ᐅ స్తుతి



 ᐅ స్తుతి


సూర్యోదయం ఎంతో మనోజ్ఞంగా ఉంది. చంద్రోదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పక్షుల కిలకిలారావాలు శ్రవణానందకరంగా ఉన్నాయి. ప్రకృతి నిశ్చలంగా రుషిలాగ ఉంది... మనసు ఇలాంటి భావాలను కలిగిస్తూ ఉంటుంది. ఈ భావాలకు వశమై పరవశించనివాళ్లు ఉండరు.
ఆనందింపజేయటం, ఆనందంలోకి తీసుకు వెళ్లటం, చివరికి ఆనందమే పరమావధి అని తెలియజేయటం ప్రకృతి ముఖ్య ఉద్దేశం. అదే విశ్వ మౌలిక సూత్రం. జగత్తు మనలను దీవిస్తే, ఆ ఆశీర్వచనాలు అందుకోవడానికి తహతహలాడతాం. ఎవరైనా మనలను స్తుతించడం మొదలుపెడితే, అపరిమితంగా ఆస్వాదించడానికి సిద్ధపడతాం. ఏ స్థితిలోనూ అడ్డు చెప్పడానికి ఇష్టపడం. కాని, మనకు సంబంధించని అద్భుత విషయాలు చెప్పినప్పుడు, కొంతసేపు విని ఆ తరవాత, ఆ విషయం నుంచి మనసు మళ్లిస్తాం. కొందరైతే ఇతరుల గొప్పతనాన్ని వినటానికే ఇష్టపడరు.

ఒక మంచి కవితను, గొప్ప తైలవర్ణచిత్రాన్ని, చక్కటి పద్యాన్ని, హృద్యమైన కథను, ప్రేరణ కలిగించే నవలను, విశేష స్ఫూర్తి అందించే దివ్య భావాన్ని, నలుగురికి ఉపయోగపడే మంచి కార్యాన్ని- మనం ఎందుకు హృదయపూర్వకంగా, విశేషంగా స్వీకరించి, స్పందించి గౌరవ అభినందనలు తెలుపలేం? పనికట్టుకుని ఈ పని చెయ్యాలి. కాని, చెయ్యం. ఎప్పటికో ఏ విదేశంలోనో గౌరవం పొందితే, అప్పుడు స్వదేశంలో ఎత్తిపడేస్తాం. ఎవడో పొగిడితేనే తప్ప మనమూ పొగడలేని దుస్థితి మనది. మనకు ప్రమాణాలు కావాలి. ఫలానా గొప్ప వ్యక్తి చెప్పాడు కాబట్టి గొప్పది కాబట్టి మనం గొప్పది అని అంగీకరించకతప్పదు కాబట్టి గొప్పది అంటుంటాం. ఇటువంటి వ్యక్తులు సహస్ర నామాలతో భగవంతుణ్ని ఎలా పూజిస్తారు, ఎలా స్తుతిస్తారు, ఎలా కీర్తిస్తారు? దైవగుణ విశేషాలు ఎప్పటికి మనకు తెలుస్తాయి? సచ్చిదానంద సముద్రుడిలో సత్యం, చైతన్యం, ఆనందం సముద్రంలా మనల్ని ముంచెత్తినప్పుడే భగవంతుణ్ని స్తుతిస్తామంటే, నిజంగా ఆ పని జరిగితే మనం ఉంటామా? అప్పుడు పొగిడేవాడు ఎవడు? పొగిడించుకునేవాడు ఎవడు?

ఎదగాలి. నదిలాంటి మనం ఎప్పటికైనా సముద్రంగా మారాలి. మారక తప్పదు. చెట్టులాంటి మనం అడవిగా మారాలి. పచ్చదనం అంతటా పరచుకోవాలి. మనసు విశాలమవుతున్న కొద్దీ హృదయంగా మారిపోతుంది. మనిషి పూర్తిగా వికసించినప్పుడు మానవత్వం వెల్లివిరుస్తుంది. దైవత్వం పెల్లుబుకుతుంది. అనుభూతి చెందడం తెలుస్తుంది. స్పందన గుణం పెరుగుతుంది. సత్యం శివం సుందరం అంటే- అర్థం తెలుస్తుంది.

దైవ సౌందర్యమే వివర్తనం చెంది లోకమంతా కనిపిస్తుంది. ఆశ, మోహం వదిలిపెట్టినవాడికి గడ్డిపువ్వులో కూడా ఈశ్వరుడు దర్శనమిస్తాడు. గుడ్డివాడిలో కూడా ఈశ్వరుడు నడిచి వస్తాడు. అంతటా అన్నింటా సత్యాన్ని గ్రహించినప్పుడు వైవిధ్యాలు, వైరుధ్యాలు ఎందుకుంటాయి?

వజ్రం చీకట్లోనూ ప్రకాశిస్తుంది. గొప్పతనాన్ని ఒప్పుకొని తీరాలి. అలా ఒప్పుకోవటంలో మన హృదయ నిర్మలత్వం బయటపడుతుంది.

అన్నమయ్య వేంకటేశ్వరుణ్ని కీర్తించాడు. ఇందులో ఎవరు లాభపడ్డారు? కబీర్‌ శ్రీరాముణ్ని దోహాలతో అలరించాడు. ఇందులో ఎవరు నిర్మల యశస్సును పొందారు? మీరా శ్రీకృష్ణుణ్ని భజించింది. ఇందులో ఎవరు తరించారు?

అంతా మన కోసమే. విమర్శించినా, నిందించినా, స్తుతించినా, నిర్లిప్తంగా ఉన్నా- భగవంతుడికి ఏమీ అక్కరలేదు. ఏదో విధంగా మనం అతడికి దగ్గరగా ఉన్నామా లేదా అన్నదే... ఆయన చూపు.

విచ్చలవిడిగా మన భావాలను ఖర్చుచేసి, లోకమంతా విస్తరించుకుని ఉన్న సర్వవ్యాపిని పట్టుకోవాలి. అతడు ఏ క్షణాన్నైనా దొరకొచ్చు- పసిపాప నవ్వులో, అందమైన పువ్వులో, నిర్మల పవనంలో, అమ్మ ఆశీర్వచనంలో...

- ఆనంద సాయి స్వామి