావాన్ని చూపిందన్నదే ముఖ్యం. ఇతరుల్ని బాధించే ఆ శిలలాంటి హృదయంలో మన క్షమ కొంచెమైనా ఆర్ద్రత కలిగించిందా, పశ్చాత్తాపం అంకురించిందా, భవిష్యత్ పొరపాట్లకు అడ్డుకట్ట వేయగలిగిందా అన్నది ముఖ్యం. క్షమ చాలాసార్లు అవతలి వ్యక్తిలో మరింత హింసకు, మరింత నేరతత్వానికి ప్రేరణ కావచ్చు. ఇలాంటి క్షమవల్ల ఎవరికి ప్రయోజనం? క్షమ మన సహనానికి, ఔదార్యానికి రుజువు అయితే కావచ్చు గాక. నిజమైన ఉదారగుణం అవతలి వ్యక్తి శ్రేయమే ఆశిస్తుంది. ఆశించాలి. కేవలం క్షమవల్ల శ్రేయం ఒనగూరదు. మన క్షమ మన వ్యక్తిత్వ స్థాయిని పెంచుకునేదిగా భావించడం కంటే అవతలి వారి హింసాతత్వాన్ని తగ్గించేందుకు ఉపకరించే సాధనంగా మనం మలచే కోణంలో స్వీకరించాలి. 'క్షమ' ఉద్దేశం అదే. మన క్షమ అవతలివారిలో ఆర్ద్రత కలిగించేదిగా ఉండాలి గానీ ఆటవికతను ప్రేరేపించేదిగా కాదు. ప్రతి తప్పునూ క్షమించేవారుంటే తప్పులు చేయని వారుంటారా? మరింత ఉత్సాహంతో మరెన్నో తప్పులకు ఆయత్తం కాకపోతారా? మరి క్షమకు సరైన అర్థమేది? ఒక వ్యక్తి తప్పుల్ని ఎంతవరకు క్షమించవచ్చు? శిక్షిస్తే ఇక క్షమకు అర్థమేముంది?
నిజమే. లోకంలో క్షమార్హం కాని తప్పే లేదు. ఏసుక్రీస్తు తనను సిలువ వేసినవారినీ క్షమించమని ఆ ప్రభువును వేడుకున్నాడు. 'వారేం చేస్తున్నారో వారికి తెలియదు' అని కూడా అన్నాడు. అంటే తెలియక చేసే తప్పులకు కొంతవరకు క్షమ ఉంది. తెలిసి చేస్తే, అదీ పదేపదే చేస్తే క్షమ అవసరమా? అది క్షమను దుర్వినియోగం చేసినట్లే. క్షమలోని మరో ధర్మసూక్ష్మం ఏమిటంటే మన ఓర్పుతో తప్పుచేసినవారి అంతరంగాన్ని నిర్మాల్యం చేయటమే. మానవత్వాన్ని నిద్ర లేపటమే. బాధను ఓర్చుకుని క్షమించిన మనలోని ఔదార్యాన్ని గుర్తించి పశ్చాత్తాపం చెంది అగ్నితప్తం అవుతారనే శ్రేయోకామనే. అది గుర్తించక బోరవిరుచుకుని మరోసారి, మరోసారి తప్పులకు సిద్ధమైపోయే మూర్ఖులకు క్షమ అవసరం లేకపోవటమేగాక అది వారికి మరింత హాని చేస్తుంది.
భగవంతుణ్ని మించిన క్షమాహృదయులున్నారా? కానీ ఆయన అందర్నీ, అన్ని సందర్భాల్లో క్షమించలేదే? శ్రీకృష్ణుడు శిశుపాలుడి వంద తప్పులదాకా అవకాశమిచ్చి ఆ తరవాత సంహరించాడు. ఆయనకు పాండవులతోపాటు కౌరవులూ బంధువులూ ఆత్మీయులే. అయినా వారిని క్షమించలేదు. స్వయంగా సంధి రాయబారం నడిపి, అది విఫలమయ్యేదాకా క్షమిస్తూనే వచ్చి ఆ తరవాత కురుక్షేత్ర యుద్ధాన్ని స్వయంగా దగ్గరుండి నడిపించాడు. ధర్మాన్ని గెలిపించాడు. శ్రీరాముడు దయార్ద్ర హృదయుడు. అయినా మితిమీరిన, శ్రుతిమించిన నేరాలకుగాను స్త్రీ అయినా తాటకిని, పరమ శివభక్తుడే అయినా రావణుణ్ని నిర్జించాడు. పరమాత్ముడైనా పొరపాట్లను క్షమిస్తాడు. నేరాలను కొంతవరకు క్షమిస్తాడు. ఆ తరవాత కాదు. రుషులు శాంతులు. సహనమూర్తులు. మరి వాళ్లూ శాపరూపంలో శిక్షిస్తూ ఉంటారు. శాప విమోచనమైనా శాపానుభవం తరవాతే. మరి ఏమైపోతుంది వారి శాంతం, క్షమాహృదయం? కొన్ని సందర్భాల్లో క్షమకంటే శిక్షే దోషుల్ని నిర్మలం కావిస్తుందని భావించినప్పుడు దేవతలైనా, రుషులైనా శిక్షవైపే మొగ్గుచూపుతారు. కొన్నిసార్లు శిక్షే దోషుల్ని విశుద్ధం చేస్తుంది. విమలం గావిస్తుంది. న్యాయస్థానాలైనా శిక్ష విధిస్తున్నాయంటే నేరానికి ప్రతీకారం కంటే ప్రక్షాళనమే ముఖ్య ఉద్దేశమై ఉంటుంది. తగిన శిక్ష ప్రక్షాళన కారకమవుతుంది. మలినంతో మమేకమైన స్వర్ణానిక్కూడా శుద్ధీకరణ దెబ్బలు తప్పవు. స్నేహితుణ్ని కొట్టిన మన బిడ్డనైనా మనం క్షమ పేరిట వదిలేయం. మందలిస్తాం. అవసరమైతే ఓ దెబ్బ వేస్తాం. గురువులైనా అంతే. క్షమపేరిట శిష్యుల్ని చూసీచూడనట్లు వదిలేస్తే గురువుకు పంగనామాలు తప్పవు. అవసరమైనప్పుడు దండించాల్సిందే! (ప్రస్తుత ఆధునిక చట్టం అందుకు ఒప్పుకోదనుకోండి. అది వేరే సంగతి.)
ఎదిరించవలసిన సందర్భంలో ఎదిరించకపోతే, శిక్షించవలసిన సమయంలో శిక్షించకపోతే మనం నేరస్తులమవుతాం. చాలాసార్లు శిక్షే శిక్షణ అవుతుంది. అదే సమయంలో క్షమించాల్సిన సందర్భాల్లో నేరము-శిక్ష అంటూ భీష్మించుక్కూచుంటే మనకంటే నేరస్తులు మరొకరుండరు. ధర్మం చాలా సూక్ష్మమైంది. విచక్షణతో దాన్ని ఆచరించాలి
- చక్కిలం విజయలక్ష్మి