ᐅ సృష్టిలో తీయనిది
ఒక మంచి స్నేహితుణ్ని పొందడంకన్నా మించిన వరం జీవితంలో మరొకటి లేదు. అడుగడుగునా ప్రోత్సాహం ఇచ్చే మృదుభాషణుడైన స్నేహితుడు ఉంటే జీవితంలో నైరాశ్యం అంటూ ఉండదు. అటువంటి మిత్రుడు దొరకడం అత్యంత దుర్లభం.
స్నేహితులు చాలా అవసరం కాని, మంచి స్నేహితుల్ని సంపాదించడం ముఖ్యం. సూర్యుడు ఉదయించినప్పుడు మనిషి నీడ పొడవుగా ఉంటుంది. సూర్యుడు కదులుతున్నప్పుడు నీడ క్రమంగా చిన్నదవుతుంది. మిట్టమధ్యాహ్నం వేళకు నీడ అడుగు పొడవుకూడా ఉండదు. ఇదే విధంగా చెడు స్నేహితుడి స్నేహం సాగుతుంది. ముందు మంచి మాటలతో స్నేహం చేస్తారు. స్నేహం చాలాకాలం ఉంటుందన్న అభిప్రాయం కలుగుతుంది. చెడు మిత్రుల మాటలు పొగడ్తలు మాత్రమే. వారి మాటల్లో అర్థం కనిపించదు. ఒక వ్యక్తినుంచి ఏదో కావాలని కోరుకొని స్నేహం చేసేవారే ఎక్కువ. అవసరమైన క్షణంలో వారు కనిపించరు. ఆసరాగా నిలబడరు.
సూర్యుడి వల్ల పడిన నీడలాగానే వారి స్నేహం నెమ్మదిగా తగ్గిపోతుంది. మధ్యాహ్నం గడిచిన పిమ్మట పడే నీడలాగా మంచివారితో స్నేహం పెరుగుతుంది. సాయంత్రానికి మరింత పెద్దదవుతుంది. మంచివారు సులభంగా దొరకరు. కాని, ఒకసారి వారి విశ్వాసం పొందగలిగితే అది చివరిదాకా నిలిచి ఉంటుంది. తమ ప్రయోజనాలకోసం స్నేహితుల్ని వారు వాడుకోరు. చెడ్డవారు స్నేహితుల ప్రేమను, గౌరవాన్ని దుర్వినియోగం చేయడానికి వెనకాడరు. ఒక్కొక్కసారి మిత్రుడు మృతి చెందినా విచారించరు.
రావణుడితో స్నేహంవల్ల మారీచుడు ఎంత నష్టపోయాడో మనకు రామాయణం చెబుతుంది. శ్రీరాముడి బలం ఎటువంటిదో మారీచుడికి తెలుసు. ఒకసారి మారీచుణ్ని రాముడు సముద్రంలోకి నెట్టాడు. మారీచుడు ఈ సంఘటనతో ఎంత భయపడ్డాడంటే, 'రా' అనే అక్షరం పలకగానే భయంతో వణికిపోయేవాడు. సీతను అపహరించడం కోసం మారీచుణ్ని రావణుడు పావులాగా ఉపయోగించుకున్నాడు. మారీచుడు రాముణ్ని దూరంగా తీసుకొని వెళ్లడానికి ఇష్టపడడు. 'అలా చేయకపోతే నిన్ను చంపుతా'నని రావణుడు మారీచుణ్ని బెదిరించాడు.
రావణుడి చేతిలో మరణించడంకన్నా రాముడి చేతిలో మృతి చెందడమే మేలని మారీచుడు భావించాడు. దుష్టులతో మైత్రి అటువంటిది. దుష్టులతో మొదట స్నేహం తీయగా ఉన్నా చివరికి విషాదంగా మారుతుంది.
నిన్ను నిన్నుగా తెలుసుకున్నవాడు, జీవితంలో నువ్వు ఎక్కడవున్నావో అర్థం చేసుకున్నవాడు, నువ్వు ఎంతటివాడివైనా ఆమోదించేవాడు, నువ్వు ఇంకా, ఇంకా ఎదగడానికి అన్ని అవకాశాలూ ఇచ్చేవాడు... అతడే నిజమైన స్నేహితుడు. అతడే అసలు స్నేహితుడని బంగారు అక్షరాలతో గుండెల్లో రాసుకోవచ్చు.
సృష్టిలో కొన్ని నిర్వచనానికి అందవు. వాటిలో స్నేహం ఒకటి. స్నేహం- ప్రాణం, స్పందన, మంత్రం, ఆరాధన, అనుపమ బంధం, ఆత్మీయ సుగంధం, యుగాలు నిలిచే మాట, జన్మలు దాటే పాట, ఆత్మల పిలుపు, మనసు తెరపై నైరూప్య చిత్రం, నిశ్శబ్దం చెక్కిన శిల్పం, ఒక కర్పూర దీపం, ఒక నక్షత్ర ద్వీపం, ఒక చిరునవ్వు, ఒక ఆశ, ఒక వెన్నెల తీరం... ఒక్క మాటలో చెప్పాలంటే- స్నేహమంటే జీవితమే!.
- కె.యజ్ఞన్న