ᐅ చోదక శక్తి



 ᐅ చోదక శక్తి

తీవ్రమైన భావోత్ప్రేరకమే తపన. అది మనల్ని మున్ముందుకు నడిపే ఇంధనం. మనో వ్యాపారాలను గమ్యంవైపు సాగేలాచేసే హృదయజనిత శక్తి. మనిషి సహజంగా ప్రగతి కాముకుడు. ప్రగతిని మనసు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూనే ఉంటుంది.
బాహ్యాంతర్గత విధి విధానాలను వాడిగా, వడిగా క్రియారూపంలోకి తీసుకెళ్తుంది. నిప్పురవ్వలా ఉద్భవించి ప్రజ్వలనగా మారి సాధనా క్రియను ప్రకాశింపజేస్తుంది.

సాధకుడి సాధనకు పాశుపతాస్త్రం తపన. తపన ఉన్మాదం కాదు. తమో గుణానికి దారి తీయదు. అంతర్లీనంగా ఉంటూ ఆశయసిద్ధికి తోడ్పడుతుంది.

'తపన' అనగానే, అదేదో బరిలో దూసుకెళ్లిపోయేందుకు సిద్ధపాటుతో ఉండే వస్తువు లాంటిది కాదు. మోహంతో కూడిన శక్తీ కాదు.

పువ్వులకు వాయువు తోడైతే పరిసరాలు పరిమళ భరితమవుతాయి. తపన శక్తిపూరిత అంతర్వాయువు.

జడస్థితి పోగొట్టి చైతన్యస్థితి కలిగించే వాహకమది. భూగర్భ పొరల్లో నిక్షిప్తమై ఉండే విలువైన ఖనిజ సంపదను వెలికి తీసేందుకు ఉపకరించే పరికరంలా తపన అంతర్గత శక్తిని ప్రచోదనం గావిస్తుంది.

లౌకిక ప్రపంచంలో, అనుభూతికి మాత్రమే ద్యోతకమయ్యే భగవత్‌శక్తిని తెలుసుకునేందుకు ఏకైక సాధనం తపన.

ఆధ్యాత్మిక జగత్తులో తపనే- తపస్సు, ధ్యానం. మనం కుటుంబ సమాజ జీవనానికి, బంధాలకు కట్టుబడినవాళ్లం. ఏ సాధనైనా ఈ చట్రంలోనే అన్నట్టుగా భ్రమిస్తుంటాం. తపిస్తుంటాం.

యోగులు, సిద్ధులు, మహా పురుషులు ఈ తపనలో కట్టుబడరు. వారి తపనను ఆధ్యాత్మిక కోణం వైపు మరల్చుతారు. అందుకే వారికి సుఖదుఃఖాలు అంటవు. కోర్కెల వలయాల్లో చిక్కుకోరు. లౌకిక జగత్తులో ఉన్నా అలౌకిక ఆనందం పొందుతారు. సర్వ జీవుల్లోనూ భగవత్‌ రూపాన్నే దర్శిస్తారు! సమభావం, స్థితప్రజ్ఞత వారి సొత్తు. దూషణ భూషణలకు అతీతులుగా ఉంటారు.

అర్థవంతమైన, ఆరోగ్యవంతమైన, ఉన్నతమైన జీవితమే ఆధ్యాత్మికత. నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుడు సాక్షాత్తు సరస్వతీ స్వరూపం. తండ్రి దగ్గరే విద్యను అభ్యసించిన శుకుడు ఎంతకీ సంతుష్టుడు కాలేదు. జ్ఞానతృష్ణతో తపించిపోయాడు. లోకసంచారిగా మారాడు. మహాజ్ఞానులను ఆశ్రయించి యోగీంద్రుడయ్యాడు. జితేంద్రియుడయ్యాడు. శుకబ్రహ్మగా గుర్తింపు పొందాడు.

గధాదరుడి ఆధ్యాత్మిక తపన పరమహంసగా చేసింది. ఏ తపనా వృథా పోదు. అది విద్యార్థిని విద్యావంతుడిగా, ఆచార్యుని జ్ఞానసిద్ధుడిగా, కళాకారుణ్ని కళాస్రష్టగా, వాణిజ్యవేత్తను కుబేరుడిగా, శ్రమజీవిని ఐశ్వర్యవంతుడిగా, ఆధ్యాత్మికవేత్తను అవతారమూర్తిగా చేస్తుంది.

అల్పులు మాత్రమే ఈ అంతర్వాయువును క్షణికానందాలకు ఉపయోగించుకుంటారు. విజ్ఞులు దీన్నొక శక్తిసాధనంగా పదిలంగా చూసుకుంటారు.

ఆధునిక శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు సృష్టికి ప్రతిసృష్టి చేయగలుగుతున్నారు. సృష్టి మూలాలను శోధిస్తున్నారు. గుండెకు బదులుగా గుండెను అమర్చి వూపిరులూదగలుగుతున్నారు. మరమనుషుల్లో సైతం ఆత్మీయ స్పందనలను కలిగిస్తున్నారు. మానవ జీవితం మొత్తం సాధన-శోధనలతో ముడివడి ఉంది. మృష్టాన్నం అందంగా అమర్చి పెట్టుకున్నంత మాత్రాన సరిపోదుకదా! భుజిస్తేనే ఆకలి తీరేది, తృప్తి పొందేది. సాధన-శోధనలను ఫలవంతం చేసేది తపనే. వేగంగా పరుగెత్తే గుర్రాలకు కళ్లేలు ఉన్నాయి. తపన ఉద్ధృత ప్రవాహమయ్యే వేళ- విస్తృతంగా విహరించే తత్వంగల మనసుకు, నిగ్రహశక్తిని కూడా కల్పించాడు భగవంతుడు.

అతిని మితం గావించుకునే వివేకం మనిషికి అవసరం. లక్ష్యాలు, ఆశయాలు ఈ చోదకశక్తితోనే సాకారమవుతాయని గుర్తెరగాలి. ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవద్రూపాన్ని దర్శించాలంటే, భగవత్‌తత్వాన్ని గ్రహించాలి. ఆ తత్వాన్ని తెలుసుకునేందుకు ఉపకరిస్తుందీ చోదకశక్తి.

- దానం శివప్రసాదరావు