ᐅ సహాయమే దైవం
కాలవకు కుళ్లు అడ్డుపడి, వూళ్లో ఉన్న చెత్త అంతా ఆ క్షణంలో అక్కడ పేరుకుపోయినట్లు- కూడబెట్టడం, కుప్పపోయడమే జీవిత పరమావధి అనుకుంటారు కొందరు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఉటంకించినట్లు- తమకు మరణమే లేదన్నట్లు జీవితాంతం సంపాదిస్తూనే ఉంటారు. చట్టాన్ని తమ చుట్టం చేసుకొని టక్కుటమార గారడి విద్యలు ప్రదర్శిస్తూ, అడ్డగోలు తర్కాలతో అందినంత దోచుకోవడమే తమ జీవిత లక్ష్యం అనుకుంటారు.
అగ్రరాజ్యం అయిన అమెరికా సైతం శాండీ తుపాను దెబ్బకు గజగజ వణకక తప్పలేదు. ప్రకృతి విలయతాండవం చేస్తే ఎవరు ఎదిరించి నిలవగలరు? గ్రహగతులు బాగు లేకపోతే పాండవులైనా అడవులు పట్టాల్సిందే. దైవం చిన్నచూపు చూస్తే చిరునామా కూడా దొరకదు.
'అశాశ్వతం' అనే పదం తమ నిఘంటువులో లేనట్లు ప్రవర్తిస్తుంటారు కొందరు. మొలమీద నూలు లేకుండా వచ్చినవాడిని, మోసుకొని వెళ్లేటప్పుడు ఆ పోగు కూడా లేకుండా చేస్తారు. కళ్లముందు జరుగుతున్నది చూస్తూ కూడా తాము అమరులం అనుకుంటారు.
గొప్ప బతుకు అంటే ప్రపంచమంతా మన ఆస్తులు విస్తరింపజేసుకొని, గ్రహమండలాల్లోకి కూడా వెళ్లి సూర్యుణ్ని, చంద్రుణ్ని వేలంపాటల్లో కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవడం కాదు.
గొప్ప బతుకు అంటే గొప్పగా బతకడం. మరణంలో కూడా ఎవరికైనా సహాయం చేసే అవకాశం దొరుకుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూడటం, సహాయం చెయ్యడంద్వారా లభించే నిర్మలమైన యశస్సు- కూడబెట్టడం, కుప్పపోయడంలో ఆవగింజంతైనా దొరుకుతుందా? కాలం మారిపోతోంది. అర్థాలు మారిపోతున్నాయి. కొత్త నిర్వచనాలు పుట్టుకొస్తున్నాయి. ధనం సంపాదిస్తూనే భగవంతుణ్ని సంపాదించుకోండి అంటున్నారు. మాయలో మునిగిపోండి, సత్యం దానికదే దొరుకుతుంది అంటున్నారు. మిడిమిడి జ్ఞానంతో శాస్త్రాలకు వక్రభాష్యాలు చెబుతున్నారు.
సత్యం రామబాణం. అది సూటిగా వెళ్లి అజ్ఞానాన్ని, మాయను, మోహాన్ని ఛేదిస్తుంది. దాన్ని ధరించాలనుకునేవాడు దైవ లక్షణాలు కలిగి ఉండాలి. వాటిని నిత్యం అభ్యసిస్తూ ఉండాలి. కనికరం లేకుండా కఠోరసాధన చేస్తూ ఉండాలి.
ప్రేమ, దయ, శాంతి, క్షమ లేనివాడు ఆశ, వ్యామోహాల్లో పడి తిరుగుతున్నవాడు కోట్లాధిపతి అయినా లోకానికి ఏం ఒరుగుతుంది? దుర్యోధనుడు ముందుగా వచ్చినా, అర్జునుడినే ఎప్పుడూ ముందుగా చూస్తాడు శ్రీకృష్ణుడు!
దైవ సహాయం ఎవరికి లభిస్తుంది? అహర్నిశలు పరోపకారం చేసేవాడివెంట భగవంతుడు నడుస్తాడు. ప్రతి మంచిపనికి అవరోధాలు ఉంటాయి. ప్రతి గొప్ప పనికి తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. పని మానుకుంటే ప్రతికూల శక్తులకు లొంగిపోయినట్లే కదా.
మారీచ సుబాహుల రాక్షస చర్యలకు అడ్డుకట్ట వెయ్యడం తనకు సాధ్యం కాకపోవచ్చు. రామలక్ష్మణుల సహాయం తీసుకుంటే నిమిషాలమీద వాళ్లను తుత్తునియలు చేసి గగనంలోకి ఎగురకొట్టవచ్చు. విశ్వామిత్రుడి ఆలోచన గొప్పది. ఆచరణలో పెట్టాడు.
సముద్రాన్ని రెండు చెయ్యాలి. లంకకు వారధి కట్టాలి. వెనకడుగు వెయ్యలేదు శ్రీరాముడు. ప్రతి వానరుణ్నీ దీవించి, ఆశీర్వదించి కార్యోన్ముఖులను చేశాడు. చివరికి చిన్న ఉడుత కూడా తనవంతు సాయం చేసింది.
మంచివాళ్లకు, మంచి పనులకు సాయం చెయ్యాలంటే భగవంతుడు ముందుకు వస్తాడు. ముందే వస్తాడు. 'పాండవ పక్షపాతి' అని నిందించినా పాండవులను వదల్లేదు శ్రీకృష్ణుడు. చివరిదాకా ఉండి విజయం సాధించిపెట్టాడు.
మొత్తం సమయమంతా మన అభివృద్ధికోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఎంతైనా పాటుపడవచ్చు. మన వ్యర్థమైన పనుల్లోంచి ఒక గంట బయటకు తీసి ఇతరుల మంచికోసం ఉపయోగిస్తే, కనీసం అలా ఆలోచిస్తే- కొంతకాలానికి ఆచరణలోకి వచ్చి... మన జీవన విధానం మారిపోతుంది. ముఖ్యంగా ఇటువంటి పనుల్లో దైవం ఎలా పనిచేస్తాడో చక్కగా అవగాహన చేసుకోవచ్చు.
'దేవుడిని చూస్తాం. దేవుడిని చూస్తాం. చూపించండి' అంటుంటారు కొందరు. కూడబెట్టడం, కుప్పవేయటం మానేసి, లోకక్షేమం కోసం పాటుపడే వాళ్లలో భగవంతుడు కనిపించడా? ప్రకృతితో మమేకమై లోక సౌఖ్యంకోసం జీవిస్తున్న ప్రతి పురుగు, పక్షి, జంతువు, మొక్క, రాయిలో భగవంతుడు కానరాడా? నేను, నాది అనేది వదిలిపెట్టి ధర్మాచరణ కోసం పృథ్విపై అవతరించినవాళ్లను ఏమనాలి?
- ఆనంద సాయి స్వామి