ᐅ సద సద్విచారణ
లోకంలో సాధారణంగా ఒక వ్యక్తివద్ద ఉన్నదానితో అతణ్ని అంచనా వేస్తుంటారు. ఇల్లు, సంపద, పదవి, అంతస్తు వంటి బాహ్యమైన అభివృద్ధే అతడి హోదాను నిర్ణయిస్తుంది. బయటకు కనిపించని వ్యక్తంకాని ఆంతరిక పురోగతి, అనుభూతి విస్తృతిని చాలామంది గమనించరు. మనిషి బాహ్యంగానే కాదు, ఆంతరికంగానూ పురోగమిస్తాడు. అతనిలో ప్రేమ, కరుణ, వివేకం వంటి గుణాలు వికసిస్తాయి. తన శరీరాన్ని, తనను మాత్రమే ప్రేమించేవాడు తన ఇల్లు, తన గ్రామం, తన దేశం, లోకం అంటూ యావత్ప్రపంచాన్నీ తనదిగా ఎంచి ప్రేమించేమేరకు అతడి భావన విస్తృతి చెందుతుంది.
ఈ ఆంతరిక అభివృద్ధే నిజమైన అభివృద్ధి. బాహ్య పురోగతికి దోహదకారులైన సిరిసంపదలు, పదవులు తొలగిపోయినప్పుడు అతడు మొదటి స్థితిలోనికే దిగజారిపోతాడు. కాని ఆంతరిక పురోగతిలో దేన్నీ కోల్పోయే ప్రమాదం ఉండదు.
ఈ రెండు దృక్పథాలకు రంగస్థలం లోకమే. అంటే లోకం ఈ రెండింటికే అవకాశం కల్పిస్తోందన్నమాట. లోకాన్ని అది అందించే సుఖభోగాలనే పరమావధిగా చేసుకొనేవారు అనేకులు. అవి కొన్ని మెట్లు మాత్రమే అని భావించి కొంతమంది ఉన్నత లక్ష్యాలను ఆశిస్తారు. ఈ రెండు భిన్నమైన ఆలోచనలు కలవారికీ లోకం ఒక్కటే. మొదటిది బాహ్య పురోగతికి దోహదం చేస్తే, రెండోది ఆంతరిక పురోగతినిస్తుంది. మొదటిది సుఖప్రదమైనది కావచ్చు, రెండోది శ్రేయస్కరమైనది. ప్రాపంచిక సుఖాలు అనుభవించే దశలో సంతోషాన్ని కలిగించవచ్చు. కానీ, చివరకు దుఃఖంగా పరిణమించవచ్చు. ఉన్నత లక్ష్యాలు ఆరంభంలో కష్టంగా తోచినా అంతిమంగా మహదానందం కలిగిస్తాయి. పైపై సుఖాలను కోరుకునేవాడు చివరికి దుఃఖంలో కూరుకుపోతాడు.
సుఖకరమైనది, శ్రేయస్కరమైనదీ రెండూ మనిషి సమీపంలో ఉన్నపుడు బుద్ధిమంతుడు వాటిని విచారణ చేసి వివేచన చేస్తాడు. సుఖకరమైన దాన్ని విడిచిపెట్టి శ్రేయస్కరమైనదాన్ని ఎంచుకుంటాడు. బుద్ధిహీనుడు దానికి భిన్నంగా శారీరక క్షేమం, తాత్కాలిక సుఖం ఇచ్చేవాటినే వరిస్తాడని కఠోపనిషత్తు చెబుతోంది.
మనం మార్గంలో వెళుతుండగా ధనం దొరుకుతుంది. దగ్గర్లో ఎవరూ లేరు. అప్పుడనేక ఆలోచనలు చుట్టుముడతాయి. ఇది భగవంతుడు నాకిచ్చినది లేదా నా అదృష్టం కొద్దీ దొరికింది అని జాగ్రత్తగా ఆ ధనాన్ని సంచిలో వేసుకుని అక్కడినుంచి జారుకోవచ్చు. లేదా, ఆ డబ్బు పోగొట్టుకున్నవారెవరో కనుక్కొని అందించే ప్రయత్నం చేయవచ్చు. ప్రభుత్వానికి అప్పగించనూ వచ్చు. లేదా, ఆ డబ్బును తాను గ్రహించి దానితో పుణ్యకార్యాలు నిర్వహించవచ్చు. ధనాన్ని సొంతం చేసుకొని అనుభవించే వ్యక్తే సుఖం పొందుతాడు. కాని, అది దొంగతనమే. తనది కానిదాన్ని అనుభవించడంవల్ల అతణ్ని పాపం అంటుతుంది. ఈ విధంగా లోకం మనకు అవకాశాలు కల్పిస్తుంది. పరిస్థితులు సృష్టిస్తుంది. మనం విచక్షణతో వివేచనతో వ్యవహరించాలి. ఎలా ప్రవర్తిస్తే మనం ఉన్నత లక్ష్యానికి చేరువవుతామో నిర్ణయించుకోవాలి.
లోకంలో విద్య, అవిద్య రెండూ ఉన్నాయి. విద్య భగవన్మార్గాన్ని చూపుతుంది. అవిద్య మోహంలో ముంచెత్తుతుంది. కామం, ధనాశ దాన్నుంచే ఉత్పన్నమవుతాయి. విద్య భక్తిని, కరుణను, జ్ఞానాన్ని, ప్రేమను జనింపజేస్తుంది.
ప్రాపంచికత నడుమ జీవించే మూఢులు తమను బుద్ధిశాలురుగా, పండితులుగా భావించుకొని అడ్డదారులు తొక్కుతారు. 'కానని వాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి...' అంటారు భాగవతంలో పోతన. గుడ్డివాడి సహాయంతో మరొక గుడ్డివాడు ఎలా వస్తువులు చూడలేడో అలాగే వీళ్లు జనన మరణ సుడిగుండంలో పరిభ్రమిస్తుంటారు.
కర్రతో చేసిన క్రూరమృగం బొమ్మను చూసిన పిల్లవాడు భయపడతాడు. అతడు కొయ్యను చూడలేడు. బయటకు గోచరించే మృగాన్నే చూడగలుగుతాడు. మనోవికాసం పొందిన వ్యక్తి దాన్ని కర్రబొమ్మగానే భావించి భయపడడు. లోకం కూడా అటువంటిదే. ప్రాపంచిక సుఖాలు, ధనాశ మన మీద ఆధిక్యం చలాయిస్తున్నప్పుడు మనకు భగవన్మార్గం కనబడదు, అడ్డదారులే గోచరిస్తాయి. ఈ దారులను ఆశ్రయించేవారు మృత్యుదేవత వద్దకే పోతుంటారు. ఆంతరిక పురోగతి ధ్యేయంగా చేసుకొన్న భగవన్మార్గం కఠినంగా తోచినా, ఆనందప్రదం.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు