ᐅ మతం- వెలుగు, నీడ

 ᐅ మతం- వెలుగు, నీడ

లోకంలో జ్ఞానాన్ని అన్వేషించేవారున్నారు. జ్ఞానం ఆర్జించడంవల్ల ఉపయోగంలేదు అని భావించిన లౌకిక వాదులు అపార సంపదలు, అనంత సుఖాలు అన్వేషిస్తారు. జ్ఞానాన్ని ఆశించే ద్రష్టల చరమ లక్ష్యం ఆనందం... నిత్య ఆనంద స్వరూపమైన భగవంతుడు. భగవంతుడి సాన్నిధ్యంలో, ఆ కాంతిమయ నిశ్శబ్దంలో గడిపేవారికి అంతరంగమే జీవన గీతమవుతుంది. అదే విశ్వజీవన 'గీత'మవుతుంది. మానవాళికి వెలుగు చూపే మంత్ర ధ్యానంగా అది చిరకాలం వినిపిస్తుంటుంది.
హేతువు భౌతికలోక పరిధిలోనే తన అన్వేషణ సాగిస్తుంది. తనకు కనిపించిన సత్యం- భౌతిక జీవనం, భౌతికలోకం మించివుండదు. మతం, దేవుడు, శాశ్వతత్వం, ఆత్మ- ఇవేమీ హేతువుకు అవసరంలేదు. వాటివల్ల ధనం రాదు, భౌతిక సుఖం అసలు దొరకదు. తన ఇంద్రియ దాహాన్ని తీర్చలేనివి, తన ఆకలిని తృప్తిపరచ లేనివి ఏవైనా సరే- నిరుపయోగమైనవి. తినడం, తాగడం, పిల్లల్ని కనడం, మరణించడం- ఈ దశలను దాటి ఉన్నత శిఖరాలు చేరే ప్రసక్తిలేదు. నేలబారు జీవితం కన్నా ఉన్నతమైనది ఏదైనా ఉందా అని కనుగొనడానికి సుదీర్ఘ అన్వేషణ తప్పదు.

జన్మల ఉప్పు సముద్రాలు దాటినవారికి దివ్య జీవన అమృతభాండం లభిస్తుంది. మానవ జీవితానికి అత్యున్నత ఉపయోగం ఉంది. అదే దైవప్రేమ, దైవ సాయుజ్యం, దైవంలోకి విముక్తి. భూమి మీదనే దివ్య జీవన సాఫల్యం. అంతకు మించిన పూర్ణత్వం ఎక్కడ? అటువంటి జీవితం గడిపేవారు ఇప్పటికీ ఉన్నారు. అది మానవాళి అదృష్టం.

మతం అనే కల్పవృక్షంపై విరిసిన పంచరంగుల పుష్పాలే ఇతిహాస, పురాణాదులు. మతం అనే హోమగుండంలో మెరిసిన అగ్ని శకలాలే యజ్ఞయాగాదులు. ఈ దారిలో మహానీయ ద్రష్టలు ప్రభవించారు. వాటిలోని సంకేతాలు జీర్ణించుకుని, సందేశాల కాంతి పతాకాలను ఎగరవేశారు.

అదే మతంలో ఛాందసవాద విషసర్పాలూ సంచరిస్తుంటాయి. జీవితంలోని సౌందర్యమయ, కవితాత్మక, మహోత్కృష్ట సృజన, వైభవ ప్రాభవాలను అవి కాటు వేస్తాయి. అవి హేతువుకన్నా ప్రమాదకరమైనవి. ఆధ్యాత్మక వృక్షానికి అందే సారాన్ని అవి నాశనం చేస్తుంటాయి.

చిరంతనత్వపు శ్వేత కాంతిధారను కాల మరుభూమిగా మార్చేవి అవే. మతం రక్షణ ఛత్రం కింద దాగినవారు నిర్ణీత భౌతికవాదులు. వారికి కావలసింది భౌతిక సుఖ సామ్రాజ్యం. వారు తమ అజ్ఞాన, ఛాందసవాద నమ్మకాలనుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. మతం చాటున విశృంఖల జీవనం సాగించే కపట ఛాందసుల వ్యర్థ ప్రేలాపనలకన్నా నిజమైన ఆత్మసిద్ధి కోసం నిర్మల జీవనం సాగించేవారి మౌనం గొప్పది. అటువంటివారే నవజీవన నిర్ణేతలు, నవప్రపంచ నిర్మాతలు. వారి వ్యక్తిగత సిద్ధి అందరికీ ముక్తిప్రదం, ముక్తిపథం. వారి ప్రవచనాలు మన జీవితాలను ముంచెత్తే సత్యసుధా ప్రవాహాలు. వారి దివ్య సాన్నిధ్యం ఈ మట్టిలో స్వర్గావతరణకు మౌన భరోసా.

- కె.యజ్ఞన్న