ᐅ ఆహ్వానిద్దాం
ᐅ ఆహ్వానిద్దాం...
మన ఇంట్లో ఏదైనా శుభకార్యమైతే, ముందుగా మన బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను ఎంతో ప్రేమతో, ఆదరణతో ఆహ్వానిస్తాం. వారి రాకకు సంతోషించి, చక్కటి ఆతిథ్యమిచ్చి వీడ్కోలు పలికి మంచివాళ్లమనిపించుకుంటాం. ఎంతెంతో ఖర్చుపెట్టి మన హోదాలు, స్థితిగతులు ఆడంబరంతో, అట్టహాసంగా ప్రకటించుకుంటాం.
ఇదికాక, మన జీవన పర్యంతం ఆహ్వానించదగినవెన్నో ఉంటాయి. ఆహ్వానించి మన మనసులో, మాటలో, ఆచరణలో పదిలపరచుకోదగినవి ఎన్నో ఉంటాయి. వాటితో మనం మమేకమైపోవాలి.
భగవంతుడు మనకు మనసు అనే మహావరాన్ని ప్రసాదించాడు. ఈ మనసులోకి మంచి ఆలోచనలను, మంచి సంస్కారాలను ఆహ్వానించాలి. అప్పుడు మనసు పవిత్రంగా ఉంటుంది. మంచి మనసు ఎదుటివారి ప్రేమను, అభిమానాన్ని ఆహ్వానిస్తుంది. సదభ్యాసాలను, సరస వచనాలను, సత్సాంగత్యాలను ఆహ్వానిస్తుంది. మంచివాక్కునిస్తుంది. ఆ వాక్కు వేదజ్ఞుల్ని, సాధువుల్ని, ఉపదేశికుల్ని సమాదరించి, సంస్కారవంతంగా పలకరిస్తుంది. వాక్కు ద్వారా ఆహ్వానమందుకున్న పౌరాణిక బ్రహ్మలు, బుధులు, సజ్జనులు మనిషిలో మహోన్నతమైన ఆలోచనలకు పునాదులు వేస్తారు. ఎందుకంటే మహాత్ములు, మహర్షులు మానవజాతి సముద్ధరణకు ఎన్నెన్నో త్యాగాలు చేశారు. ఎన్నో హితోక్తులు అందజేశారు. వాటిని మనం మన జీవితాల్లోకి ఆహ్వానించి ఉజ్జ్వల భవితకై సద్వినియోగపరచుకోవలసి ఉంది.
నదులు, వృక్షాలు, పశువులు తమ సుఖంకోసం ఏమీ చేయటంలేదు. పరహితం కోసమే ఉన్నాయి అవన్నీ. అటువంటి పరహిత వ్రతం మనం అలవరచుకోవాలి. అష్టాదశ పురాణాలు తమ పాత్రల ద్వారా మనకెన్నో మంచి మాటలు చెబుతున్నాయి. రామాయణ, భారత, భాగవతాలు, భగవద్గీత అందజేస్తున్న సుభాషితాలను మన జీవితానికి అన్వయం చేసుకోవలసి ఉంది. ధర్మార్థ కామమోక్షాలు, సాత్వికగుణాలు, సత్యాహింసలు, ప్రేమ, త్యాగం, పరోపకారం మొదలైన సులక్షణాలను మన కార్యక్షేత్రంలోకి ఆహ్వానించవలసి ఉంది. ఆర్ష సంస్కృతి, సత్సంప్రదాయాలు, మన పండుగలు, ఆచార వ్యవహారాలు ఆకళింపు చేసుకుని భావితరాలవారికి అవగాహన కలిగించాలి. తల్లిదండ్రులు, ఆచార్యులు, మిత్రులు, పెద్దలపట్ల వ్యవహరించవలసిన తీరు నేర్చుకుని మన నడతను మెరుగుపరచుకోవాలి.
రామకృష్ణ పరమహంస, వివేకానంద, గౌతమబుద్ధుడు, బాపూజీ, అనిబిసెంట్, మదర్ థెరెసా, అల్లూరి, భగత్‌సింగ్, ఝాన్సీ వంటి మహనీయుల గుణ సంపదను మననం చేసుకోవాలి.
వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, యాగవిశేషాలు, మన మాతృభాషావైశిష్ట్యాలు, ధ్యాన, యోగ, సంధ్యావందనాది పవిత్ర కార్యాల ఆవశ్యకతలు, భరతభూమిపైన అవతరించిన భక్త శిఖామణులు, సాధ్వీమతల్లులు, వాగ్గేయకారులు, మహానాయకులు, మహాపండితుల జీవితచరిత్రల్లో విశేషాంశాల మన హృదయవేదికపైకి ఆహ్వానించుకోవాలి.
'పర్యావరణమే పరమాత్మ' అన్నారు. నేటి స్థల, జల, వాయు కాలుష్యాల మధ్య పర్యావరణాన్ని సంరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కౌటిల్యాది అర్థ శాస్త్రవేత్తలు, రాజనీతిజ్ఞుల మేధస్సును మన కార్యక్షేత్రాల్లోకి ఆహ్వానించుకోవాలి.
వివిధ లలితకళల మెలకువలను అవగాహన చేసుకోవలసి ఉంది. దేశవిదేశాల్లోని విభిన్న దర్శనీయ స్థలాలను సందర్శించి, జ్ఞాన సంపదను పెంపొందించుకోవలసి ఉంది.
మానవీయ విలువలకు పట్టంగట్టే నిస్వార్థ మానవాళితో సర్వదా మైత్రినే కోరాలి. కుటుంబంలో సత్సంబంధాలను, అనుబంధ బాంధవ్యాలను ఆహ్వానించాలి. నీతి, నిజాయతీ, నిరాడంబరత, నిరహంకారతత్వం, పారమార్థికత, సమదర్శిత్వం, వినయవిధేయతలు, మన జీవన విధానంతో రంగరించుకోవాలి. జీవకోటే కాదు, ప్రకృతిలోని ప్రత్యణువునుంచీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనకు మేలే జరుగుతోంది. దాన్ని మనం స్వీకరించేందుకు ఎల్లవేళలా సంసిద్ధులమై ఉండాలి. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. జాగరూకులమై తెరిచేందుకు సిద్ధపడాలి. సమయజ్ఞత లేకుంటే జీవితాంతం పశ్చాత్తప్తులమైపోవలసి వస్తుంది.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి