ᐅ నాగోబా జాతర
ప్రకృతిలో దైవత్వాన్ని దర్శించడం మన సంప్రదాయం. ఈ విధానం శిష్ట సంస్కృతిలోనే కాదు, జానపదుల్లో, గిరిజనుల్లో కూడా అనాదిగా కొనసాగుతోంది. వైదిక ఆచారాల్లో సర్పారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది. గిరిజనులు సర్పాన్ని సస్యరక్షణ దేవతగా ఆరాధిస్తారు. ఆరోగ్యం, శాంతి సౌఖ్యాలు, సిరిసంపదలు ప్రసాదించే దైవంగా సర్పాన్ని గిరిజనులు పూజిస్తారు. నాగదేవత తమను కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా గిరిజనులు ఏటా నాగోబా జాతరను నిర్వహించుకుంటారు. గోండు తెగకు చెందిన గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో పుష్య బహుళ అమావాస్యనుంచి అయిదు రోజులపాటు జాతర జరుగుతుంది. సమ్మక్క-సారలమ్మ జాతర తరవాత గిరిజనులు భారీసంఖ్యలో పాల్గొనే జాతర ఇది.
జాతరలో 'మెస్రం' అనే గోండు తెగ వంశీయులకు ప్రముఖ పాత్ర ఉంటుంది. ఈ జాతర నిర్వహణకు నేపథ్యంగా ఓ కథ ప్రచారంలో ఉంది- మెస్రం వంశానికి చెందిన నాగాయిమోతి అనే రాణికి నాగేంద్రుడు సర్పరూపంలో కుమారుడిగా జన్మించాడని చెబుతారు. తన మేనకోడలైన గౌరితో నాగేంద్రుడికి రాణి వివాహం జరిపిస్తుంది. సర్పాకృతిలో ఉన్న తన భర్తను ఓ బుట్టలో పెట్టుకుని, గౌరి గోదావరి స్నానానికి వెళ్తుంది. పవిత్ర గోదావరి జలప్రభావంవల్ల నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని చెబుతారు. గౌరి ఆశ్చర్యంతో తన భర్తను తాకగానే తిరిగి నాగేంద్రుడు సర్పరూపంలోకి మారిపోయాడంటారు. దాంతో గౌరి ఆవేదనతో గోదావరిలోని సత్యవతి గుండంలో కలిసిపోయిందంటారు. గిరిజనుల వంశాన జన్మించిన తాను, వారిని సదా సంరక్షిస్తానని నాగేంద్రుడు అభయమిచ్చాడని చెబుతారు. వివాహం అయిన ప్రతి జంటా తన సమక్షంలో భేటీ అయి దీవెనలు పొందాలని నాగేంద్రుడు ఆదేశించి, కేస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లి అదృశ్యమయ్యాడంటారు. ఆ ప్రదేశంలోనే నాగేంద్రుణ్ని నాగోబాగా భక్తులు ఇప్పటికీ ఆరాధించుకుంటున్నారు. జాతర ప్రారంభానికి ముందు కేస్లాపూర్ గ్రామానికి 80కిలోమీటర్ల దూరంలో ఉన్న కలమడుగు గోదావరి రేవు నుంచి మెస్రం వంశీయులు కొత్త కుండలతో నీళ్లు సేకరిస్తారు. ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. నాగోబా ఆలయానికి చేరుకున్నాక, ప్రాంగణంలోని మర్రిచెట్టు కొమ్మలకు నీటికుండల్ని కట్టి ఉంచుతారు. పుష్య బహుళ అమావాస్య నుంచి అయిదు రోజులపాటు ప్రతి నిత్యం ఆ జలాలతో నాగోబాను అభిషేకిస్తారు. సిరికొండ నుంచి తీసుకొచ్చిన 116 మట్టికుండల్ని వరసగా పేర్చి, పసుపు కుంకుమలతో వాటిని శుద్ధి చేస్తారు. గిరిజన స్త్రీలు ఆలయ ప్రాంగణంలో పడమర దిక్కున ఉన్న పాతాళగంగను ఆ కుండలతో నింపుతారు. గత సంవత్సరం నిర్మించిన మట్టిపుట్టల్ని ఆ నీటితో తొలగించి వాటి స్థానంలో కొత్తగా ఏడు మట్టిపుట్టల్ని నిర్మిస్తారు. వాటిపై సర్పాకృతుల్ని ఉంచుతారు. ఆవుపాలు, నవధాన్యాల్ని పుట్టలకు నివేదన చేస్తారు. ఆలయంలో అయిదు పడగలతో ఉన్న నాగోబా విగ్రహాన్ని గిరిజన సంప్రదాయాల ప్రకారం అలంకరిస్తారు. జొన్నలు, మొక్కజొన్నలతో తయారుచేసిన గటక, అంబలిని నాగోబాకు నైవేద్యంగా సమర్పిస్తారు. నాగోబా సమక్షంలో కొత్త దంపతులకు భేటింగ్ (భేటీ) నిర్వహిస్తారు. 'తూమ్' పేరిట పితృదేవతలకు ఆరాధన చేసి, వారి ఆత్మశాంతి కోసం దీపాల్ని వెలిగిస్తారు.
మెస్రం వంశీయుల్లో 22 విభాగాలు ఉన్నాయి. ఎంతమంది మెస్రం వంశీయులు జాతరకు హాజరైనా గోవడ (వర్తులాకారంలో గోడకట్టిన ప్రాంతం)లోని 22 పొయ్యిలపైనే వంట చేసుకుంటారు. నవధాన్యాలతో కలిపి వండిన పదార్థాన్ని నాగోబాకు సమర్పించి, అనంతరం దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. డోలు, కిక్రీ వంటి వాయిద్యాలతో గిరిజనులు భక్తిపారవశ్యంతో నృత్యాలు చేస్తారు. జాతర చివరి రోజున దర్బార్ నిర్వహిస్తారు. 1946లో ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఈ ఆనవాయితీని ప్రారంభించారు. నాగోబా చెంత గిరిజనులు తాము ఎదుర్కొనే సమస్యల్ని పాలకుల దృష్టికి తీసుకు వెళ్లడానికి ఈ దర్బార్ ఉపకరిస్తుంది. గిరిజనుల జీవనశైలికీ, ఆచార వ్యవహారాలకు, సమష్టి తత్వానికి నాగోబా జాతర అద్దం పడుతుంది.
- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్