ᐅ భక్తిలోని పరమార్థం

 ᐅ భక్తిలోని పరమార్థం!

జీవాత్మ పరమాత్మను చేరుకోవడానికి సోపానం 'భక్తి'. 'భక్తి' అంటే సేవించడం అని అర్థం. జీవాత్మ పుట్టుకకూ, స్థితికీ, చివరికి మోక్షానికీ మూలకారణమైనవాడు పరమాత్మ. కనుక జీవుడు బతికి ఉన్నంతకాలం సేవించవలసింది పరమాత్మనే కాని, అంతకంటె భిన్నమైనవారిని కాదు. పరమాత్మ ముందు సకల జీవరాశులూ అల్పమైనవే. వాటికి అస్తిత్వమేదీ లేదు. వాటికి ఉండే అస్తిత్వమంతా పరమాత్మలోనే. కనుక సేవించడం అనేది జీవుడి ప్రాణం ఉన్నంతవరకు పరమాత్మను ఉద్దేశించిందే.
భక్తి తొమ్మిది విధాలని భాగవతం చెబుతోంది. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే ఈ నవవిధ భక్తులు మానవుడి జీవితాన దినచర్యలోని అంశాలే కాని వేరు కాదు. భక్తి అంటే సేవించడం ఒక్కటేకాదనీ, భగవంతుడి పట్ల పరమప్రేమగా ఉండటం, ఎప్పుడూ తైలధారవలె ఎడబాటు లేకుండా అనుసంధానమై ఉండటం, ఇతరమైన ఆసక్తి ఏదీ లేకుండా భగవంతుడిపైనే ఆసక్తి కలిగి ఉండటం, భగవంతుడికి సర్వకాల సర్వావస్థల్లో అనుకూలంగా ఉండటం, ఎల్లవేళలా భగవంతుణ్ని స్మరించడం, ధ్యానం చేయడం, అంతఃకరణంలో భగవంతుడి ఆకృతిని ఆరాధించడం... మొదలైనవన్నీ భక్తిలోని అంతర్భాగాలేనని రుషుల ఉపదేశం.

లౌకికుడైన మానవుడు ఏ లాభమూ లేనిదే భగవంతుణ్ని అయినా తలచుకోడు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు- 'ఓ అర్జునా! నన్ను నాలుగువిధాలుగా జనులు ఆశ్రయిస్తారు. వీరిలో మొదటిరకంవారు తమకేదైనా ఆపద కలిగితే దాన్ని తొలగించాలని కోరతారు. రెండోరకంవారు నా తత్వాన్ని తెలుసుకోవాలనే తపనతో ఉన్నవారు. మూడోరకంవారు డబ్బుకోసం నన్ను ప్రార్థించేవారు. నాలుగోరకంవారు జ్ఞానసముపార్జనకోసం నన్ను అర్థించేవారు. ఇలా ఎవరెవరు ఏ కోరికతో నన్ను భజిస్తారో వారి వారికి ఆయా ఫలితాలనే నేను ప్రసాదిస్తాను' అంటాడు. అంటే 'భక్తి' అనేది జీవుడి ఉపయోగం కోసమే తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోంది. కోరికలే లేని భగవంతుడికి భక్తులు సమర్పించే వాటితో ఏ అవసరమూ లేదు. అయినా భగవంతుడు జీవులకోసం అన్నీ ఓర్చుకుంటాడు. ఏది ఇచ్చినా, ఇవ్వకున్నా పట్టించుకోడు. చిత్తశుద్ధిని మాత్రమే కోరుకుంటాడు. సద్గుణరాశిని ఇష్టపడతాడు.

భగవత్కథల శ్రవణం వల్ల పరీక్షిత్తు ముక్తిని పొందాడు. భగవన్నామ సంకీర్తనం వల్ల నారదాదియోగులు తరించారు. నారాయణ నామస్మరణం వల్ల అజామిళునివంటివారు పుణ్యాత్ములయ్యారు. భగవత్పాదసేవనం వల్ల భరతుడు కృతకృత్యుడయ్యాడు. భగవదర్చనం వల్ల విష్ణుచిత్తుడివంటి భాగవతోత్తముడు ధన్యుడయ్యాడు. భగవద్వందనంవల్ల రుషులు చిరంజీవులయ్యారు. భగవంతుడికి దాస్యం చేయడంవల్ల ఆంజనేయుడివంటివారు మహావీరులయ్యారు. భగవంతుడితో సఖ్యం చేసి సుదాముడు మోక్షాన్ని పొందాడు. భగవంతుడికి సర్వం అర్పణచేసి రంతిదేవుడివంటివారు త్రిలోకవంద్యులయ్యారు. ఇలా భక్తి చేయని పనిలేదు. మానవులకు భక్తిని మించిన మరొక ఉపాయం లోకంలో లేనేలేదు.

భక్తిలోని పరమార్థాన్ని గ్రహిస్తే ఏ చింతా ఉండదనడానికి ప్రహ్లాదాదులు నిదర్శనంగా నిలుస్తారు. దేనికంటే ఉత్తమమైనది మరొకటి లేదో, దేన్ని నిరంతరం భావిస్తే శాశ్వత శాంతి లభిస్తుందో అదే భగవద్విషయం. అంటే భగవంతుడికి సంబంధించిన మాట. అది అమృతతుల్యమైంది. దానికి జరామరణాలు లేవు. ఈతిబాధలు లేవు. లాభనష్టాల లెక్కలు లేవు. అన్నీ శుభాలే. అన్నీ లాభాలే. అన్నీ సౌభాగ్యాలే. అన్నీ ఆనందాలే. ఆనందాలకే ఆనందం, ఆహ్లాదానికే ఆహ్లాదం అయిన భగవంతుడిపైగల 'భక్తి' జీవాత్ములకు ఏకైక తరుణోపాయం. దాన్ని వదలకుండా ఉంటే లోకంలో ఏ జీవికీ బాధలు ఉండవు.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ