ᐅ బ్రహ్మానందం... నిశ్చలానందం



 ᐅ బ్రహ్మానందం... నిశ్చలానందం!

ప్రతీవారు జీవితంలో కోరుకునేది ఏమిటి? ఆనందంగా జీవించటం. చేసే ప్రతి పని ఫలితమూ ఆనందాన్ని ఇవ్వాలని ఆశిస్తారు. సహజమే. చేసే కర్మను బట్టే ఫలితం ఉంటుంది. కొన్ని తాత్కాలికమైన, స్వల్పకాలిక ఆనందాలను ఇస్తాయి. ఒక్కటి మాత్రమే శాశ్వతానందాన్ని ఇస్తుంది.
మూడురకాలైన ఆనందాలను 'వేదాంత పంచదశి' సూచించింది. అవి విషయానందం, విద్యానందం, బ్రహ్మానందం. ఈ మూడింటిలో బ్రహ్మానందం శాశ్వతమైందిగా చెబుతారు.
సిరిసంపదలు, భోగాలు, దాంపత్యం, బంధాలు, మమకారాలు సుఖసంతోషాలు- ఇవన్నీ విషయానందం ఇచ్చే అంశాలు. జీవనదశల్లో క్రమేపీ కనుమరుగవుతుంటాయి. ఒడుదొడుకుల జీవనగమనంలో ఆటుపోట్లకు గురవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో విషయవాంఛలు సైతం వెగటుగా తోస్తాయి.
విద్యానందం, జ్ఞానాభిలాషవల్ల కలిగేది. గౌరవాన్ని పెంపొందిస్తుంది. రాజపూజితులుగా చేస్తుంది. అహంకారం, పరిస్థితుల స్థితిగతులు ఈ ఆనందాన్ని తుంచేయవచ్చు.
మూడోదైన బ్రహ్మానందం, ఆత్మకు సంబంధించిన జ్ఞానం. ఈ సకల సృష్టిలో ఏది సత్యమై, నిత్యమై వెలుగొందుతూ, చైతన్యవంతంగా ప్రకాశిస్తుంటుందో, ఏది ఈ చరాచర జగత్తుకు మూలమో, జీవుల పుట్టుక, మరణాలకు కారణహేతువో- ఆ బ్రహ్మాండమైన వెలుగును భగవత్‌ స్వరూపంగా గ్రహించగలిగేదే బ్రహ్మజ్ఞానం. ఆ జ్ఞానం ఇచ్చేదే అఖండమైన బ్రహ్మానందం. అది శాశ్వతానందం. తుది అంటూ లేదు.
స్థావర జంగమాదులన్నీ పుట్టి, లయించే బ్రహ్మాండ భాండంగా విరాజిల్లే విరాట్‌ విశ్వరూపం. సృష్టిస్థితిలయలు ఆ భాండంలో సహజంగా జరిగిపోయేవే.
ఓ రత్నాల వ్యాపారి, పండితుడు, సన్యాసి ఓడలో కలిసి ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి సముద్రంలో భీకరమైన తుపాను చుట్టుముట్టింది. మహాకల్లోలం... కల్పాంతం జరగబోతోందా అన్నట్టుగా వాతావరణం తయారైంది. అలలు ఓడను ముంచేసేట్టుగా ఉన్నాయి.
సంచిలోని రత్నాలను గట్టిగా గుండెలకేసి హత్తుకున్నాడు రత్నాల వ్యాపారి. 'వీటి విలువ అపారం... అయ్యో! పోగొట్టుకోవాల్సి వచ్చిందే దేవుడా!' అని వెర్రికేకలు పెట్టాడు.
పండితుడు తన తాళపత్ర గ్రంథాలవైపు జాలిగా చూశాడు. ఎన్ని సన్మానాలందుకున్నాను! ఎంత జ్ఞానం నిక్షిప్తమైఉంది! అర్ధాంతరంగా పోగొట్టుకోవాల్సివచ్చిందే! బాధ, భయం ఆవహించాయి పండితుణ్ని.
చిద్విలాసంగా నవ్వుతూ సముద్రంలో కల్లోలాన్ని చూస్తున్నాడు సన్యాసి.
ఇంకాసేపట్లో ఈ ఓడ మునగబోతోంది. 'భయంలేదా! మనిషివి కాదా నువ్వు! ఏమిటా హాసం?' ప్రశ్నించారు ఆ సన్యాసిని.
'ఎందుకు భయం? భయపడితే వచ్చే ప్రళయం ఆగుతుందా?' అంటూ తన కమండలంలోని నీటిని సముద్రంలో పోశాడు.
'చూడండి! ఈ అనంతజలరాశి నుంచి వచ్చిన కమండలంలోని నీటిబిందువులు దానిలోనికే చేరాయి. ఎందుకు విచారం?!' అంతటి ప్రళయ సన్నివేశంలోనూ ఆ సన్యాసి మాటల అంతరార్థం బోధపడింది వారికి.
బ్రహ్మజ్ఞానికి బ్రహ్మానందమే ఏ స్థితి అయినా. విషాదంలోనూ నవ్వగలడు. వినోదంలోనూ వైరాగ్యచింతనను వీడడు. అన్నీ గ్రహించుకోగలిగిన స్థితి. అది శాశ్వతానందమయ స్థితి అది. విషయానందంకన్నా విద్యానందం మిన్న. విద్యానందం కన్నా బ్రహ్మానందం గొప్పది.
యోగులు, సిద్ధులు, మహాజ్ఞానులు బ్రహ్మానందాన్ని అనుభవించినవారే. సగటు మనుషులమైన మనకు బ్రహ్మానందస్థితి ఎలా కలుగుతుంది?
లౌకిక జగత్తులో బంధాలు తెంచుకునేవి కావుగదా! ఆశ్రమ ధర్మాలు పాటించడం అనివార్యం
ప్రజాకవి వేమన 'అనగననగ రాగమతిశయిల్లుచునుండు- తినగ తినగ వేము తియ్యనుండు' అన్నాడు.
అభ్యాస వైరాగ్యాలు అలవరచుకుంటూ భగవానుడి స్మరణ సదా కొనసాగించుకుంటూ పయనం జరగాలి. కలియుగంలో స్మరణ మాత్రం చేతనే ముక్తి లభిస్తుందంటారు! 'ఏ స్థితిలో ఉన్నా భగవన్నామస్మరణ సాగించడం, ప్రతికర్మ ఫలితమూ ఈశ్వర ప్రసాదమే' అని భావిస్తూ సాగిపోతూ ఉంటే- బ్రహ్మానందం తరింపజేస్తుందని విశ్వసించాలి.

- దానం శివప్రసాదరావు