ᐅ గమ్యం
ᐅ గమ్యం
ఉన్నతమైన గమ్యం మనిషిని మహోన్నతుణ్ని చేస్తుంది. శాశ్వతమైన కీర్తిని అందిస్తుంది. ఆ గమ్యం చేరుకోవడానికి మనిషి రుషితుల్యుడు కావాలి. దీనికి సాధన ఎంతైనా అవసరం. అలలు తీరాన్ని చేరుకోవాలని ఉబలాటపడినట్లుగా ఆశించిన గమ్యాన్ని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. మనసు శక్తిమంతమైనప్పుడు మాత్రమే మనిషి కోరుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. గమ్యాన్ని చేరాలనే దృఢనిర్ణయమే మనిషిని ముందుకు నడిపిస్తుంది.
భర్తృహరి చెప్పినట్లు ధీరులైనవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తలపెట్టిన పనిని పూర్తి చేయకమానరు. ఆకాశగంగను దివి నుంచి భువికి తీసుకువచ్చిన భగీరథ ప్రయత్నం అటువంటిదే కదా! ప్రాచీన వాఞ్మయంలో కూడా ఉన్నతమైన గమ్యంతో కీర్తిశిఖరాలను చేరిన పురాణ పురుషులెందరో మనకు కనిపిస్తారు.
తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరితే తానూ అన్నవెంట వెళ్ళడానికి సిద్ధమయ్యాడు లక్ష్మణుడు. అటువంటి సమయంలో ఏ తల్లి అయినా మానసిక క్షోభకు గురి అవుతుంది. సుమిత్ర కొడుకును ఆశీర్వదించి 'నాయనా! నీవు వనవాసం కోసమే పుట్టి ఉంటావు. విచారించకు, నీకు తండ్రి తరవాత తండ్రి వంటివాడు శ్రీరాముడు. ఓ తల్లిలా సీత నిన్ను చూసుకుంటుంది. నీవు కూడా నన్ను సీతలో చూసుకోవాలి. సీతారాముల రక్షణను జాగ్రత్త! సుఖంగావెళ్ళిరా నాయనా!' అంటూ కుమారుణ్ని అడవులకు సాగనంపుతుంది. అందుకే ముల్లోకాలలోను లక్ష్మణుడిని మించిన సోదరుడు లేడని రామాయణం చెబుతోంది.
క్రమం తప్పని గమనానికి, గమ్యానికి ప్రతీక అయిన సూర్యుడి సంకల్పబలం ఎంతో గొప్పది. సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు సుమనోజ్ఞ సృష్టి విన్యాసానికి అద్దంపడుతూ సమస్త ప్రాణికోటికి స్ఫూర్తి కలిగిస్తాయి. ప్రపంచాన్ని జాగృతపరచి కర్మాచరణకు ప్రోత్సహిస్తాయి. మనం చూసే ప్రకృతి నిత్యం చైతన్యవంతమై నియమబద్ధంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటుంది. తెలతెలవారుతుంటే పక్షులు మేల్కొని తమ పని ప్రారంభించి తిరిగి గమ్యం చేరుకుంటాయి. ఆహారం కోసం ఎంతదూరమైనా ప్రయాణిస్తాయి. చీమలు, పిచ్చుకలు, సాలెపురుగులు... నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. విజయ తీరాలు చేరాలనే కాంక్ష ప్రకృతిలో ప్రతి ప్రాణిలో కనిపిస్తుంది.
మనిషి మాత్రం సహజత్వాన్ని యథాతథంగా స్వీకరించలేక లక్ష్యసాధనలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటాడు. తెగిన గాలిపటంలా ఎక్కడెక్కడో తిరుగుతాడు. దీనికి కారణం సరైన ఆలోచన లేకపోవడమే. ప్రయత్నం, ధైర్యం, సాహసం, బుద్ధిబలం, కార్యదీక్ష ఉన్నప్పుడు మనిషి ఎలాంటి కార్యాన్ని అయినా సాధించగలుగుతాడు.
తాత్వికచింతనలో నిమగ్నమయ్యే సాధకుడు గమ్యం చేరేవరకు ఎదురయ్యే కష్టసుఖాలన్నింటినీ సమానధర్మంతో స్వీకరిస్తాడు. కటిక నేలపైన సేదతీరి ఎలాంటి ఆహారాన్నయినా భగవంతుడి ప్రసాదంగా తీసుకుంటాడు. ఇలా ఆత్మజ్ఞానం కోసం అన్వేషించే సాధకుడు ఎన్నో అనుభవాలు ఎదుర్కొని చివరికి ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. నచికేతుడు దృఢసంకల్పంతో యముడి ద్వారా ఆత్మస్వరూపాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందిన తరవాత బ్రహ్మజ్ఞానిగా మారాడు ఆ బాలుడి పట్టుదల ఎంత అద్భుతమైనదో కదా! మానవాళి శ్రేయస్సు కోసం ముందుకుసాగే వాళ్లకు భగవంతుడి అనుగ్రహం వెన్నంటే ఉంటుంది. బుద్ధుడు అష్టాంగ మార్గం ద్వారా, శ్రీకృష్ణుడు యోగ, జ్ఞాన మార్గాల ద్వారా ప్రజలకు మార్గదర్శకులుగా నిలిచిపోయారు. మంచి గమ్యం నిర్ణయించుకుని ముందుకుసాగితే మనిషి తప్పక కీర్తిశిఖరాలను చేరుకుంటాడు.
- విశ్వనాథ రమ