ᐅ సర్వం నీవే

 ᐅ సర్వం నీవే!

ధ్యానం, సంయమం, సాధనల ద్వారా జగత్కారణుడైన ఆ భగవానుడి దర్శనం పొంది, ఆ పరమాత్మునిలో ఐక్యం చెందడమే జన్మ పరమార్థమన్న దివ్య ప్రబోధాలు ఈ నేల నలుచెరగులా నినదిస్తుంటాయి. కర్మబంధనంలో చిక్కుకోని అవతార పురుషులు జన్మించి, పరుల శ్రేయంకోసం ప్రజాబాహుళ్యానికి సుమార్గ బోధకులుగా, ఆధ్యాత్మిక గురువులుగా విలసిల్లారు.
గడచిన యుగాల్లో సనాతన ధర్మ ప్రతిష్ఠాపనకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అవతరించారు. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం భగవానుడే శ్రీ చైతన్యులుగా జన్మించారని భక్తులు విశ్వసిస్తారు. తరవాతి కాలంలో విదేశీయుల కబంధహస్తాలో నలిగిపోతున్న భారత జాతిని మేల్కొలిపేందుకు, ఆధ్యాత్మిక వెలుగులతో సముద్ధరించేందుకు ఆవిర్భవించిన భగవత్‌ స్వరూపమే శ్రీరామకృష్ణులు.

పరమ ధార్మికులైన క్షుదీరామ్‌, చంద్రాదేవి గర్భవాసాన జన్మించారు శ్రీ రామకృష్ణులు.

సాధనతో తాదాత్మ్య స్థితికి చేరడం, ఆత్మానందంతో దివ్యానుభూతి పొందడమే భక్తితత్వం పరమావధి అని తెలియజెప్పారు శ్రీరామకృష్ణులు. ఏ విషయం మీదనైతే ఇంద్రియాలు, మనోబుద్ధి చిత్త అహంకారాలు కేంద్రీకృతమై రమిస్తాయో అదే బ్రహ్మానందస్థితి. కాళీమాత దర్శన భాగ్యానికై ప్రగాఢ వాంఛ, దక్షిణేశ్వర కాళికాలయం, గంగాతీరం పంచవటీ ప్రాంతాలే కాదు- మరుభూములు సైతం ఆయన తపోవాటికలే. మనోవాక్కాయకర్మలు ఒక్కటిగా సాధకుడు దేన్ని అనుష్ఠించాలో గ్రహించి దాన్నే అనుష్ఠిస్తే లక్ష్యం చేతికందుతుందనడానికి శ్రీరామకృష్ణుల జీవితమే దృష్టాంతం.

భక్తిలో మూఢత్వం, మూర్ఖత్వం ఉండరాదని, పుణ్యక్షేత్రాల్లో అపవిత్రతకు తావుండరాదని ప్రబోధించేవారు. వైరాగ్యం, తపస్సు, ప్రేమలతో జీవితం గడిపేవారిలో తేజోవైభవం, సాధికారత ఉంటాయని శిష్యులకు చెబుతుండేవారు. గురువు తన ప్రతిబింబాన్ని శిష్యుడిలో చూసుకొని మురిసిపోతాడు. తన ఆశయాలను నిలిపే ఉన్నత వ్యక్తిత్వం శిష్యుడిలో ద్యోతకం కావాలని ఆశిస్తాడు. శ్రీరామకృష్ణుల పావన సాంగత్యభాగ్యం నరేంద్రనాథ్‌కు అయిదు సంవత్సరాల పాటు దక్కింది. ఎటువంటి స్వార్థప్రయోజనం లేకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అభిమానించడమనేది గురుశిష్య బంధంలోనే ఉంటుంది.

నరేంద్రుడిలో విశిష్టార్హతలున్నాయని రామకృష్ణులు, తనలోని సందేహాలను పోగొట్టి మార్గ నిర్దేశనం చేయగల సమర్థ గురువు రామకృష్ణులేనని నరేంద్రుడు- ఒకరినొకరు విశ్వసించిన వైనం... భారతజాతి సంస్కృతీ వికాసానికి, ఆధ్యాత్మిక పురోగామిత్వానికి అద్దం పట్టింది. సనాతన ధర్మ పరిరక్షణకు, చైతన్య శంఖారావానికి నరేంద్రుడే తన వారసుడన్నది రామకృష్ణుల విశ్వాసం. జనసామాన్యం దృష్టిలో నరేంద్రుడు అహంకారి. ఆయన బాహ్యవర్తన అలా ఉండేది. అది నరేంద్రుడిలోని అద్భుతమైన ఆత్మస్త్థెర్యానికి, మనోశక్తికి నిదర్శనమని రామకృష్ణులు అనేవారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే చైతన్య స్వరూపమే అది. తన యోగ దృష్టితో నరేంద్రుడి అంతరంగాన్ని చదవగలిగిన గురువాయన.

నరేంద్రుడికి పాశ్చాత్యశాస్త్రాల పరిజ్ఞానం ఎక్కువ. మిల్‌ సిద్ధాంతాన్ని ఔపోసన పట్టాడు. డికార్ట్‌ అహంవాదాన్ని, హ్యూం, బెన్‌థామ్‌ల నిరీశ్వరవాదాన్ని, స్పినోజ్‌ సర్వేశ్వరవాదాన్ని, డార్విన్‌ పరిణామవాదాన్ని, కోమ్టే రూఢివాదాన్ని, స్పెన్సర్‌ అజ్ఞేయవాదాన్ని, జర్మన్‌ దార్శనికుల తాత్విక ధోరణులను అధ్యయనం చేశాడు. ఈ వాదాల ప్రభావంతోనే కావచ్చు- విగ్రహారాధన పట్ల, ప్రతిమల పట్ల ఆయనకు చులకన భావం ఉండేది. ఒకానొక దశలో రామకృష్ణులు ఈ భావాన్ని పోగొట్టారు. నరేంద్రుడి దుర్భర కుటుంబ దారిద్య్ర నిర్మూలనకు కాళీమాతనే శరణు కోరమన్నారు. నరేంద్రుడు మందిరంలోకి అడుగిడగానే, జాజ్జ్వలమానంగా వెలుగొందే మాతను చూడగానే తాను అడగాల్సినదానికి బదులు- వైరాగ్యాన్ని, దివ్యజ్ఞాన భిక్షను అర్థిస్తాడు. రెండోసారి కూడా ఇదే అనుభవం. ఇది గురుదేవుల లీలగా తెలుసుకుంటాడు. అప్పటినుంచి విగ్రహారాధనను విశ్వసిస్తాడు నరేంద్రుడు.

నరేంద్రుడి(స్వామి వివేకానందుడి) సిద్ధాంతాలకు మూలమైన ప్రబోధవాక్యం- 'సర్వం నీవే'నన్న సత్యాన్ని శిష్యుడికి వివరించారాయన. పరిపూర్ణ విశ్వాసానికి ఆత్మశక్తిని ప్రతీకగా తెలుపుతారు. ముందడుగుకు వెన్నుదన్ను ఆత్మవిశ్వాసం, అదే భగవత్‌శక్తిగా గుర్తెరగాలంటారు. నాణేనికి రెండో పార్శ్వంగా- జీవులందరిలోనూ భగవంతుని చూసి, మానవీయ లక్షణాలతో స్పందించడమే ఆధ్యాత్మిక పురోగామిత్వానికి దోహదపడుతుంది.

- దానం శివప్రసాదరావు