ᐅ బాధ
దురదృష్టం, బాధలు, దుర్విధి- ఇవన్నీ మానవాళి అంతా అనుభవించవలసిందే. ప్రపంచంలో బాధ ఉపయోగం ఏమిటి? ప్రసిద్ధ తత్వవేత్తలను వేధించే ప్రశ్న అది. తుపానులు, భూకంపాలు, యుద్ధాల వంటి ప్రకృతి బీభత్సాల్లో అసంఖ్యాకులు మరణించడం చూసి కొందరు భగవంతుడు మంచివాడు కాడనుకుంటారు.
కష్టాలు, బాధలవల్లా ఉపయోగాలు ఉన్నాయన్నది పరిపూర్ణ అనుభవం పొందిన జ్ఞానులు చెప్పే మాట. వారు సృష్టిని, సృష్టిలోని రహస్యాలను ప్రగాఢంగా పరిశోధించిన పిమ్మటే ఆ అభిప్రాయానికి వచ్చారు.
బాధ అనేది లేకపోతే మహోన్నత భవితవ్యం, అమృతత్వ విజ్ఞానంవైపు మనిషి పరిణామం చెందడు. అతడిలో మనోవికాసం రాదు. బాధవల్లనే మానవాత్మ సృష్టి పరమార్థం ఏమిటో, విశ్వానికి అసలు పునాదులు ఏమిటో అర్థం చేసుకోగలుగుతుంది.
మనిషి ఆత్మ బాధాగ్ని ప్రజ్వలమైనప్పుడే జీవితాలు ఉత్తమ విలువలవైపు, జీవితాల అసలు స్వరూపం, శక్తి వైపు- జీవన ద్వారాలు తెరచుకుంటాయి.
బాధ వల్లనే అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక సీమలవైపు పురోగతి సాధ్యం అవుతుంది. బాధాగ్ని జ్వాలావలయాల్లో నడిచివెళ్లినప్పుడే జీవితాల పరిపూర్ణ సౌందర్యం, జ్యోతిర్మయ మహత్వం తెలుస్తాయి.
జీవి జన్మించాడంటే బాధామయ జీవితం సంసిద్ధంగా ఉందని అర్థం. ప్రతి బీజం బాధగా బద్దలైనప్పుడే పూలు, ఫలాల అందం, మాధురి బయటపడతాయి. స్త్రీ పురిటినొప్పుల పిమ్మటే అందమైన, అమాయకమైన, చిరునవ్వులు నవ్వే శిశువు ఉదయిస్తుంది. అగ్నిజ్వాలల్లో ముడిఖనిజం మండినప్పుడే మెరిసే స్వర్ణం ప్రవాహంలాగా బయటపడుతుంది. రాతిదెబ్బలు తిన్నప్పుడే ఏలకుల వంటి ద్రవ్యాల సుగంధం వ్యాపిస్తుంది. సాన రాపిడితో సగమయ్యే వజ్రం కాంతులీనుతుంది. నాగలితో భూమి గుండెను దున్నినప్పుడే పచ్చని పంటలు పండుతాయి.
బాధ లేకపోతే జీవితం పేలవంగా ఉంటుంది. జీవితానికి రుచి ఉండదు. వ్యధార్థ జీవన గర్భంనుంచే నిజమైన సౌందర్యం, శాంతి, ఆనందం ప్రభవిస్తాయి. బాధల పిమ్మట సుఖాల తీయదనం మరింత మనోహరంగా ఉంటుంది. అమృతత్వ లక్ష్యం సాధించదలచినవారు కష్టాలు, కన్నీరు, పరీక్షలను చిరునవ్వుతో ఆహ్వానిస్తారు. అవన్నీ వారి సంకల్ప శక్తిని మరింత పెంచుతాయి. శాంతి, ఆనంద శిఖరాలకు బాధలే సోపానాలు. ఆత్మ అమృతశాంతి పొందినప్పుడు జీవితం ఒక నిరంతర, అవర్ణనీయ ఆనందసుధా స్రవంతిగా మారుతుంది. బాధలు, కష్టాలు తమ విజయ కేతనాన్ని ఆ శిఖరాగ్రంపై ఎగరవేస్తాయి.
సృష్టికర్త కరుణార్ద్ర హృదయుడని, దయాసింధువని వారు లోకానికి ప్రకటిస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని వారు తప్పుపట్టరు. జీవితంలోని అతి ప్రగాఢ చీకటి క్షణాలు అమృత మహోదయాలకు మణిద్వారాలని వారికి తెలుసు. బాధల వల్ల ఆత్మ పువ్వులా విరిసి, అనంతత్వపు పరిమళాలు వెదజల్లుతుంది. శాశ్వతత్వపు ఆనందం వశమవుతుంది. శాంతి, కాంతి, ప్రేమ నిరపేక్ష ప్రవాహాలుగా పొంగి ముంచెత్తుతాయి.
- కె.యజ్ఞన్న