ᐅ సమదృష్టి

 ᐅ సమదృష్టి

సమస్త జీవులు సుఖంగా బతకాలన్నది ఉపనిషత్‌ వాక్యం. భగవంతుడి దృష్టిలో జీవులందరూ సమానమే. ఆయన జీవులందరి పట్ల సమభావనతో వ్యవహరించి పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాన్ని ఈ చరాచర సృష్టికి అందజేశాడు. అంటే సమదృష్టి భగవంతునికెంతో ప్రీతికరమైనదని అర్థమవుతోంది.
పురాణ పురుషులందరూ కులమతాలతో సంబంధం లేకుండా, పేద, గొప్ప భేదం పాటించకుండా తోటివారితో చెలిమిచేసి వారికి సహాయపడుతూ ముల్లోకాలకు ఆదర్శంగా నిలిచారు.
ఆటవిక జాతికి చెందిన శబరి భక్తితో, ప్రేమతో ఇచ్చిన ఎంగిలిపండ్లను శ్రీరాముడు నిండుమనసుతో స్వీకరించాడు. పేదరికంలో మగ్గుతున్న స్నేహితుడు కుచేలుణ్ని ఆదరించి, అభిమానించి సకల సంపదలు ప్రసాదించి శ్రీకృష్ణుడు తన గొప్పతనాన్ని లోకానికి చాటాడు.
ఈ సృష్టిలో అంతటా ఈశ్వరుడు ఉన్నాడు. అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మ ఒక్కటే అని వేదాంతం ఘోషిస్తోంది.
సమదృష్టికి ప్రత్యక్ష నిదర్శనం ప్రకృతి.
ఎలాంటి తారతమ్య భావం చూపించకుండా ఫలసంపదతో ఉన్న పచ్చని వృక్షాలు అన్ని జీవులకు ఫలాలను అందిస్తున్నాయి. నదులు ప్రాణికోటికి జలధారలు సమకూర్చి దాహార్తి తీరుస్తున్నాయి.
ఆలోచనా పరిజ్ఞానం, మేధ కలిగిన మనిషి మాత్రం సమదృష్టితో వ్యవహరించక సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. స్వలాభం కోసం ప్రాంతాలను, మతాలను, కులాలను అపహాస్యం చేస్తూ అలజడి సృష్టిస్తున్నాడు. ఇది కాదు సంస్కృతి!
భారతీయ వేద వాఞ్మయం జీవులందరూ సర్వసమభావనతో మెలగాలని ఉపదేశిస్తోంది. మనిషిని మనిషిగా గౌరవించే సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి. అప్పుడే మనిషి విశ్వమానవుడుగా అందరి హృదయాల్లో నిలిచిపోతాడు.
మనలో కొంతమంది అంగవైకల్యం కలిగినవారిని హేళనచేస్తూ వాళ్ళ వైకల్యాన్ని వేలెత్తి చూపిస్తుంటారు.
ఈ రకమైన మనోవైకల్యం ఉన్నవాళ్ళు సంఘంలో మంచి మనుషులుగా ఎదగలేరు. వీళ్ళు సమదృష్టితో అందరినీ ఆదరించడం నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో అందరూ ఆ భగవంతుడి ప్రతిరూపాలే. అలాంటప్పుడు తోటి మనిషిని వేలెత్తి చూపించడమెందుకు?
బిథోవెన్‌ బధిరుడైనా మంచి సంగీత విద్వాంసుడు కాగలిగాడు. హెలెన్‌ కెల్లర్‌ చెవిటితనం, గుడ్డితనం తదనంతరం మూగతనం కూడా ఏర్పడినా జీవితాంతం బధిరులకు, అంధులకు సేవచేసి చరిత్ర సృష్టించింది. లూయీ బ్రెయిలీకి తన మూడో ఏటే అంధత్వం ఏర్పడింది. అయితేనేం- పదో పాఠశాలకు వెళ్ళి అంధులకొక లిపిని కనిపెట్టాడు. వీరందరూ ఆ భగవంతుని బిడ్డలే.
లోకకల్యాణంకోసం పాటుపడే ఎవరైనా ఏ ఒక్కరినీ వేలెత్తి చూపించి, హింసించరు. అందర్నీ ప్రేమిస్తారు. ప్రజల మనిషిగా ఎదిగి నవసమాజ నిర్మాణంలో పాలుపంచుకుంటారు.
ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది. ప్రేమ ప్రేమను జయిస్తుంది. సాటి మనిషిలో అందరూ భగవంతుణ్నే చూడాలి. సర్వభూతాల్లోనూ తనను చూసేవాడు తనకు అత్యంత ప్రీతిపాత్రుడని గీతాకారుడు చెప్పాడు.
ఏ మనిషి గొప్పతనమైనా అతడి సమదృష్టిలోను, స్వభావంలోను తెలుస్తుంది. అంతేతప్ప- అతడి సంపదలో కాదు. వివేకానందుడు సాటిమనిషిని నారాయణుడిగా భావించాలని సందేశమిచ్చాడు.
సేవే లక్ష్యంగా చేసుకుని సర్వసమభావనతో రామకృష్ణులవారు మఠాన్ని స్థాపించారు. మదర్‌థెరెసా కులమత విచక్షణ లేకుండా మమత, మానవత, సేవాధర్మాలను మేళవించి అందరికీ మాతృమూర్తిగా మారింది.

- విశ్వనాధ రమ