ᐅ అమ్మకు ప్రత్యామ్నాయం లేదు



 ᐅ అమ్మకు ప్రత్యామ్నాయం లేదు

భారతీయ సంస్కృతిని మనం భూతద్దంలో చూడటం లేదు. చిన్న అద్దంలో చూస్తున్నాం. ఔను. 'భారతీయ సంస్కృతి' అనే కొండను మనం చిన్న చేతిఅద్దంలో చూస్తున్నాం. అంటే, చాలా తక్కువ చేసి చూస్తున్నాం. ఆడంబరంగా ప్రదర్శించకుండా, మనకు మనం తగ్గించుకుని వినమ్రంగా చూస్తున్నాం. మేరు పర్వతంలాంటి మన సంస్కృతిని మన సంస్కారంతో, ఆడంబరంగా ప్రదర్శించకుండా వినమ్రతను ప్రదర్శిస్తున్నామా, ఆ రకంగా దాని గొప్పతనాన్ని మరింత పెంచి చూపిస్తున్నామా, లేక దాని ఔన్నత్యాన్ని గ్రహించకుండా దానిపట్ల తేలిక భావాన్ని కలిగిఉన్నామా?
మనదైన గొప్పతనాన్ని మనం గుర్తించటం లేదంటే, మీదుమిక్కిలి లోకువ భావాన్ని కలిగి ఉన్నామంటే దానికి ముఖ్యమైన కారణాలు మూడు. ఒకటి, దాని గొప్పతనం మన దృష్టిలోకి రాకపోవటం, అవగాహనలో లేకపోవటం. రెండోది, దాన్ని దూరం చేసుకుంటే ఏం కోల్పోతామో ఆ పరిణామాల పట్ల అంచనా లేకపోవటం. మూడోది, మనం ఆకర్షితమవుతున్న, ప్రభావితమవుతున్న మనకు అతకని విదేశీ సంస్కృతివల్ల ఎటువంటి దుష్పరిణామాలు కలుగుతాయన్నది గ్రహించలేకపోవటం.

సంస్కృతి అనేది ఎవరో ఒక వ్యక్తి ఏర్పాటు చేసింది కాదు. అదొక చట్టం కాదు. దేశ కాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాలక్రమేణా జాతికి అలవడిన అనుకూల జీవనశైలి. ఉదాహరణకు ఐరోపా దేశాల్లో చలి ఎక్కువ. మంచు కురుస్తూ ఉంటుంది. ఎప్పుడూ తలుపులు బంధించుకుని ఉంటారు. నిప్పుగూళ్లు రాజేసుకుంటారు. మనది సమశీతోష్ణ దేశం. సహజమైన గాలి వెలుతురు ప్రసరించే భాగ్యదేశం. పగలు మనం ఆ దైవదత్త అవకాశాన్ని ఆస్వాదించగలం. ఆనందించగలం. వాళ్లలా తలుపులు మూసుకుని మగ్గవలసిన అగత్యం లేదు. వాళ్లు మద్య మాంసాలు తీసుకుంటారు. ఉష్ణాన్ని కలిగించే పదార్థాలవి. వాళ్లకు నిషిద్ధం కాదు. అవసరం కూడా. మనకా అవసరం లేదు. ఇంకా వస్త్రధారణ, వివాహ వ్యవస్థ... ఇలా ఎన్నో...

మనది ఆధ్యాత్మిక దేశం. మన భావజాలానికి, ఆత్మోన్నతికి తగిన జీవన విధానాన్ని అనుసరించాలి. ఆధునికత పేరిట అనాగరికతను అలవరచుకోరాదు. ఆధునికత బాహ్య ఆడంబరాలతో వ్యక్తమయ్యేది కాదు. భావ ఔన్నత్యంతో ప్రస్ఫుటమయ్యేది.

భారతదేశం ఒక అద్భుత అద్వితీయ దేశం. దాని వైశిష్ట్యతకు సాటిలేదు. ఈ దేశ సహజ సంజాతులమైన మనం అమాయకత్వంతో మన వారసత్వాన్ని చేజేతులా పోగొట్టుకోరాదు. పరమహంస శ్రీయోగానంద తరచూ అనేవారు- 'నేను శయ్య మీద మరణించను. బూట్లు వేసుకుని ఉండగా, భారతదేశాన్ని గురించి మాట్లాడుతుండగా మరణిస్తాను' అని. (ఇక్కడ బూట్లు వేసుకుని అంటే... శీతల దేశాల్లో శయ్య మీద ఉన్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో పాదరక్షలు ధరించే ఉంటారు. అంటే నేను శయ్యమీద ఉన్నప్పుడు మరణించను అని నొక్కి చెప్పటం అన్నమాట). నిజంగానే ఆయన తమ చివరి ప్రసంగం చేస్తూ 'ఎక్కడైతే గంగ, అడవులు, హిమాలయ గుహలు, మానవులు భగవంతుణ్ని గురించి కలగంటారో- నేను పవిత్రుణ్నయ్యాను... నా శరీరం ఆ నేలను తాకింది' అన్నారు. ఇక్కడ మనుషులతో పాటు గంగ, అడవులు, హిమాలయాలు కూడా భగవంతుని ధ్యానిస్తాయని భారతదేశ పవిత్రత పట్ల, ఔన్నత్యం పట్ల వారికెంత గౌరవం, విశ్వాసం, పూజ్యభావం ఉండేవో దీన్ని బట్టి అర్థమవుతుంది.

ఇదంతా మనది. మనదే. మనలో పెంచి పోషించుకోవలసినది. అందరితో పంచుకోవలసినది. చెట్టు ఎక్కాలన్నా, పుట్ట తవ్వాలన్నా ముందు వాటికి పూజ చేయాలనే ఆచారం మనది. మనల్ని చేయి చాచి దీనంగా యాచించే యాచకుడికి ధర్మం చేసి మనమే తిరిగి నమస్కరించే సంస్కృతి మనది. అడుగడుగునా, అణువణువునా పూజ్యత, కృతజ్ఞత, నియతి, నిబద్ధత, సేవ, త్యాగం, అపురూపమైన వివాహ, కుటుంబ వ్యవస్థలు, అన్నింటికంటే అపురూపమైన ఆధ్యాత్మిక తత్వం- మనదేశ ప్రత్యేకతలు. అదే శ్వాసగా, భగవంతుడి సేవగా జీవితం... ఇక్కడే సాధ్యం. జీవితం పొడుగునా పరమపదం వైపే ధ్యేయం. ఎంత సనాతన సంస్కృతి! ఎంత ఆధునిక సంస్కృతి! ఎంత నాగరిక సంస్కృతి!

మంచి ఎక్కడున్నా అది అనుసరించవలసిందే. కానీ గుడ్డిగా మనది కానిదల్లా మనదిగా చేసుకోరాదు. అందంగా లేదని అమ్మ అమ్మకాకుండా పోదు. అమ్మలోని అంతర్గత సౌందర్యం మనం అవగాహన చేసుకోలేదంతే. అమ్మను నిర్లక్ష్యం చేయకూడదు. అమ్మనే పోగొట్టుకోకూడదు. లోకంలో అమ్మకు ప్రత్యామ్నాయమే లేదు. అమృతం కూడా అమ్మకు సరితూగలేదు!

- చక్కిలం విజయలక్ష్మి