ᐅ ఆధ్యాత్మిక ప్రగతి
ఆధ్యాత్మిక జీవనం ప్రపంచంలో యాంత్రికంగా మారిపోయింది.
అలవాటుగా ఉదయాన్నే లేచి, స్నానసంధ్యలు ముగించుకుని, నొసట విభూతిరేఖలో, త్రిపుండ్రాలో, కుంకుమబొట్టో ధరించి, ఇష్టదేవతా పూజకు కూర్చోవడం, ఎలాగోలా ముగించి, ప్రసాదం పుచ్చుకొని 'హమ్మయ్య! ఓ పనైపోయింది' అనుకోవడంతో ఆరోజు కార్యక్రమంలో ఒక ఘట్టం ముగుస్తుంది. రోజంతా ఏవేవో వృత్తివ్యాపారాల వ్యాపకాలు, సాయంత్రానికి అలసట. భోజనానంతరం నిద్ర. తెల్లారగానే మళ్ళీ పాత దినచర్య.
ఇలా మన ఆధ్యాత్మికత గొర్రెతోకలాగ ఎదుగుబొదుగులేకుండా, కాగితం పువ్వులా చూడటానికి తప్ప, ఆనందం కలిగించేదిగా ఉండదు. ప్రకృతిని పరిశీలించండి. మొక్కలు ప్రతిరోజూ ప్రగతిని చూపిస్తాయి. కొత్తచివుళ్లు వేస్తాయి. పువ్వులు పూస్తాయి. పువ్వులు కాయలవుతాయి. కాయలు పళ్లవుతాయి. మనకు కనిపించే ఈ ప్రగతిలో ఒక మౌనసందేశం ఉంది.
చైతన్యమే జీవితం, జడత్వం కాదు- అన్నదే ఆ సందేశం. ప్రతిరోజూ మన ఆయుష్షు తగ్గిపోతుంటుంది.
జ్ఞానం మాత్రం ఎదగకుండా ఉండిపోతోంది. కొవ్వొత్తి కరిగిపోతున్నా, చివరిదాకా వెలుగునిస్తూనే ఉంటుంది. అదే మనకు ఆదర్శం కావాలి.
ఎంతకాలం జీవించామని కాదు.
జీవితాన్ని ఎంత సఫలీకృతం చేసుకున్నామన్నదే ముఖ్యం.
తపస్సు విషయం చూడండి. ప్రతిరోజూ తాపసికి శక్తి పెరుగుతూనే ఉంటుంది. పౌరాణికగాథలు- మహాతపస్వుల తపోజ్వాలలు వూర్ధ్వలోకాలను తల్లడిల్లజేశాయని, దేవుడు దిగిరాక, వరాలు ఇవ్వక తప్పలేదని చెబుతారు.
ఆధ్యాత్మిక ప్రగతికది పరాకాష్ఠ అన్నమాట.
పరమేష్ఠి అయినా, పరమేశ్వరుడైనా, పరాత్పరుడైనా, తపస్వికి వరాలియ్యక తప్పదు. ఈ పరమసత్యాన్ని మనం మరచిపోకూడదు. మనందరం తపస్వులం కాకపోవచ్చు. కానీ తమస్వులం కాకుండా మనల్ని మనం తప్పక కాపాడుకోగలం.
యాంత్రిక పూజాతంతులకు బదులు, ఆత్మతో, అంతర్యామితో అనుసంధానానికి అహరహం కృషిచెయ్యాలి. ఏ క్షణంలో మనకు 'ఈ శరీరం నేను కాదు' అనే స్థిరబుద్ధి కలుగుతుందో, ఆ క్షణమే మనకు జ్ఞానమార్గం దొరికినట్లు! ఆ క్షణం నుంచీ...
మనం ఎవరినీ శరీరధారులుగా చూడం.
ఆత్మజ్యోతులుగానే చూస్తాం. 'ఆత్మవత్ సర్వభూతాని' అన్నట్లుగా- అన్నింటా అంతటా ఆత్మనే చూడగల స్థాయికి చేరుకోవటమే అసలైన ఆధ్యాత్మిక ప్రగతి.
అప్పుడు కులమత భేదాలుండవు. అసూయాద్వేషాలు ఉండవు. ఆధిక్యతాభావాలు, అహంకారమూ ఉండవు.
ఎటు చూసినా ఆనంద తరంగాలు... ఎవర్ని చూసినా ఆత్మీయతాభావాలు... ఇదే భారతీయ ఆధ్యాత్మిక పునాది.
ఈ పునాదుల్ని తిరిగి మనం నిర్మించుకోవాలి.
- కాటూరు రవీంద్రత్రివిక్రమ్