ᐅ జీవిత పరమార్థం

 ᐅ జీవిత పరమార్థం

కావ్య ప్రపంచంలో కరుణ రసానికి పెద్దపీట వేశాడు భవభూతి మహాకవి. అసలు వాల్మీకి మహర్షి కన్నీటి నుంచే ఆది కావ్యమైన రామాయణం పుట్టింది. కరుణరసం కఠిన పాషాణాన్నీ వెన్నగా చేస్తుంది. ఇక స్త్రీ హృదయంలా సుకుమారం, కోమలమైన కవి హృదయం గురించి వేరే చెప్పాలా? వేటగాడి వేటు తిన్న మగపక్షి నేలమీద పడి గిలగిల్లాడుతోంది. ఆడ పక్షి దానిచుట్టూ తిరుగుతూ రోదిస్తోంది. ఈ దృశ్యం కనిపించగానే వాల్మీకి గుండె పగిలింది. ఆ తరవాత ఆయనలో కోపం రగిలింది. నిషాదుడు కల్పించిన విషాద సంఘటన నేపథ్యంలో శోకతప్తమైన వాల్మీకి హృదయ ఘోష శ్లోకమై వెలువడింది.
మానవ జీవితం ఒక ప్రవాహం లాంటిది. ఎక్కడో కొండచరియలపై నుంచి కిందికి దూకి, ఎత్తుపల్లాలు దాటుకుంటూ, ఎన్నెన్నో మలుపులు తిరిగి మైదానం చేరుకుంటుంది. కొండవాగు విశాలమైన నదిగా మారి చివరికి సాగరసంగమం సాధించినప్పుడే ప్రవాహం శాంతిస్తుంది. మనిషి జీవితమూ ఎన్నో ఒడుదొకులు ఎదుర్కొని, కన్నీళ్ళు పన్నీళ్లు పంచుకుంటోంది. జీవితం నేర్పే పాఠాలను జీర్ణించుకుని తనలో లోటుపాట్లు సరిదిద్దుకుని పరిపూర్ణత్వం సాధించినప్పుడే జీవితం ధన్యమవుతుంది. ఎదుటి మనిషి కన్నీళ్లను అర్థం చేసుకోవటానికి ఈ ప్రపంచాన్ని ఒక ప్రయోగశాలగా స్వీకరించాలి. ఎదుటి మనిషి కష్టాలకు స్పందించని మనిషి జీవితం అడవిలోని మానుతో సమానం. బాధను, వ్యధను అర్థం చేసుకుని ఆర్ద్రత చెందినప్పుడే మనిషికి, మనిషికి మధ్య స్నేహానుబంధాలు చిగురిస్తాయి. కష్టసుఖాలు పంచుకుని కలకాలం మనగలిగినప్పుడే ఆ స్నేహం నిజమైన స్నేహంగా గుర్తింపు పొందుతుంది.

జీవితంలో మనకు మూడు రకాలైన మనుషులు కనిపిస్తారు. వారివారి మనస్తత్వాలనుబట్టి మనిషికీ మనిషికీ మధ్య తేడాలు కనిపిస్తాయి. హితుడు, సన్నిహితుడు, స్నేహితుడు- ఈ ముగ్గురూ ఒకేలా అనిపించినా, నడుమ కనిపించని అంతరాలున్నాయి. హితుడు సలహాలకు పరిమితమై తన చుట్టూ ఒక గిరిగీసుకుంటాడు. సన్నిహితుడు ఒక అడుగు ముందుకువేసి భుజంతట్టి శుభం పలుకుతాడు. చివరికి ఆదుకుని అడుగులో అడుగువేస్తూ కలిసి నడిచేవాడు స్నేహితుడొక్కడే! మనల్ని నిజంగా ప్రేమించేవాడే స్నేహ హస్తం చాచి స్వాగతిస్తాడు. ఆ తరవాత మనకోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతాడు. హితుడు, సన్నిహితుడు సానుభూతి అందజేయవచ్చు కాని, సహ అనుభూతి స్నేహానికే చెల్లుతుంది. బాధను వ్యధను పంచుకుని ఆనందాన్ని అందివ్వటానికి స్నేహితుడు ఎప్పుడూ ముందువరసలో ఉంటాడు. అందుకే స్నేహాన్ని అమృతంగా, మైత్రీబంధాన్ని అద్వైత సౌందర్యంగా కవులు వర్ణిస్తారు.

ప్రేమ, కరుణ, స్నేహంలాంటి సుకుమారమైన మనోభావాలకు రూపకల్పన మానవ హృదయంలోనే జరుగుతుంది. కరుణామయుడైన పరమాత్మ నివసించేది హృదయ మందిరంలోనే! బాధ, వ్యధ శరీరానికి, మనసుకు సంబంధించిన జాడ్యాలు. కాలికి దెబ్బ తగిలితే కళ్లవెంట నీళ్లు జల్లుమని రాలుతాయి. ఈ రెంటికీ అవినాభావ సంబంధం ఉంది. తాత్కాలికంగా అవి జీవితంలో అలజడి సృష్టించే మాట నిజమే కాని, ఆధ్యాత్మికంగా పురోగమించటానికి పరిపూర్ణమైన మానవుడై పరిమళించటానికి పరోక్షంగా తోడ్పడతాయి. అందుకే కష్టాలను భగవంతుడి దీవెనలుగా, వరాలుగా స్వీకరించాలంటారు స్వామి శివానందులవారు. కరుణామయుడైన బుద్ధ భగవానుడు మానవ హృదయాల్లో నేటికీ అఖండజ్యోతి స్వరూపమై వెలుగుతున్నాడు. బౌద్ధులు 'టోంగ్‌-లెన్‌' అనే ధ్యానముద్రలో కరుణరసావిష్కరణ కోసం ఏకాగ్రబుద్ధితో గుండె కరిగించే సంఘటనలు సందర్శిస్తారు. దుర్లభమైన మానవ జీవిత పరమార్థం- ఉన్న నాలుగునాళ్లు హృదయాళువుగా మనగలగటమే!

- ఉప్పు రాఘవేంద్రరావు