ᐅ మహా ప్రజ్ఞ
దొరికిన ప్రతి పుస్తకం చదివాం. గ్రంథాలయాల్లో రోజులకొద్దీ గడిపాం. ఎన్నో చర్చల్లో పాల్గొన్నాం. సభలకు వెళ్లాం. సమావేశాలు నిర్వహించాం. విపరీతంగా జ్ఞానం పెంచుకున్నాం. ఉపనిషత్తుల జ్ఞానం కరతలామలకం. వేదజ్ఞానం ఔపోసన పట్టాం. ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా బుర్రలో నిండిపోయింది. పాండిత్యంతో గర్వ అహంకారాలు పెరిగిపోయాయి. ఓ విజ్ఞాన సర్వస్వంగా తయారైపోయాం. ఎన్నో బిరుదులు, ఎన్నో గౌరవాలు, మరెన్నో పురస్కారాలు...
అందరూ 'నడుస్తున్న గ్రంథాలయం' అని పిలుస్తున్నారు. 'నడుస్తున్న జ్ఞాననిధి' అని స్తుతిస్తున్నారు. దీనివల్ల అంతరంగంలో ఉండే అసలైన అజ్ఞానం నశిస్తుందా? ఘోరంగా ఆ అజ్ఞానం మన లోపల మరింత గోప్యంగా దాక్కుంటుంది. మరింత రహస్యంగా దాక్కుంటుంది. మన హృదయపు లోతుల్లో కనిపించని ప్రదేశంలోకి వెళ్లి దాక్కుంటుంది. పైకి మాత్రం మనం మహాజ్ఞానులుగా కనిపిస్తూ ఉంటాం.
లోతుల్లో మాత్రం మనం అజ్ఞానులుగానే ఉంటాం. ఎప్పుడూ ఇదే జరుగుతూ ఉంటుంది. అన్ని విశ్వవిద్యాలయాలు ఈ సహాయాన్నే చేస్తూ ఉంటాయి. మన అజ్ఞానం ఎన్నటికీ నశించిపోదు. అది పనిచేస్తూనే ఉంటుంది.
పైకి మాత్రం మనం సర్వాలంకార భూషితులుగా కనిపిస్తాం. చక్కటి ఆహార్యంతో జ్ఞానపు పూత పూసుకొని కనిపిస్తూ ఉంటాం. కాని, మనలో అజ్ఞానం మహా ప్రగాఢంగా తిష్ఠ వేసుకుని ఉండిపోతుంది.
నిజమైన జ్ఞానం మన అంతరంలో ఉన్న అజ్ఞానం అంతరించి పోయినప్పుడే సంభవిస్తుంది.
ఇదివరకు మనకు ఉన్న జ్ఞానమంతా, సమాచారంగా, అరువు తెచ్చుకునే విషయంగానే ఉంది. అది మన సొంతం కానిది. అది అప్రమాణికంగానే ఉంటుంది తప్ప మనకు కలిగిన జ్ఞానంగా ఉండదు. సజీవంగా మనం అనుభవించి తెలుసుకున్న జ్ఞానంగా ఉండదు.
ఆధ్యాత్మిక భూమికల్లో వివిధ స్థాయుల్లో దివ్యమార్గాన్ని అనుసరించి, సాధన చేస్తేనే అంతరిస్తుంది అజ్ఞానం. అప్పుడే కలుగుతుంది అనుభవ జ్ఞానం. అదే అనుభూతి.
ఒకసారి, అరుణాచల రమణ మహర్షి సమక్షంలో ఒక సంగీత విద్వాంసురాలు అద్భుతమైన కచేరి చేసింది. శ్రోతలందరికీ వీనుల విందు అయింది. రమణ ఆశీస్సులు తీసుకోవడానికి ఆమె ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు ఇలా అంది.
'త్యాగయ్య, అన్నమయ్యల లాగే నేను కూడా ఇలా సంగీతం పాడి తరిద్దామనుకుంటున్నాను' అని. దానికి మహర్షి ఇలా సమాధానం ఇచ్చారు-
'వాళ్లు పాడి తరించలేదమ్మా, తరించి పాడారు' అని.
అంతరంగంలో అజ్ఞానం అంతరించినప్పుడే నిజమైన శుద్ధజ్ఞానం కలుగుతుంది. అప్పుడే మహాప్రజ్ఞకు దారి ఏర్పడుతుంది.
మహాప్రజ్ఞ వివేకవంతుణ్ని చేస్తుంది. వివేకవంతుడే నిజమైన జ్ఞాని. అతడి ముందు పండితులూ నిలబడలేరు. కేశవచంద్రసేన్ లాంటి గొప్ప పండితుడు రామకృష్ణ పరమహంస ముందు మోకరిల్లాడు.
పరమ భాగవతోత్తముడైన పోతన ముందు స్వచ్ఛందంగా తన ఓటమిని అంగీకరించాడు శ్రీనాథ పండితుడు.
సచ్చిదానంద సముద్రమై అలరారుతున్న దైవ హృదయం దగ్గరకు ఏ అరమరికలు లేకుండా తీసుకువెళ్లేదే నిజమైన జ్ఞానం. అది ప్రాతఃకాల చీకట్లు తొలగిపోయిన వెంటనే సంభవించే సూర్యోదయం లాంటిది.
తనకు తెలిసిన చిన్న చిన్న ఉదాహరణలతోనే గొప్ప జ్ఞానం అందించాడు క్రీస్తు. చిన్నచిన్న కథలతోనే బుద్ధుడు జీవన తత్వాన్ని తెలియజేశాడు. ప్రేమతో తన భక్తులను ఆకట్టుకున్నాడు శిరిడి సాయి.
హృదయంలో వెలిగే జ్ఞానజ్యోతి విశ్వమంతా చూపిస్తుంది. విశ్వమంతా కొనియాడే లౌకిక జ్ఞానం సూర్యుడి ముందు దివిటీ అయిపోతుంది. అందుకే ప్రహ్లాదుడు, తండ్రి అడిగినప్పుడు, మహాప్రజ్ఞ కలిగిన వాడై-
'చదువులనెల్ల చదివితి తండ్రీ!' అని తెలిపాడు. హరి అనుగ్రహం పొందినవాడికి సరస్వతి కటాక్షానికి కొదవేముంటుంది? ఆత్మ తెలిస్తే సర్వమూ తెలుస్తుంది. సర్వమూ తెలిసినా, ఆత్మ తెలియకపోతే అది అసంపూర్ణ జ్ఞానమే కదా!
- ఆనందసాయి స్వామి