ᐅ మహా శివరాత్రి



 ᐅ మహా శివరాత్రి

వినాయకుడు చవితినాడు, రాముడు నవమి రోజు, కృష్ణుడు అష్టమి నాడు పుట్టారు. కాబట్టి, ఏటేటా ఆ పేర్లతో పండుగలు జరుపుకొంటున్నాం. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు శివోదయం అయినా, శివ చతుర్దశి అనకుండా- శివరాత్రిగా పేర్కొనటం విశేషం. మహా శివరాత్రి ఏడాదికోసారి వచ్చినా, ప్రతి నెలా అదేరోజు శివదీక్ష సాగించటం మరో విశేషం. దేవ, రుషి, మానవ, రాక్షస గణాలు భక్తిపూర్వకంగా ఉపవాస జాగరణలు పాటించటం వెనక పారమార్థికమైన అంతరార్థం ఉంది. జాతి, కుల, మత విచక్షణ లేకుండా ఎవరికి వారే శివరాత్రులు జరుపుకొనే వెసలుబాటు ఉండటం మరింత విశేషం. మహా, మాస శివరాత్రులు జ్ఞాన, ధ్యాన, కార్మిక రూపంలో ఉపయోగించుకోవచ్చు.
'శివ' అన్న పదానికి మంగళకరం, శుభం అని అర్థం. శివుడు అంటే నిత్యమంగళకరమైన వస్తువు కాని మరొకటి కాదు. శ్రుతులు కూడా శివ స్వరూపమైన పరబ్రహ్మాన్నే ప్రతిపాదిస్తున్నాయి. సత్యం, స్వప్రకాశం, అనంతం, అమృతం, ఆత్మ, బ్రహ్మ... అన్నీ శివమే! ఆ శివ స్వరూపమైన జ్ఞానమే కైవల్యం. చిత్రం ఏమిటంటే, మంగళకరమైన శివుడికి దోషరూపంగా భావించే రాత్రికి ఉన్న సంబంధం. అజ్ఞాన రూపమైన చీకటిరాత్రిని జ్ఞానరూపమైన శివ శబ్దానికి అన్వయించటం అసంబద్ధం అనిపించవచ్చు. ఇంద్రియ ప్రవృత్తులు వాటి వ్యాపారాలు అణగిమణిగి ఉండటానికి రాత్రి సమయమే అనుకూలమైంది. రాత్రి అంటే జీవకోటి అలసి సొలసి నిద్రలో జోగే నిశిరాత్రి కానక్కర్లేదు. ఇంద్రియ నిగ్రహం ఉన్న మునికి, వ్యవహార రూపమైన పగలు- రాత్రిలాంటిదని; అవ్యవహార రూపమైన రాత్రి పగలు వంటిదని భగవద్గీత చెబుతోంది. ఇంద్రియ మనోబుద్ధుల్ని శివార్పణం చేయటానికి ఇదొక చక్కని అవకాశం. ఉత్తమ, మధ్యమ, అధమ జీవులందరికీ ఉపయోగకరంగా శివరాత్రిని జ్ఞాన శివరాత్రి, ధ్యాన శివరాత్రి, కార్మిక శివరాత్రి అని మూడు విధాలుగా యథాశక్తి వాడుకోవచ్చు. శివవస్తువును గురించిన విచార ప్రస్థానం జ్ఞాన శివరాత్రి. తైల ధారలా శివవస్తువుపైన శరీర, ఇంద్రియ, మనో బుద్ధులను ఏకాగ్రం చేయటం ధ్యాన శివరాత్రి. అశివ కర్మలకు దూరంగా, నియతితో కర్మాచరణకు పూనుకోవటం కార్మిక శివరాత్రి. ఇది సదా ఆచరించటంవల్ల ఎలాంటివాడైనా శివ సాన్నిధ్యాన్ని పొందవచ్చునని చెబుతారు. అలా కుదరని పక్షంలో నెలకు ఒక్కసారైనా శివకర్మలు ఆచరించటానికే మాస శివరాత్రి నిర్దేశితమైంది. అందుకూ నోచుకోని ఏ జీవి అయినా మహా శివరాత్రినాడు ఏడాదికి ఒక మారు శివరాత్రిని పాటించగలిగితే ధన్యత చేకూరుతుందని చెబుతారు. ఇంత వెసులుబాటు ఉండటం వల్లే పారమార్థిక, సాంస్కృతిక, భౌతిక జీవితాల్లో శివరాత్రి ఇంతగా ప్రత్యేకత సంతరించుకుంది.

- వి.రాఘవేంద్రరావు