ᐅ యత్ర నార్యస్తు పూజ్యంతే



 ᐅ యత్ర నార్యస్తు పూజ్యంతే...

మానవ జీవితం అనే విహంగానికి రెండు రెక్కలు. ఒక రెక్క స్త్రీ, రెండో రెక్క పురుషుడు. ఒక్క రెక్కతో పక్షి ఎగరలేదు. మానవ జీవితం కూడా అంతే! స్త్రీ సహాయం లేనిదే మానవుడు ముందడుగు వేయలేడు. ఆత్మ ఒకే తేజస్సుతో సర్వత్రా వ్యాపించి ఉన్నదని మన వేదాంతం ఘోషిస్తోంది. స్త్రీపురుష భేదాన్ని, విచక్షణను సనాతన ధర్మం ఏ కోశానా అంగీకరించదు. ఈ ధర్మపన్నాన్ని ఇటీవల సరిగా అనుసరించకపోవడం వల్ల సమాజంలో పెక్కు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సత్యాన్ని లోకానికి చాటడానికై రామకృష్ణ పరమహంస ఒక స్త్రీని తన గురువుగా స్వీకరించారు. స్త్రీలను జగన్మాతలుగా అభివర్ణించారు. భార్యను దేవతగా ఆరాధించారు.
ప్రాచీన కాలంలో స్త్రీలను గౌరవించలేదనీ, ఆధునిక యుగంలో అమితంగా గౌరవిస్తున్నామనీ కొందరు భ్రాంతి పడుతుంటారు. వేదకాలంలో మైత్రేయి, గార్గి మొదలైన విదుషీమణులు బ్రహ్మపదార్థాన్ని గురించి లోతైన చర్చలు గావించారు. మహర్షులతో దీటుగా నిలిచారు. గార్గి యాజ్ఞవల్క్య మహర్షితో వాదించగలిగింది. మధ్యయుగాల్లో మనల్ని ఆవరించిన అంధకారం స్త్రీ గౌరవాన్ని అధఃపాతాళానికి నెట్టివేసింది. అదే ఇప్పటికీ కొన్ని రంగాల్లో కొనసాగడం విచారకరం. మన అసమానతలకు మనమే కారకులం. నారీలోకాన్ని గౌరవిస్తేనే దేవతలు హర్షిస్తారనే ఆర్యోక్తిని విస్మరించాం. శక్తికి సజీవ స్వరూపాలైన స్త్రీలను సగౌరవంగా చూడని కారణంగానే భారతజాతి హీనస్థితికి దిగజారిందని వివేకానందులు ఎన్నడో నిర్ధారించారు.

బిడ్డలు తల్లిని దేవతలాగా గౌరవిస్తారు. లోకులు ఇల్లాలిలో తల్లిని దర్శించి గౌరవిస్తారు. మరి భర్త?

స్వామి రామతీర్థకు చిన్నతనంలోనే వివాహం జరిగింది. లాహోర్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. కొంతకాలం తరవాత సన్యసించాలని ఆయన హిమాలయాలకు బయలుదేరారు. భార్య అన్నది- 'నన్ను గుర్తుపెట్టుకుంటారా?' అని. రామతీర్థులు ఇలా జవాబిచ్చారు- ''నేను నిన్ను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోను. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ముక్కు, చెవులు, కళ్లు నాకున్నాయి. వీటిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలా? నాలో భాగాలైన అవయవాలు అవి. నీవూ అంతే! నీవు నాలో భాగానివి!' ఇదీ భార్యకు భర్త ఇచ్చే స్థానం. ఇదీ మన సంప్రదాయం.

వాల్మీకి మహర్షి సీత పాత్రను అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్దాడు. ఒక సంపూర్ణ పవిత్ర భారత స్త్రీమూర్తిని ప్రపంచం సీతమ్మలో చూడగలుగుతుంది. మంచికి, స్వచ్ఛతకు, పవిత్రతకు మారుపేరుగా ఆమె కనబడుతుంది. ఆమె సహనాన్ని, కష్టమయ గాథను స్మరించినంత మాత్రాన కన్నులు చెమ్మగిల్లుతాయి. సీత ఔన్నత్యం ముందు పురుషుడి పాత్ర నిలవలేదు. స్త్రీజాతి పట్ల గౌరవాన్ని పెంచే విధంగా సీత, సావిత్రి, ద్రౌపది, దమయంతి, చంద్రమతి వంటివారు జీవించారు. భర్తల ఔన్నత్యానికి ఈ సాధ్వీమణులు దోహదం చేశారు. వారిని ఆదర్శంగా భావించే స్త్రీలు నేటికీ సమాజంలో ఉన్నారు. శ్రీరాముడు సత్య ధర్మాలకు నిలయుడు, ఆదర్శ సుతుడు, ఆదర్శ పతి- అయినప్పటికీ, ఈనాటికీ ఆయనలో లోపాల్ని ఎంచడానికి కొందరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సీతమ్మను అగ్నిపరీక్షకు గురిచేసినందుకు శ్రీరామచంద్రుణ్ని తప్పు పడుతున్నారు. ఇదీ ఒక ఉత్తమ స్త్రీకి మన సమాజం ఇచ్చే గౌరవం!

ఆధునిక యుగంలో స్త్రీకి అధిక గౌరవం ఇచ్చిన దేశాలే గొప్ప ఉన్నతిని సాధించాయి. స్త్రీని హీనంగా చూసే జాతులు దుష్ఫలితాలు అనుభవిస్తున్నాయి. స్త్రీలను దైన్య స్థితిలో ఉంచే కుటుంబం ముందడుగు వేయలేదు. స్త్రీల పట్ల కేవలం దయ కాదు చూపవలసింది! వారిని శక్తి స్వరూపిణులుగా భావించి, గౌరవించాలి. ఈ విషయాన్ని వివేకానందస్వామి తమ ప్రసంగాల్లో ఇలా పేర్కొన్నారు-

భగవంతుడు సర్వవ్యాపకుడు. మాతృమూర్తి అయిన స్త్రీలో శక్తి స్థాపకతను దర్శించి ఆరాధించాలి. అలా ఆరాధించగలవాడే నిజమైన మానవుడు. స్త్రీలను గౌరవించే కుటుంబాల్లోనే సుఖశాంతులుంటాయి. వారికే భగవంతుడి ఆశీస్సులు దక్కుతాయి. పాశ్చాత్య దేశాల్లో పురుషులు స్త్రీలను ఉచిత రీతిన గౌరవిస్తారు. అందువల్లనే వారు సంపన్న సౌభాగ్యులై, విజ్ఞానవంతులై, పుష్టితో స్వేచ్ఛాయుతులై వర్ధిల్లుతున్నారు. మన దేశం ప్రపంచ దేశాల్లో బలహీనంగా, వెనకబడి ఉండటానికి కారణం 'మన శక్తి'ని నిరాదరించి అగౌరవపరచడమే!

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు