ᐅ కర్మలు-ఫలాలు

 ᐅ కర్మలు-ఫలాలు

భారతదేశానికి 'కర్మభూమి' అని పేరు. వాస్తవానికి ప్రపంచంలోని దేశాలన్నింటా కర్మ జరుగుతూనే ఉంటుంది. విశ్వానికంతటికీ శ్రేయం చేకూర్చటమే సరైన కర్మ అని ప్రబోధించే ప్రవచనాలు, ప్రసంగాలు, ఉపదేశాలు, ఆచరణలు, బోధలు కేవలం మనదేశంలోని మహర్షులు, యోగులు, ఆచార్యుల వల్లనే అందుతున్నాయి. కనుకనే మనదేశాన్ని ప్రత్యేకంగా 'కర్మభూమి' అని వ్యవహరిస్తారు.
మనది భోగభూమి కాదు, యోగభూమి. 'ఏ పనైనా చేస్తున్నది 'నేనే' అయినా చేయిస్తున్నది మాత్రం విశ్వచైతన్యమే. అంటే భగవంతుడే. నేను నిమిత్త మాత్రుడను. కర్మఫలితం కూడా భగవత్ప్రసాదమే. ఫలితంపైన నాకెటువంటి ఆశా, వ్యామోహం, తపన లేవు. అధికారమూ లేదు' అన్న భావనతో త్రికరణశుద్ధిగా పనులను చేసుకుంటూ పోవడమే కర్మ సిద్ధాంతం. ఈ భావమే భారతదేశానికి 'కర్మభూమి' అన్న పేరు తెచ్చిపెట్టింది. ఒక కర్మ చేస్తున్నామంటే ఫలితంపైన ఒక ఆశ, అవగాహన, అంచనా ఏర్పడటం ఎవరికైనా సహజం. అంచనాలు, ఫలితాలు తారుమారు అయినప్పుడు దుఃఖం, కోపం, దిగులు, ప్రతీకారవాంఛ కలగటం కూడా సహజమే. అందుచేత పని చెయ్యడమే మన వంతు ఫలితం, భగవదనుగ్రహం అనుకున్నప్పుడు ఏ బాధా ఉండదు. సుఖదుఃఖాలకు ప్రభావితులం కాకుండా, మనసు సమస్థితిలో ఉంచుకోవటమే ఈ కర్మ సిద్ధాంతంలోని పరమార్థం.

ఫలితం మీద లేనిపోని ఆశలు, వూహలు పెంచుకొని, పూర్తిగా దానిమీదనే ధ్యాస పెట్టి కర్మలు చేసినట్లయితే ఆ కర్మ సక్రమంగా పూర్తికాదు. చిత్తశుద్ధి, శ్రద్ధ, ఆసక్తి లోపిస్తాయి. ఫలితంగా స్వార్థం, అవినీతి, ఆగ్రహం, వంచన, ద్రోహం, అసూయ, ద్వేషం వంటి ప్రమాదకర భావనలకు లోనయ్యే అవకాశముంటుంది. ఇక ధనం, మద్యం, మగువ, పదవులను ఎరగా చూపించి ప్రజల్ని ప్రలోభపరచే మహానేతలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. కర్మ చెయ్యకుండా సత్వరం సత్ఫలితాలను పొందేందుకు వారు పడుతున్న తపన, చేసే ఒత్తిళ్లు ఇంతా అంతా కాదు. అటువంటివారి పట్ల అప్రమత్తతతో వ్యవహరించడం ఎంతైనా అవసరం. బతుకు పోరాటంలో పరమాత్మ బోధించిన కర్మసిద్ధాంతాన్ని పెద్దల అనుభవసారంలో రంగరించి అనుసరిస్తే, ఆచరిస్తే- ఆరోగ్యంగా, ఆనందంగా పూర్ణాయుష్కులుగా జీవిస్తారు. లేకపోతే, ఉద్రేకాలకు భావోద్వేగాలకు లోనై జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వస్తుంది.

ప్రతి ఒక్కరికీ కార్యసాఫల్యం మీదనే మక్కువ ఎక్కువ. పనిలో విజయం సాధించగానే తమ శక్తియుక్తులు, సామర్థ్యం, ప్రతిభ, మేధాసంపత్తిని తామే పొగడుకుంటుంటారు. కర్మ పట్ల నిరాసక్తి, అలక్ష్యం, వివేకరాహిత్యం, ఇతరులపై ఆధారపడటం, సామర్థ్యరాహిత్యం ఇలాంటి బలహీనతలవల్ల అపజయం పొందేవారికీ, ఆ పొగడుకునేవారికీ పెద్ద తేడా ఏమీ ఉండదు. పరమాత్మ కర్మసన్యాసం కాదు, కర్మఫలత్యాగం చెయ్యమన్నాడు. సంసారిగా ఉంటూనే ధార్మిక కర్మలను నిర్వర్తించుకొమ్మన్నాడు. శారీరకతపస్సు, మానసిక తపస్సు, వాక్‌ తపస్సు సత్కర్మలను ఆచరించేందుకే ప్రేరణ కలిగిస్తుందన్నాడు.

కర్మలో అనేక భేదాలున్నాయి. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్య కర్మ, దుష్కర్మ, అకర్మ, కాయిక కర్మ, వాచక కర్మ, మానసిక కర్మ, ప్రారబ్ధకర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ... ఇలా ఎన్నో. స్థూలంగా పుణ్యకర్మలనీ, పాపకర్మలనీ ఉంటాయన్నారు. పుణ్యకర్మాచరణవల్ల మోక్షం, పాప కర్మాచరణవల్ల నరకమూ ప్రాప్తిస్తాయన్నది నిర్వివాదాంశం. గుచ్చుకున్న ముల్లును మరో ముల్లుతోనే తీస్తారు. అలాగే ఒక కర్మబంధాన్ని మరో కర్మాచరణవల్లనే తొలగించడం సాధ్యమన్నారు. కోరికలతో కర్మ చేస్తే బంధవిముక్తి కాదు. మామిడిటెంక నాటితే మామిడిపళ్లు పొందగలం, కాకర విత్తనం నాటితే చేదు కాకరకాయలే లభిస్తాయి. ఇదే కామ్యకర్మ విధానం. జ్యోతిస్టోమ, అతిరాత్ర, పాండరీక, సోమయాగాది కర్మలు శ్రౌతకర్మలు. బావులు, చెరువులు తవ్వించటం, దేవాలయాది ప్రతిష్ఠాపనలు స్మార్త కర్మలు. నిష్కామ కర్మనిష్ఠులు సంసారంనుంచి తరిస్తారు. బంధాల్ని పెంచనిది నిజమైన కర్మ అని విష్ణుపురాణం చెబుతోంది. సకాలంలో వర్షాలు పడి, మంచి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని చేసే కర్మలు నైమిత్తిక కర్మలు. కర్మబంధాలు తొలగించుకోవాలంటే జ్ఞానప్రాప్తి అత్యంతావశ్యకం.

దైవదర్శనం చేసుకొని గుడి వెలుపలికి వచ్చిన ఇద్దరు మిత్రుల్లో మొదటివాడు దానం ఉత్తమధర్మంగా భావించి బిచ్చగాడికొక రూపాయి వేస్తే, రెండోవాడు తానూ వేయకపోతే బాగుండదని మొహమాటంగా రూపాయి వేశాడు. అంటే దానమనే కర్మ ఒకటే అయినా ఆ రెండు కర్మలకూ వేర్వేరు ఫలితాలుంటాయని గమనించాలి. కర్తవ్య నిర్వహణలో బ్రహ్మానందం, ముక్తిని పొందిన ధర్మవ్యాధుడి కథ మనకు తెలిసిందే. సత్కర్మాచరణే మోక్ష భవనానికి ప్రథమ సోపానం.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి