ᐅ మేరీమాత ఉత్సవాలు
ప్రత్యక్ష దైవాలు తల్లి, తండ్రి, గురువు. వీరిలో తల్లికే ప్రథమస్థానం. మాతృదేవోభవ అని తల్లిని కీర్తించారు. అలా తల్లి దేవుడికి ప్రతీకగా నిలిస్తే ఆ దేవుడికే జన్మనిచ్చిన తల్లి ఎంత గొప్పది? ఆమే యేసుక్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన మేరీమాత. యేసుక్రీస్తు ప్రభువు వర్తమానం, ప్రబోధాలు విస్తరించిన అన్నిచోట్లా ఆమె తల్లి అయిన మేరీమాత పట్లా భక్తుల్లో ఎంతో ఆదరణ నమ్మకం, భక్తిప్రపత్తులు క్రీస్తుశకం రెండు అయిదో శతాబ్దాల మధ్యకాలంలోనే మొదలైంది.
1830లో పారిస్‌లోని సోదరి క్యాతరిన్ లాబార్ అనే క్రైస్తవ సన్యాసినికి మేరీమాత చిత్రపటంలో ఆమె దర్శనం కలిగిందని చెబుతారు. 15, 16 శతాబ్దాల మధ్యకాలంలో యూరప్‌లోని యుద్ధం, మత విప్లవాలవల్ల ఆనాటి ప్రజలు సాంత్వనకోసం ఆమెను ఆరాధించడం మొదలుపెట్టారు. కష్టాలనుంచి గట్టెక్కించే దేవతగా ఆమెను పూజించటం ప్రారంభించారు. మెడలో ఉత్తరీయం ధరించి, పాదయాత్రలు చేస్తూ నవదిన జపాలతో ఆ తల్లిని కీర్తించడం ఆనాడే ఆరంభమైంది. పందొమ్మిది, ఇరవై శతాబ్దాల్లో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మేరీమాత దివ్యదర్శనాలు కలిగాయని చెబుతారు. వేళాంగణి, లూర్థు, ఫాతిమా, గడలుపె, గారబాండల్ అనే ప్రాంతాల్లో మేరీమాత దర్శనమిచ్చిందంటారు. అనంతరకాలంలో ఆ ప్రాంతాలు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా పరిణామం చెందాయి. వీటిలో భారతదేశంలోని వేళాంగణి, ఫ్రాన్సుదేశంలోని లూర్థు, పోర్చుగల్‌లోని ఫాతిమా అత్యంత ప్రాచుర్యం పొందిన పుణ్యక్షేత్రాలు.
ఫ్రాన్సు దేశంలోని లూర్థునగరంలో 1858వ సంవత్సరంలో ఫిబ్రవరి 11న మేరీమాత బెర్నెదెత్ అనే బాలికకు దర్శనమిచ్చింది. ఆ దర్శనం స్ఫూర్తిగా 1925వ సంవత్సరంలో విజయవాడలోని గుణదలలో ఫాదర్ ఆర్లతి అనే మతబోధకులు మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాలగతిలో 1971వ సంవత్సరం వచ్చేసరికి ప్రకృతిసిద్ధమైన ఆ కొండ గుహల ప్రాంతం మేరీమాత ఆలయంగా రూపొందింది. ప్రతి సంవత్సరం ఆ ప్రాంతంలో జనవరి 31నుంచి తొమ్మిది రోజులు నవదిన ప్రార్థనలతో మొదలవుతాయి. ఫిబ్రవరి తొమ్మిది నుంచి 11 వరకు మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు వస్తుంటారు. భక్తులు మేరీమాతను అమలోద్భవి, ఉత్థాపితమాత, వ్యాకులమాత అనే పేర్లతో వేరువేరు ప్రాంతాల్లో పూజిస్తున్నారు. మేరీమాత దేవుడి కుమారుడికి జన్మనిచ్చిన తల్లి. ఆమె తల్లి గర్భంనుంచే జన్మపాపం లేకుండా జన్మించింది. అందుకే ఆమె 'అమలోద్భవి' అన్నారు 13వ శతాబ్దంలో జీవించిన స్కోతుస్ అనే మత బోధకుడు.
మేరీమాత మూడేళ్ల వయసులోనే దేవుడి అనుగ్రహానికి పాత్రురాలై యెరుషలేము దేవాలయంలో అర్పణ చెంది అక్కడే పెరిగి పెద్దదైనట్లు, ఏడు సంవత్సరాల వయసులోనే కన్యకా వ్రత దీక్ష తీసుకున్నట్లు లేఖనాలు పేర్కొంటున్నాయి. అలా దైవకుమారుడికి జన్మనిచ్చి, ఆయన పునరుత్థానం వరకు ఆయనతో ఉండి తిరిగి మోక్షారోహణంతో తన జీవితాన్ని సంపూర్ణం చేసుకుందని, అందుకే ఆమె ఉత్థాపితమాతగా ఆధ్యాత్మికులు పేర్కొంటున్నారు. యేసుక్రీస్తు సిలువపై మరణయాతన అనుభవిస్తున్నప్పుడు సైనికులు ఆయన గుండెలపై ఈటెతో పొడిచిన దృశ్యం చూసిన ఆ తల్లి హృదయం, తన గుండెలోనే ఆ ఖడ్గం దిగినంతగా తల్లడిల్లిందని ఆమెను 'వ్యాకులమాత'గా భక్తులు ఆరాధిస్తున్నారు. బాల్యంలో యేసుక్రీస్తు దేవాలయంలో తప్పిపోయినప్పుడు ఆమె ఎంతో వ్యాకులపడింది. దీనుల పాప పరిహారార్థం సిలువపై బలియాగం చెందిన కుమారుడి మరణాన్ని తట్టుకుని ఆమె నిలబడింది. ఇన్ని కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యంగా స్వీకరించి అంతులేని ఆత్మవిశ్వాసంతో దృఢచిత్తంతో ముందుకు సాగింది.
ఆ లోకమాతను ఆరాధించే క్రమంలో మేరీమాత ఒక స్త్రీ మూర్తి అనే విషయం గుర్తించాలి. నేటి సమాజంలోని స్త్రీమూర్తులను పూజనీయ భావంతో గౌరవించడం నేర్చుకోవాలి. నేడు స్త్రీలపై జరుగుతున్న అమానవీయ దాడుల్ని ఖండించాలి. ప్రతి స్త్రీ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు వారిని సమాయత్తపరచాలి. అందుకు మేరీమాత ఉత్సవాలు ఒక వేదిక కావాలి. ఉత్సవాలకు విచ్చేస్తున్న ప్రతిఒక్కరు బాల్యంలో తమతమ తల్లులు చూపిన ప్రేమాభిమానాలను తిరిగి అనుభూతి చెందాలి. కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా లక్షలాది భక్తులు మేరీమాత ఉత్సవాలకు విచ్చేయడంద్వారా ఈ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.
- డాక్టర్ ఎమ్.సుగుణరావు