ᐅ మానవుడి దశలు

 ᐅ మానవుడి దశలు

మానవుడు తన నూరేళ్ల జీవితంలో తప్పక అనుభవించవలసిన దశలు నాలుగు. అవి- బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యాలు. అయిదేళ్ల వరకు బాల్యం, పదిహేను సంవత్సరాల వరకు కౌమారం, నాలుగు పదుల వరకు యౌవనం, ఆ తరవాత వృద్ధాప్యం... క్రమంగా సంప్రాప్తించే దశలు. మనిషి అవునన్నా, కాదన్నా ఇవి జరిగిపోతూనే ఉంటాయి. ఈ నాలుగు దశలు ఉన్నవాళ్లు మానవులైతే, మూడు దశలు ఉన్నవాళ్లు దేవతలు. దేవతలకు బాల్య, కౌమార, యౌవనాలే ఉంటాయి కానీ, వృద్ధాప్యం ఉండనే ఉండదు. అందువల్ల దేవతలకు 'త్రిదశులు' అనే పేరు వచ్చింది. దేవతలకు లేని నాలుగో దశ 'వృద్ధాప్యం' ఉన్నందుకు మనిషి గర్వించాలా? లేక వృద్ధాప్యంలో వచ్చే బాధలను తలచుకొని దుఃఖించాలా? అంటే రెండూ చేయవలసిందే అనేవాళ్లు కనిపిస్తారు.
బాల్యం మానవుడి జీవితంలో తొలిదశ. ఆటపాటలతో ఆసక్తుడై ఉండే మనిషికి ఈ దశ వేగంగా గడిచిపోతుంది. ముద్దుముచ్చట్లతోనే పొద్దు గడచిపోతుంది. తెలిసీ తెలియనితనం ఈ దశలోని ప్రత్యేకత. భగవంతుడిలో ఉండే రుజువర్తనం బాల్యంలో ఉంటుందని పెద్దలు అంటారు. అందుకే పిల్లలు ఏది మాట్లాడినా 'బాలవాక్కు బ్రహ్మవాక్కు' అని ప్రశంసిస్తారు. బాల్యం లేత మొక్కలాంటిదనీ, దాన్ని ఎటువైపు వంచితే ఆ దిశవైపే పాకిపోతుందని నీతివేత్తల అభిప్రాయం. అందుకే బాల్యంలోనే మంచి అలవాట్లను నేర్పాలని ఉపదేశించే సూక్తులు విరివిగా కనబడతాయి. పసితనంలో పడిన ఏ ముద్ర అయినా శాశ్వతంగా ఉండిపోతుంది కనుక, పసివాళ్లను మంచిదారిలో నడపాలని పూజ్యులు చెబుతారు.

కౌమార దశ విద్యార్జనకు, జ్ఞానసముపార్జనకు ఆలవాలం. పాఠశాలలనూ, గురువులనూ ఆశ్రయించి నేర్చుకొన్న విద్యలు భావి జీవితాన్ని సుఖవంతం చేస్తాయి. కనుక కౌమారదశ కీలకమైంది. ఈ దశలో అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుందో కాలక్రమంలోగానీ తెలియదు. విద్యాసాధనకు కాకుండా వ్యర్థంగా గడిపిన పక్షంలో మనిషి జీవితాంతం కుమిలిపోవలసిన దుస్థితిని ఈ దశ కలగజేస్తుందని అందరికీ తెలుసు. ఈ దశ విలువ తెలిసినవాళ్లెవరూ ఈ కాలాన్ని దుర్వినియోగం చేయరు.

మూడోదశ యౌవనం. ఇది మనిషి బతుకులో అత్యంత ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుందనడంలో సందేహం లేదు. యౌవనం సుఖాభిలాషకు మూలం. యౌవనం చిగురులు వేస్తున్న సమయంలోనే కోరికలు మొగ్గలు తొడుగుతాయి. ఆశలు కాయలు కాస్తాయి. అనుభవాలు ఫలిస్తాయి. మధురమైన ఫలాన్ని మనసారా ఆస్వాదించినట్లు యౌవనం సుఖాలను జుర్రుకొంటుంది. కామనలు సర్పాలై బుసలు కొడుతుంటాయి. అడ్డూ అదుపూ ఏదీ ఉండదు. అనుకున్న దాన్ని అవశ్యం ఆచరించాలని మనసు ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. కాలు జారడం సహజమవుతుంది. అనుభూతుల్లో తేలడం స్వభావమవుతుంది. ఈ దశను అదుపు చేయడం ఎంతో కష్టం. పగ్గాలు లేని గుర్రాలు పరుగెత్తుతుంటే వాటిని అదుపు చేయడం ఎంత కష్టమో యౌవనదశను కట్టడి చేయడం అంతకన్నా కష్టం. లోకంలోని ఆకర్షణలన్నీ ఏకంగా ఈ దశనే ఆవహిస్తాయి. భూతాలై పట్టి పీడిస్తాయి. పీల్చి పిప్పి చేసిన తరవాతగానీ వదలిపెట్టవు. కనుక యౌవనం ప్రమాదాలకు నెలవు. అపాయాలకు కొలువు.

చివరి దశ వార్ధక్యం. అంటే, వృద్ధాప్యం. యౌవనంలో తన అందాన్ని చూసుకొని తానే మురిసిపోయిన మనిషి వృద్ధాప్యంలో అద్దంలో తన ముఖం చూసుకొని ఏడుస్తాడు. అది తన ముఖమేనా అని సంశయిస్తాడు. ముగ్గుబుట్ట వంటి తల, ముడతలు దేరిన శరీరం, వంగిపోతున్న నడుము, వూడిపోయే దంతాలు, వాలిపోతున్న ఆయువు ఇవన్నీ రోతను కలిగిస్తుంటే మనిషికి మనశ్శాంతి కరవే. యౌవనంలో చేసిన పాపాలన్నీ గుర్తుకు వస్తుంటాయి. వాటిని అలా చేయకపోయి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. కానీ ఏం లాభం? కాలమంతా కర్పూరంలా హరించుకొని పోయింది. ఇప్పుడు జ్ఞానోదయమైనా ఏమీ చేయలేని పరిస్థితి. కాలు కదపలేని దుస్థితి. ఇలాంటి దశలోనే మనిషి ధైర్యంగా ఉండాలి. బాల్య, కౌమార, యౌవనాల్లో ఉడుకురక్తం ప్రవహిస్తుంటే శరీరంలో, మనసులో ఎక్కడలేని ధైర్యం ఉంటుంది. కానీ వృద్ధాప్యంలో ధైర్యంగా నిలవగలగడమే మనిషికి పరీక్ష. ఈ దశలో మనిషి తృప్తిగా బతకాలి. అసంతృప్తిని దరిజేరనీయరాదు. 'గత జలసేతుబంధనం' (నీళ్లు ఇంకిపోయిన తరవాత ఆనకట్ట కట్టడం) ఎందుకని ఆలోచించుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. శేషజీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఆత్మోన్నతికై తపించాలి. ప్రశాంతతను జపించాలి. చేతనైనంతలో ఇతరులకు సాయం చేయడానికి పూనుకోవాలి.

భగవంతుడు దేవతలకు కూడా ఇవ్వని నాలుగు దశలను మనిషికి ఇచ్చాడంటే మనిషిని దేవుడు ఎంత విశిష్టంగా సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. కనుక నాలుగు దశలనూ, నాలుగు కాలాల పాటు అనుభవించి, జీవన మధురిమలను ఆస్వాదించి చరితార్థుడు కావడం మనిషి ముందున్న కర్తవ్యం.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ