ᐅ మనిషిలో రుషి

 ᐅ మనిషిలో రుషి

మనిషి అంటే మనందరం చూసే భౌతిక స్వరూపం మాత్రమే కాదు. మనిషిలో కంటికి అగుపించనివి చాలా ఉంటాయి. అందరూ మనిషి అందచందాలు, వేషభాషలు చూసి ఏదో ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. మనసును మరుగునపరచుకుంటూ, ఎదుటివారు మెచ్చేలా మాట్లాడటం కొందరి ప్రత్యేకత. అందువల్ల మాటలనుబట్టి మనసును అంచనా వేయలేం. కొందరి మాటలు కఠినంగా ఉన్నా మనసు వెన్నలా ఉంటుంది. కొందరి మొహాలు ఎంతో సాత్వికంగా ఉంటాయి. అలాగని వారిని సజ్జనులుగా అనుకోలేం. సాదాసీదాగా ఉండేవారిలో కొందరు భయంకరమైన నేరాలుచేసి పట్టుబడుతుంటారు. మొహం మొరటుగా కర్కశంగా అనిపించేవాళ్లు సమాజానికి ఉపకారులు కావొచ్చు.
కాబట్టి, అన్నివేళలా మనసు మొహంలో ప్రతిబింబిస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఒక్కటి మాత్రం నిజం. మనిషిలో మనిషి మాత్రమే కాదు. రాక్షసులు, పిశాచాలూ ఉంటారు. మనీషులు, సాధువులు, మునులు, రుషులూ ఉంటారు. చాలా చాలా అరుదుగా దేవతలుంటారు.

మనం ఆహ్వానించకపోయినా రాక్షసులు, పిశాచాలు అప్పుడప్పుడు నిద్రలేచి విజృంభిస్తుంటారు. ఎంతో క్రమశిక్షణ, నీతి నియమాలవల్ల మనలోని మనీషి కళ్లు తెరుస్తాడు. మనీషిని కాపాడుకుని, అదే పంథాలో కొనసాగితే, మనీషి సాధువుగా రూపాంతరం చెందుతాడు. సాధువునుంచి మునిగా మారటం సులభతరమే. సాధువుగా ఉండగానే ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మన వేషభాషలు సాధురూపాన్ని పోలి ఉండాల్సిన అవసరం లేదు. రూప సాధువు కాక హృదయ సాధువు అయినప్పుడే అది నిజమైన సాధుత్వం అవుతుంది. సాధువుగా జీవించేవారిని పుష్కలమైన ఆధ్యాత్మిక అనుభూతులు, ఆనందం వివశుణ్ని చేస్తుంటాయి. మౌనంలోనే వారికి ఆనంద పారవశ్యం కనిపిస్తుంది. ఎవరితో ఏమీ మాట్లాడాలనిపించదు. ఒక మృదుమధుర హాసం, ప్రసన్నవదనంతో వారి మౌనంతోనే ప్రపంచంతో మైత్రి నెరపుతుంటారు. మునులందరూ ఇంతే. లక్ష మాటలతో చెప్పలేని భావాలను వారు తమ మౌనంతో చెప్పగలరు. ఆపై అంచె రుషిత్వం. వేషభాషలనుబట్టి వారినీ గుర్తించలేం. వారికి జడలు, నారచీరలు ఉండవు. అందరిలాగానే, అందరి మధ్య ఉంటారు. కానీ, ఎంతో విభిన్నంగా నక్షత్రాల మధ్య చంద్రుడిలా తమచుట్టూ సంతోషకర వాతావరణాన్ని నెలకొల్పుకోగలుగుతారు. అది సహజంగానే ఏర్పడుతుంది. అలాంటివారే మదర్‌ థెరెసా, రామకృష్ణ పరమహంస, మహర్షి అరబిందో. ఇలా మనం చెప్పుకొంటూపోతే, రుషి సమానులుగా ఎంతోమంది కనిపిస్తారు.

మరి మన సంగతేమిటి? మనం ఏ స్థాయిలో ఉన్నాం? ఏ స్థాయిలో ఉన్నామో మనల్ని మనమే అంచనా వేసుకోవటం కష్టం కాదు. అంచనాలో మనస్థాయి తెలిశాక, మనం ఎక్కాల్సిన సోపానాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ముందు మనిషిగా మనం మారాలి. ఆ తరవాతి సోపానాలే మనీషి, సాధువు, ముని, చివరగా రుషి. కొండలు ఎక్కినవాడు కాదు, ఎవరెస్టు శిఖరం ఎక్కినవాడే గొప్పవాడు. రుషి కావాలని కృషి చేసినవాడే ధన్యుడు.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌