ᐅ దివ్యాభిరుచి



 ᐅ దివ్యాభిరుచి

ఆత్మజ్ఞాన సాధన అత్యంత కఠినం. కానీ... అంత కఠినం కాదు. ఇది ఎలా సాధ్యం!? మన మనసుకు నచ్చిన పని ఆయాసాన్నివ్వదు. ఆనందాన్నిస్తుంది. ఇష్టమైన పని కష్టం అనిపించదు. అది ఎంత కష్టమైనా, క్లిష్టతరమైనా. ఆంగ్లంలో 'హాబీ' (అభిరుచి) అని ఒక మాట ఉంది. అలాంటిదన్నమాట. మరోమాట ఉంది- వృత్తిపర సంతృప్తి అని. చేసేపనిలో ఆనందాన్ని పొందటం. ఏదైనా ఒక పని ఉంది. ఆ పని చేయక తప్పదు. ఆ పనే మనకు ఆనందాన్నిచ్చేదయితే?! అద్భుతంగా ఉంటుంది. ఆత్మజ్ఞాన సాధన... మనకు జన్మోద్దేశం అదే అయినప్పుడు, మనం దాన్ని సాధించే తీరవలసి ఉన్నప్పుడు, అప్పుడు... దాన్ని మన అభిరుచిగా కూడా మలచుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది!!! అప్పుడు, అప్పుడే అత్యంత కష్టతరమూ, క్లిష్టతరమూ అయిన ఆత్మజ్ఞాన విద్య సులభతరమూ, ఆసక్తికరమూ, ఆనందదాయకమూ అయిపోతుంది.
దీనికంతా కారణమూ, పరిష్కారమూ కూడా మనసే. మనసు దృష్టిలో భగవంతుడు పడేలా చేయాలి. అలా, భగవంతుడి దృష్టిలో మన మనసు పడే అవకాశం లభిస్తుంది. ఎప్పుడైనా ఒక విషయాన్ని, ఒకే ఆలోచననే భావన చేసే మనసుకు ఆ ఒకే అంశం, ఆలోచన భగవంతుడే అయ్యేలా ప్రయత్నించాలి. వివిధాంశాల ఆకర్షణలతో, అనుసరణలతో సదా సందడిగా, తెరిపిలేకుండా ఉండే మనసును ఏకాగ్రపరచే ఉపాయం అంతర్ముఖసాధన మాత్రమే. అంతర్ముఖమయ్యే మనసు బాహ్యరూప విశేషాలను చిత్రించటం మానేస్తుంది. జరిగిన, జరగబోయే సంఘటనలను చర్చించటం మరచిపోతుంది. దాన్ని మాయపుచ్చి ఆంతర్య ద్వారాల్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నం మనం చేయాలి. కనీసం దానికి అభిముఖమయ్యే ప్రయత్నం చేయాలి.

మనసు చాలా ఉత్కృష్టమైంది. దాని విలువ దానికి తెలియదు. ఎందుకంటే ఇతరం మీద వాలడమే దానికి అలవాటు. ఆంతర్యంలోకి ఒదిగి చూసుకోవటం దానికి తెలీదు. మనసుకు మనం ఆత్మగౌరవాన్ని నేర్పించాలి. ఔన్నత్యాన్ని మప్పాలి. దాని క్రమ పరిణతిని గుర్తుచేయాలి.

పిల్లలు పసివాళ్లుగా ఉన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటారు. ఆ తరవాత గోలీలు, బిల్లంగోడు ఆడతారు. ఆపై క్రికెట్‌లాంటి క్రీడలు లేదా బుద్ధిని శక్తిని ఉపయోగించి ఆడే చదరంగంలాంటి ఆటలు. జీవితం ఎప్పుడూ పరిణామ శీలం. మనసుకు మనం ఆ విషయాన్ని తెలియజేయాలి. పసిపిల్లల్లా పెద్దయ్యాక కూడా బొమ్మలు పట్టుకు ఆడుకుంటే బాగోదు. మనసైనా అంతే. తెలియని వయసులోలా అర్థం, ప్రయోజనంలేని విషయాల వెంట పరుగులు పెడితే దాని గౌరవానికే లోటు. పరిణతికే చేటు.

ఎంతో ఉన్నతమైనవారికి కొంత అమాయకత్వం ఉంటుంది. పసి మనస్తత్వం ఉంటుంది. మనసూ అంతే. మనసెంతో ఉన్నతమైనది. మనల్ని ఉద్ధరించేది. మనసు ఆసరాతోనే మనం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం. ఉత్తమ భూమికలను చేరుకుంటాం. అలాంటి మనసుకు హనుమంతుడిలా దాని శక్తి, ప్రయోజనం దానికి తెలీదు. దాని హుందాతనాన్ని మరచిపోయి పసిదానిలా పరుగులు పెడుతుంది. అది చేయగల ఘనకార్యాన్ని గుర్తించకుండా చిలిపి విషయాలమీద వాలుతుంది. అందువల్ల దాన్ని మచ్చిక చేసుకుని, బడి ఎగ్గొట్టి ఆటలవైపు మళ్లుతున్న పసిపిల్లాణ్ని పాఠశాలవైపు మళ్లించి, అక్కడ వదిలేసినట్లు మనమూ దారి మళ్లించాలి. మాటవినని పసివాడిలా దాన్ని మందలించేందుగ్గానీ, రెండు దెబ్బలు వేసేందుగ్గానీ వీలు లేదు. ఎందుకంటే మనసు చాలా సున్నితమైంది. అలాగే మహాబలీయమైంది. ఓపిగ్గా, మృదువుగా... నీటి ప్రవాహాన్ని ఆపకుండా ఉపాయంగా మనకు కావలసిన దారిలోకి మళ్లించినట్లు... మనసును అంతరంగంలోని అంతర్యామి వైపు మళ్లించాలి.

పదేపదే ఆ మహత్‌ సౌందర్యాన్ని దర్శింపజేస్తే, ఆ అనన్య 'రుచిరసనాన్ని' ఆస్వాదింపజేస్తే కొంతకాలానికి మనసు భగవత్‌ స్పృహను, స్మృతిని ఇష్టపడటం, ఆ మాధుర్యం నచ్చి, రెచ్చి ప్రేమించటం ప్రారంభిస్తుంది. మనసుకు భగవత్‌ చింతన ఒక అభిరుచిలా, అమృతపానంలా, ఆనంద రసాస్వాదనలా మారుతుంది. ఇంకేముంది! రోగీ పాలే కోరాడు. వైద్యుడూ పాలే పథ్యంగా సూచించాడన్నట్లు- మానవుడికి ఏది అత్యవసరమో, అనివార్యమో, ఏది జన్మోద్దేశమో అదే అతడికి అత్యంత ప్రియమైనదైపోయినప్పుడు... ఆత్మజ్ఞాన సాధన మరెంతో సులభమూ, సౌఖ్యవంతమూ అయిపోతుంది.

- చక్కిలం విజయలక్ష్మి