ᐅ రథసప్తమి
తాను ఉదయించి జగతిని చైతన్యపరచేవాడు, తన స్పర్శతో, ఆరోగ్యాన్నిచ్చేవాడు, గతి తప్పని నిరంతర గమనశీలి, సమయపాలనకు చక్కని నిర్వచనంగా చెప్పదగినవాడు సూర్యభగవానుడు. 'సూర్య' అనే పదానికి 'ప్రేరేపించువాడు' అని అర్థం. చరాచర జగత్తంతా ప్రేరణ పొందేది, తమ తమ కర్తవ్యాలను నిరాటంకంగా నిర్వహించే శక్తిని గ్రహించేదీ సూర్యుడి ఉనికి ప్రత్యక్షంగా ఉన్నప్పుడే. అందుకే సూర్యుణ్ని 'కర్మసాక్షి' అని పిలుస్తారు. ఇతడి జన్మతిథి మాఘశుక్ల సప్తమి. ఈ రోజు ఆకాశంలో నక్షత్రాలు రథాకారం దాల్చుతాయి కాబట్టి దీనికి 'రథసప్తమి' అనే పేరు వచ్చిందని రుగ్వేదంలోని మహాశౌరం చెబుతోంది.
సూర్యుడికీ సప్త(ఏడు) సంఖ్యకూ అవినాభావ సంబంధం ఉంది. అతడి జన్మ తిథి సప్తమి. రథానికి గుర్రాలు ఏడు. పయనించేది సప్తద్వీప పర్యంతం. కిరణాల్లోని కాంతి ఏడు రంగుల సమాహారం. వెలుగులు ప్రసరించేది సప్త సముద్ర పర్యంతం. కాబట్టే సూర్యుణ్ని సప్తలోక ప్రదీపుడిగా వేదాలు, ఉపనిషత్తులు స్తుతిస్తున్నాయి.
'సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకూ సూర్యుడే ఆధారం. స్వయంప్రకాశ శక్తిలేని చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైనవన్నీ సూర్యకాంతి వల్లనే ప్రకాశిస్తాయి' అని కృష్ణ యజుర్వేదంలోని ఆరణ్యకాలు చెబుతున్నాయి. జీవుల సృష్టి, స్థితి లయలకు ఆధారం సూర్యుడేనని సూర్యోపనిషత్ చెబుతోంది. విజ్ఞాన శాస్త్రదృష్టితో చూసినా ఈ మాట నిజమేనని రుజువవుతుంది. సూర్యుడి చుట్టూ నిరంతరం అనేక గ్రహాలు పరిభ్రమిస్తూంటాయి. వాటిలో ప్రాణి పుట్టుకకు, ఉనికికి ఆధారమైన నీరు ఉన్నది భూగ్రహం మీదే. ఆ నీటినుంచే ప్రాణికోటి ఆవిర్భావం జరిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల సృష్టికి ఆధారం సూర్యడేనని తెలుస్తోంది.
కాలగణనలో ఒక్కొక్క మనువు పేరుతో, ఒక్కొక్క మన్వంతరం ఉంది. వాటిలో ముఖ్యమైనది, ప్రస్తుతం జరుగుతున్నది- వైవస్వత మన్వంతరం. ఈ పేరుకు మూలాధారుడైన వైవస్వతమనువు, వివస్వంతు (సూర్యు)ని కుమారుడే. తండ్రి జన్మదినమైన రథసప్తమినాడే ఈ మన్వంతరం మొదలై అమలులోకి వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రత్యక్షంగాగాని, పరోక్షంగాగాని సూర్యుడి వల్లనే జీవజాలమంతా ఆరోగ్యం పొందుతోంది. సూర్యుడి లేత ఎండ కిరణాలు శరీరాన్ని తాకితే తేజస్సు పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అందుకోసమే ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం, సంధ్యావందనం ఆచరించడం, సూర్యనమస్కారాలు చేయడం, అర్ఘ్య ప్రదానం ఇవ్వడం లాంటివి సూర్యుడి ఎదురుగా నిలబడి చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏదో మిషతో నీరెండలో నిలబడటం ఆరోగ్యప్రదమంటున్న విజ్ఞాన శాస్త్రం ఈ విషయాన్నే బలపరుస్తోంది. విదేశీయులు సైతం సూర్య స్నానం పేరుతో నీరెండలో నిలబడటంలోని ఆంతర్యం ఇదే.
రథసప్తమినాడు ఆచరించే అనేక కర్మల్లోని మర్మం ఆరోగ్యాన్ని ఇసుమడింపజేయడమే. వాటిలో మొదటిది- రేగు (పండుగాని, ఆకుగాని), జిల్లేడు ఆకులు కలిపి తలమీద పెట్టుకుని స్నానం చేయడం. ఈ రెండింటికీ సూర్యుడి కిరణాల్లోని ఆరోగ్య కారక లక్షణాలను, శక్తిని గ్రహించి శరీరానికి అందించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. ప్రతిరోజూ అలా స్నానం చేయడం మంచిదే. అది అందరికీ సాధ్యంకాదు కాబట్టి అర్క (సూర్యుని) జయంతి నాడు అర్క (జిల్లేడు) పత్రం శిరస్సు మీద ధరిస్తే శుభ ఫలితాలుంటాయని వైదిక వచనం. రెండో కర్మ- పాయసాన్న నివేదన. ఈ రోజు కొత్త బియ్యం, కొత్త బెల్లం కలిపి సూర్య కిరణాలు ప్రసరించే ప్రదేశంలో ఆవుపాలతో పాయసం వండుతారు. దాన్ని చిక్కుడు ఆకుల మీద ఉంచి సూర్యుడికి నివేదన చేస్తారు. ఆపై ప్రసాదంగా స్వీకరిస్తారు. రథసప్తమి నాటి సూర్య కిరణాల్లో ఉన్నశక్తి ఆ పాయసంలో చేరి, ఔషధగుణాలు కలిగిన చిక్కుడాకులతో జరిగిన రసాయనిక చర్యవల్ల ఆ ప్రసాదం స్వీకరించినవారి ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. మూడోది- సూర్యుణ్ని స్తుతించే 'అరుణం' మహాశౌరం పఠించడం వంటివి చేయడంవల్ల ఆ ధ్వనితరంగాలు పరిసరాల్లో వ్యాప్తిచెంది ఆ ప్రదేశమంతా ఆరోగ్య వాతావరణం కలిగి ఉంటుందనేది పూర్వాచారపరాయణుల భావన.
వేద విహితమైన గాయత్రీ మంత్రం, రుగ్వేదంలోని మహాశౌరం పేరిట రుక్కులు, వాల్మీకి రామాయణంలో ఆదిత్య హృదయం, భారత భాగవతాల్లోని సూర్యస్తుతులు... ఇవన్నీ సూర్యుడి గొప్పతనాన్ని, మహిమలను చాటుతున్నాయి.
నవగ్రహాల్లో అగ్రస్థానం సూర్యుడిదే. దేశాలు, ప్రాంతాలు, ఆచారాలు, ఆరాధన విధానాలు... వేరుగా ఉన్నా- చాలా దేశాలవారు దేవుడని నమ్మేది, ఒప్పుకొనేది, ఆరాధించేది సూర్యుణ్నే. దేవుడనే పేరుతో కాకున్నా అతి ప్రాచీన కాలంనుంచి ప్రపంచంలో అనేక తెగలు, జాతులు, సూర్యుణ్ని ఆరాధిస్తున్నట్లు, ఉపాసిస్తున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
- అయ్యగారి శ్రీనివాసరావు