ᐅ ప్రేమ ప్రతిమలు

 ᐅ ప్రేమ ప్రతిమలు

మనలో అంతర్యామిగా వెలుగొందే ఆ పరమేశ్వరుడు స్వయంగా ప్రేమమయుడు. ప్రేమమూర్తి. ప్రేమే అతడు. అతడే ప్రేమ. అతడెవరో కాదు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. విశ్వానికి ఆధారభూతుడు. విశ్వవ్యాప్తుడు. అందుచేత ప్రేమతత్వమూ విశ్వమంతటా నిండి ఉన్నదని తెలుస్తుంది.
ప్రాణులన్నింటిలాగే మానవులూ దేవుడి సంతానమే. అందుచేత మానవుడు దైవాంశ సంభూతుడవుతున్నాడు. ప్రేమజ్యోతిగా వెలుగొందుతున్నాడు. చల్లని ప్రేమ కిరణాలను వెదజల్లే మానవుడిలోని ప్రేమ కూడా దైవంలాగే ఎంతో నిర్మలమైనదీ, పవిత్రమైనదీ అవుతుంది. మానవుడి ప్రేమలో కోరిక ఉండదు, ఉండరాదు. కోరిక ఉంటే అది స్వార్థమవుతుంది. ప్రేమ అనిపించుకోదు!

ప్రేమ ఎంతో పవిత్రమైనది. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ల ఇష్టాలను గౌరవిస్తాం. వాళ్లు కోరిన దాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటాం. చివరికి మన ప్రాణాన్నయినా సరే వాళ్లకోసం త్యజించడానికి వెనకాడం. అంటే ప్రేమ ఎంతో శక్తిమంతమైనదనీ ఔదార్యంతో నిండిన ఉదాత్తమైన త్యాగగుణం ప్రేమలో ఉందనీ తెలుస్తోంది. త్యాగంతో నిండిన ప్రేమ పవిత్రమైనదంటారు. పవిత్రమైన ప్రేమతో సావిత్రి చనిపోయిన తన భర్త సత్యవంతుణ్ని తిరిగి ప్రాణాలతో పొందగలిగిందని చదువుకున్నాం. రుక్మిణీదేవి పవిత్ర ప్రేమను పొందడం కోసం శ్రీకృష్ణుడు ఎందరో రాజులతో యుద్ధం చేయవలసి వచ్చింది. ప్రేమజంట లైలా మజ్నూలు ఒకరి కోసం ఒకరు చనిపోవడాన్ని సూఫీ సంప్రదాయానికి సంబంధించిన పవిత్ర ప్రేమగా నేటికీ చెప్పుకొంటారు. షీరీ ఫరహాద్‌ల ప్రేమగాథ, పార్వతీ దేవదాసుల ప్రేమగాథ ఆయా సాహిత్యాల్లో అమరమయ్యాయి. ప్రేమ, త్యాగం రెండూ వేరు కాదు. ఒక్కటే!

భగవంతుడు ఎల్లవేళలా అందరికీ కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటాడని చెబుతారు. బదులుగా ఆయన ఎవరి నుంచీ ఏమీ కోరడు. కారణం? భగవంతుడు ప్రేమ స్వరూపుడు గనక.

ప్రేమకు ఇవ్వడమే తెలుసు. బదులుగా దేన్నీ పొందాలని ఆశించదు. అందుకే ప్రేమమార్గం కోరిక లేని, స్వార్థం లేని ఉత్తమ మార్గమైంది.

దంపతులు ఒకరికొకరు తమ సర్వస్వాన్నీ ఇవ్వడానికి బద్ధులై ఉంటారు. తల్లిదండ్రులు తమ సర్వస్వమూ బిడ్డలకే ఇస్తారు. తిరిగి వాళ్లనుంచి ఏమీ కోరరు. పిల్లలు కూడా వృద్ధులైన తమ తల్లిదండ్రులకు ఎన్నో సేవలు చేస్తారు. వీరందరి చేత ఈ పనుల్ని చేయిస్తున్నది వాళ్లలో ఉండే నిస్వార్థమైన ప్రేమే. పెద్దలు పిన్నల మీద చూపించే వాత్సల్యంలో ఈ ప్రేమే ఉంది. తల్లి తన సంతానం మీద చూపే మమత ఈ ప్రేమే. ఇరువురు మిత్రుల మైత్రి, అనురాగాల్లో సైతం ఈ ప్రేమ పరిమళమే గుబాళిస్తూ ఉంటుంది. భగవంతుడి మీద చూపించే భక్తిపారవశ్యంలోనూ భక్తుని ప్రేమభావమే వెల్లివిరుస్తుంది. ఇలా, మనమంతా ప్రేమ ప్రతిమలమే. ప్రేమకు ప్రతినిధులమే. వెన్నెల సెలయేరులా చల్లగా ప్రేమ మన హృదయాలను సేద తీరుస్తుంది. శాంతినిస్తుంది. నిస్వార్థమైన ప్రేమమార్గాన్ని మనం అనుసరిద్దాం.

- కాలిపు వీరభద్రుడు