ᐅ భీష్మ గీత
మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు రాజ్యాభిషిక్తుడైనా అశాంత చిత్తుడయ్యాడు. సింహాసనం కోసం తానుగావించిన రక్తపాతం అతడి హృదయాన్ని కలచివేసింది. కృష్ణభగవానుడు ఎన్ని విధాలుగా చెప్పిచూసినా ధర్మజుడికి మనశ్శాంతి చేకూరలేదు. అప్పుడు కృష్ణుడు శరతల్పగతుడైన భీష్ముడి వద్దకు తీసుకువెళ్లి హితోపదేశం చేయవలసిందిగా కోరాడు. ధర్మరాజు వ్యక్తపరచిన పలు సందేహాలకు భీష్ముడు విసుగు లేకుండా సమాధానాలు చెప్పాడు. ఈ సందర్భంలో చివరగా ధర్మరాజు ఆరు ప్రశ్నలు అడిగాడు.
ఈ విశ్వంలో గొప్ప దైవమెవరు? సకలజీవులకూ శరణునిచ్చేవాడెవరు? ఎవరి నామాన్ని కీర్తిస్తే శాంతిసౌభాగ్యాలు చేకూరతాయి? ఎవరిని అర్చిస్తే శుభాలు సమకూరతాయి? సకల ధర్మాలకూ ధర్మం ఎవరు? దేన్ని జపిస్తే సంసారచక్రం నుంచి సకల జీవులు విముక్తి పొందగలరు?
ఈ ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు- ఎవరైతే పవిత్రతకు మారుపేరో, ఎవరివల్ల సకల వస్తువులు పవిత్రమవుతాయో, ఎవరు అత్యంత శుభప్రదుడో ఆ దైవమే శ్రీమహావిష్ణువు. అతడు సకల జీవులకు తండ్రి అంటూ వివరించి విష్ణు సహస్రనామాన్ని ఉపదేశిస్తాడు.
మనకు శ్రుతి స్మృతి పురాణాలున్నాయి. వాటిలో భగవంతుడికి ఎన్నో నిర్వచనాలున్నాయి. భగవంతుణ్ని నిర్వికారుడు, నిర్గుణుడు అని కూడా అంటాం. అయినా అనిర్వచనీయమైన భగవంతుడి లక్షణాలను తెలుసుకుని మరలమరల అవిద్య నుంచి మనసు, బుద్ధి, అహంకారాదులను ఏకాగ్రతకు లోనుచెయ్యడానికే స్తోత్రాలు పుట్టాయి.
వ్యాసభారతంలో మూడు మహత్వపూర్ణ రత్నాలు ఉన్నాయి. ఉద్యోగపర్వంలోని సనత్సుజాతీయం. ఇక్కడ వక్త సనత్సుజాతుడు, శ్రోత ధృతరాష్ట్రుడు. రెండోది భీష్మపర్వంలోని భగవద్గీత- వక్త శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రోత మమత బద్ధుడైన అర్జునుడు. విష్ణు నామ సహస్రంలో వివరించినవాడు భీష్మ పితామహుడైతే విన్నవాడు యుధిష్ఠిరుడు. ఇది అనుశాసనిక పర్వంలో ఉంది. సనత్సుజాతీయం యుద్ధ ప్రయత్నాల దశనాటిదైతే, గీత సమర రంగంలో జరిగింది. సహస్రనామం యుద్ధానంతర ప్రశాంత వాతావరణంలో చెప్పినది.
కలియుగంలో నామస్మరణం అత్యంత ఫలదాయకంగా విజ్ఞులు భావిస్తారు. భీష్ముడు ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన పరబ్రహ్మతత్వం సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని గ్రహించి. ఆ భగవానుడి సమక్షంలోనే వ్యాసుడి ఎదుట ధర్మరాజును నిమిత్తంగా చేసుకొని లోకానికి ప్రసాదించిన మహిమాన్విత స్తోత్రరాజం ఇది.
సహస్రనామాల్లో ప్రతి అక్షరమూ దేవతా స్వరూపమే. ప్రతినామమూ ఒక మంత్రమే. పురుషోత్తముడికి వర్తించని నామాలు లేవు. దేవతలు, మానవులు, గుణాలు, వృక్షాలు, జంతువులు, పర్వతాలు, పంచభూతాలూ... వీటన్నింటి పేర్లు భగవన్నామాలే. విష్ణువంటే వ్యాపించేవాడు. ఆయన సహస్ర శీర్షుడు. సహస్రాక్షుడు. సహస్రపాదుడు. ఆయన విభూతి అంతటా నిండి ఉంది. త్రికరణ శుద్ధిగా సాత్వికభావంతో, నిర్మలమైన పరిశుద్ధమైన వాక్కుతో దివ్యసహస్ర నామాన్ని సంకీర్తనం చేస్తే ఆ విభూతిని దర్శించగలమని చెబుతారు.
ప్రణవ శబ్దంతో ప్రారంభమైన సహస్రనామంలో మొదటి నామం విశ్వం. విశ్వమంటే సర్వస్వం. సర్వస్వమైన విశ్వమే విష్ణువు. విష్ణు సహస్రనామం విశ్వ సహస్రనామం. విష్ణు సహస్రనామం ఉత్తరపీఠికలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్రీరామ తారక మంత్రం ఉంది.
ఆదిశంకరులు మొట్టమొదటి విష్ణు సహస్రనామంపై భాష్యం రాశారు. భగవద్రామానుజులు విష్ణు సహస్రనామ భాష్యాన్ని తన శిష్యుడైన పరాశర భట్టరు వారిచే రాయించారు. ఆదిశంకరుల భజగోవిందంలో గేయం గీతానామ సహస్రం అనే సందేశం ఉంది. గీత గానానికి, నామ సహస్రం ధ్యానానికి ప్రధానంగా భావించవచ్చు. నామ స్మరణమే ఒక యజ్ఞం. ఈ కలియుగంలో అది సులభమైన తరుణోపాయం.
- డాక్టర్ డి.వి.సూర్యారావు