ᐅ మానవతా పరిమళం
ఈ భూమ్మీద కోటానుకోట్ల మంది మనుషులున్నారు. వీరిలో నిజమైన మనుషులెందరో కనుక్కోవడం కష్టం. మానవత ఉన్నవాడే మనిషి కాగలడు. అది లోపిస్తే, మనిషికీ మృగానికీ తేడా లేదు. మానవత్వం గురించి చాలామంది మాట్లాడతారు. ఆచరణలో అది దాదాపు మృగ్యమే. అది ఓ వూతపదంగానే మిగిలింది. మనిషిని మనిషి హింసించడం మానవత కాదు. తన స్వార్థం కోసం ఇతరులను హింసించడం, వంచించడం మానవత కాదు. హిట్లర్, ముసోలినీ లాంటివాళ్లు దీనికి తార్కాణం. అలాంటివాళ్లు మానవరూపంలో ఉన్న రాక్షసులు.
మానవ చరిత్ర చూస్తే ఆదిమకాలం నుంచి నేటివరకు వంచన, హింస, ద్వేషం, కామం, క్రోధం- వీటితో నిండిపోయినట్లు తెలుస్తుంది. మనిషి మనిషిగా బతికిన సందర్భాలు తక్కువ. మనిషి సాటిమనిషిని ప్రేమించడం, గౌరవించడం చాలా అరుదైపోతోంది. జీసస్ క్రీస్తు ప్రేమను, గౌరవాన్ని చాటినందుకు సిలువ వేశారు. సోక్రటీస్ లాంటి మానవతా వాదులను అనేక బాధలకు, చిత్రహింసలకు గురిచేశారు.
జీవులను తినకుండా మనిషి మనజాలడు కనుక జీవులను చంపడం ధర్మమే అని చెప్పడంలో అర్థంలేదని ఖండిస్తాడు కన్నడ ప్రజాకవి సర్వజ్ఞుడు. వేమన దృష్టిలో యాగపశువును బలి ఇచ్చి దాని రక్తపుటేళ్లతో, దాని ఆక్రందనల హోరులో మనం ప్రయోజనం పొందాలనుకోవడం, స్వర్గాన్ని చేరుకోవాలని కాంక్షించడం అమానుషం. ఒక్క జంతువునే కాదు, శత్రువును హింసించడం కూడా అన్యాయమంటాడు. 'చంపదగినయట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు చేయరాదు. పొసగ మేలుచేసి పొమ్మనుటె చాలు' అని అపకారికి సైతం ఉపకారం చేయడం అత్యుత్తమ ధర్మమని మానవతా విలువను ఎలుగెత్తి చాటాడు వేమన.
జీవితంలో మానవత విశిష్టత గ్రహించి దయాదాక్షిణ్యాలతో మెలగినప్పుడే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది. పోనుపోను జనాభా పెరిగి జాతి, మత, వర్గ వైషమ్యాలు పెరిగి మనుషులు అహంకారంతో, స్వార్థంతో గుర్తింపుకోసం ఎవరికివారే సంఘర్షణ దిశగా పయనిస్తున్నారు. మనిషి మట్టిలో కలిసినా మానవత బతికే ఉంటుంది, ఉండాలి. బుద్ధుడు మానవతకు హిమాలయంలా కనిపిస్తాడు. మదర్ థెరెసా మానవతకు నిలువెత్తు నిదర్శనం. ఇటువంటి మహనీయుల అడుగుజాడల్లో నడవడమే జీవిత ధ్యేయం కావాలి. సృష్టిలో సకల ప్రాణుల యందు ప్రేమానురాగాలు పురిగొల్పేదే నిజమైన మానవత.
స్నేహంతో మెలగుతూ మమతానురాగాలను పంచుతూ నిర్మలమైన మనసుతో జీవించిననాడు సంతోషం, ఆరోగ్యం పెరిగి హృదయ కవాటాలు తెరచుకొని మానవత్వం వికసిస్తుంది. ఆ మానవత్వమే మాధవరూపమై విరాజిల్లుతుంది. మానవత్వం కలిగినవారిలో ఉత్సాహం, సహకారం, సహజీవనం వంటి సద్గుణాలుంటాయి. సాటివారి కష్టనష్టాలకు బాధపడటం, చేతనైన సహాయం చేయడం, వారి ఉన్నతిని కోరడం మానవత్వం. తనకోసం బాధపడకుండా పరులకు సహాయపడేవాడు, కనీసం హాని తలపెట్టనివాడు మనిషి. ఇంద్రియాలను వశపరచుకొనేవారు, సకల భూతాల హితం కోరేవారు, అన్ని ప్రాణులను సమభావంతో చూసేవారు యోగులవుతారు. సర్వభూత హితాన్ని కాంక్షించేవారే తనకు ఇష్టులన్నది గీతాచార్యుడి మాట.
పశువులు పాపభృక్కులు కావు. వాటివల్ల మనిషికి కష్టనష్టాలు కలగవచ్చు. వాటికది తెలియదు. వాటికి ఆలోచన, జ్ఞానం లేవు. పాపపుణ్యాలు తెలియని మూగజీవులు. మనిషికి ఆలోచనాశక్తి, పాపపుణ్యాల విచక్షణాజ్ఞానం ఉన్నాయి. అన్నీ తెలిసిన మనిషి తన సుఖసంతోషాలకోసం, లాభం కోసం ఇతరులకు హాని కలిగించడం తగదు. మానవజన్మ ఓ వరం. దాన్ని సత్ప్రవర్తనతో, సత్కర్మలతో సాఫల్యం చేసుకోవాలి. మానవతావాదులు సున్నితమనస్కులై ఉండాలి. సాటిమనిషి పడుతున్న కష్టానికి, బాధకు అతడిలో ఆర్ద్రత పొంగిపొరలాలి. కరుణ, మమతలు హృదయంలో నిండిఉండాలి. ఎదుటివారి ముఖంలో ఆనందం చూడటం ధ్యేయంగా పెట్టుకున్ననాడు మానవతా పరిమళం భువినిండా వ్యాపిస్తుంది.
- వి.ఎస్.ఆర్. మౌళి