ᐅ శ్రీ పంచమి
మాఘశుద్ధ పంచమి దినాన్ని 'శ్రీ పంచమి' అని పిలుస్తారు. ఈరోజుకు ఉన్న ప్రత్యేకతలనుబట్టి వసంత పంచమి అని, మదన పంచమి అనీ పేర్లున్నాయి.
ముఖ్యంగా 'ఈ రోజు ప్రత్యేకత విద్యాప్రదాత్రి అయిన సరస్వతీదేవి పుట్టిన రోజు' అని బ్రహ్మవైవర్త పురాణంలోని ప్రకృతి ఖండంలో నాలుగో అధ్యాయం చెబుతోంది. కాబట్టి ఈ రోజు విద్యారంభ దినంగా జరుపుతారు. బెంగాల్‌లోను, దాని సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోను వైభవోపేతంగా శ్రీ పంచమి జరుపుతారు. ఈ రోజున వారంతా అత్యంత భక్తిశ్రద్ధలతో సరస్వతీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా బెంగాలులో విద్యార్థినీ విద్యార్థులే కాకుండా యావన్మంది ప్రజలూ సరస్వతీ పూజ చేస్తారు. విశేషమేమిటంటే అక్షరజ్ఞానం, దాని అవసరంలేనివారు సైతం ఈ రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. దేశంలో ఏ ప్రాంతంలోనూ లేనివిధంగా ఈ రోజున సరస్వతీమూర్తిని ప్రతిష్ఠించి(చాలా ప్రాంతాల్లో వినాయక విగ్రహాల్లా) పూజించి ఉత్సవాలు చేయడం ఈ ప్రాంతం ప్రత్యేకత. విద్యార్థులైతే విద్యార్జనకు సంబంధించిన పలకలు, పుస్తకాలు, సిరా సీసాలు, కలాలు మొదలైనవాటిని దేవి విగ్రహం ముందు ఉంచి పూజిస్తారు. కవులు, రచయితలు తమ తమ గ్రంథాలను ప్రాచీన సంప్రదాయానుయాయులు తమ ఇళ్ళల్లో ఉన్న ఇతర పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు మొదలైనవాటిని, సంగీత విద్వాంసులైతే ఆ పరికరాలనీ ఇలా విద్యకు సంబంధించిన వస్తువులన్నీ దేవి ముందుంచి సంప్రదాయబద్ధంగా పూజిస్తారు. అనంతరం కలాలు, పుస్తకాలు, పలకలు లాంటివి బహుమతులుగా ఇస్తారు. సాయంత్రం వరకు నృత్యగీతాదులతోను, పండితగోష్ఠులు, చర్చలు, ఇతర విద్యావిషయక సంభాషణలతో కాలం గడిపి సరస్వతీ విగ్రహాన్ని జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడంవల్ల సరస్వతీ కటాక్షం సిద్ధిస్తుందని వారు నమ్ముతారు. మనరాష్ట్రంలో బాసర క్షేత్రంలోను, కర్నూలు జిల్లా కొలనుభారతి అనే వూరిలో విశేష ఉత్సవాలు జరుపుతారు. ఉత్తరాంధ్రలో విజయనగరం పట్టణంలో ఇటీవల వెలసిన 'జ్ఞాన సరస్వతీదేవి' ఆలయంలోనూ ఈ దినాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు. ఆ ఆలయాల్లోనే కాకుండా పాఠశాలల్లో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. హరిద్వార్, హృషీకేశ్, ప్రయాగ లాంటి పుణ్య దేవాలయాల ఆధ్వర్యంలో శ్రీ పంచమి ఉత్సవాలు, మేళాలు జరుపుతారు. అక్కడ ఈ రోజున పూజలు చేసేవారంతా పసుపుపచ్చని బట్టలు ధరిస్తారు. నివేదన చేసే పదార్థాలు సైతం పసుపు రంగువి (పులగం, పులిహోర, కిచిడీ లాంటివి) ఉంటాయి. జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవిని ఒకానొక సమయంలో సాక్షాత్తు ఆమె భర్త అయిన బ్రహ్మే జ్ఞానసిద్ధికోసం పూజించాడని, ఆ క్షణంలో ఆమెను భార్యగా కాక, జ్ఞానదాయినిగానే భావించి అలా పూజించాడని ప్రతీతి. సనత్కుమారుడి సలహాయే అలా పూజించడానికి కారణమని పురాణాలు చెబుతున్నాయి.
చైత్ర మాసారంభంతో వసంతరుతువు ప్రారంభం అవుతుంది. రాబోయే వసంత రుతువును స్వాగతించే దినంగా దీన్ని చెబుతారు. అందుకే ఈ రోజున వసంతోత్సవం చేస్తారు. 'వసంత పంచమి' అని పేరు రావడానికి అదే కారణం. రాజస్థాన్ ప్రాంతంలో ఈ రోజున జరిపే వసంతోత్సవం ప్రత్యేకత సంతరించుకుంటుంది. వసంతాగమనానికి స్వాగతసూచకంగా వీరు వసంతాన్ని(సున్నం, పసుపుల సమ్మేళనంతో ఏర్పడే ఎర్రని ద్రవం) ఇతర రంగునీళ్లను బుక్క, బర్గుండలాటి రంగు పొడులను ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఈ ఉత్సవాలు అరుదుగా జరుగుతాయి.
తపస్సు చేసుకుంటున్న శివుడి మనసు అతడికి సేవలు చేస్తున్న పార్వతి వైపు మళ్ళేవిధంగా మదను(మన్మథు)డు తన పూలబాణం వేశాడు. అందుకు ఆగ్రహించిన శివుడు తన మూడో నేత్రంతో మదనుణ్ని భస్మం చేస్తాడు. మన్మథుడి భార్య అయిన రతీదేవి- సృష్టికి అత్యంత ఆవశ్యకమైన తన భర్తను సజీవుని చెయ్యమని కోరింది. ఆమె ప్రార్థన మన్నించిన శివుడు ఆమెకు మాత్రం శరీరధారిగా, మిగిలినవారందరికీ అనంగుడు (శరీరంలేనివాడి)గా పునరుజ్జీవింపజేశాడని పురాణ కథనం. అలా మదనుడు పునరుజ్జీవనం పొందినరోజు కాబట్టి ఈ రోజుకు 'మదనపంచమి', 'అనంగపంచమి' అనే పేర్లు వచ్చాయనీ చెబుతారు.
పైరు పంటలతో పంటలు కళకళలాడుతుంటాయి కాబట్టి ఆ ఆనందోత్సాహాలతో ప్రజలు ఈ రోజున 'యవేష్టి' అనే పూజచేసేవారని, ప్రస్తుతం ఆ ఆచారం కనుమరుగైందనీ అంటారు.
- అయ్యగారి శ్రీనివాసరావు