ᐅ ఏదీ కష్టం కాదు
ᐅ ఏదీ కష్టం కాదు!
నీవు చేసే పనిని ప్రేమించు. త్రికరణశుద్ధిగా ఆచరించు. ఫలితాలను ఆశించకు- అనేది గీతావాక్యం. పనిని ప్రేమించినవారికి ఏదీ కష్టం కాదు. కార్యసాధకులు నిరంతరం తాము చేసే పనిలోనే నిమగ్నులవుతారు. విలువైన ప్రతిక్షణాన్ని వినియోగించుకుని మానవత్వమనే మార్గంలో ప్రయాణించి దృఢనిశ్చయంతో లక్ష్యాన్ని చేరుకుంటారు.
మనిషి ఆలోచన చాలా శక్తిమంతమైనది. అనంతమైనది. ఎవరి ఆలోచనలు గొప్పగా ఉంటాయో వాళ్లే ప్రపంచాన్ని ఏలతారు. అందుకే ఎవరైనా ఉన్నతంగా ఆలోచించుకోవడం నేర్చుకోవాలి.
ఇతిహాసాలు, మతగ్రంథాలు మానవ శక్తి అనిర్వచనీయమైనదని నిరూపించాయి.
రామాయణంలో శ్రీరాముడికి ఎదురైనన్ని అవరోధాలు ఇంకెవరికీ తారసపడవు. అయినా సరే రాముడు ధర్మాన్ని, కర్తవ్యాన్ని విడనాడలేదు. మాట తప్పలేదు. ఎవరితోనూ కోరి శత్రుత్వం పెట్టుకోలేదు. కర్తవ్య నిర్వహణలో ముందుకు సాగుతూ ఆదర్శ పురుషుడిగా, ఆదర్శ భర్తగా, ఆదర్శ కుమారుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే రాక్షసుడైన మారీచుడు కూడా శ్రీరాముడి గొప్పతనాన్ని గ్రహించి 'రామో విగ్రహవాన్ ధర్మః' అని కీర్తించాడు.
శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞతకు, కార్యసాధనకు నిలువెత్తు ప్రతీకగా నిలిచాడు. యుద్ధరంగంలో వికలమనస్కుడైన అర్జునుణ్ని కార్యోన్ముఖం చేసి అసాధారణ విజేతగా నిలిపాడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన గీతోపదేశం మానవాళికి ప్రతీ క్షణం స్ఫూర్తిని కలిగిస్తుంటుంది. అసలైన వ్యక్తిత్వ వికాసమంటే ఏమిటో గీతద్వారా బోధించి చూపించాడు శ్రీకృష్ణుడు. కార్యసాధకుడికి ఏదీ కష్టం కాబోదని రుజువు చేశాడు. ప్రయత్నాన్ని ఎప్పుడూ మానవద్దని హితోపదేశం చేశాడు. మన ఆలోచనలే మనకు మేలు చేస్తాయి. మంచితనం మంచిని పెంచుతుంది. మిత్రులను సమకూర్చుతుంది. మంచిని కోరేవాడు మాన్యుడై తీరుతాడు. 'నాకు చేతకాదు' అనే పదం తన పదకోశంలో లేదు అనేవాడు నెపోలియన్. ఏ విజయానికైనా మూలసూత్రాలు మూడు. దృఢమైన కోరిక, నైపుణ్యం, విషయ పరిజ్ఞానం. ఇవి త్రిశక్తులు. వీటిలో ఏది లోపించినా పని పూర్తి కాదు. వీటన్నింటి కలయికవల్లే గాంధీజీ మహాత్ముడయ్యాడు. పరాయి పాలనను పారదోలాడు. విజయాలను కోరుకునేవారికి అపజయాలు కూడా ఎదురవుతాయి. అది సహజం. వాటికి ఎదురు నిలిచి పోరాడినవాడే లక్ష్యసాధకుడు కాగలడు.
ప్రతీ మనిషికీ పరమావధి ధనార్జన మాత్రమే కాదు. జీవిత సార్థకత చాలా ముఖ్యం. 'నేను ఈ ప్రపంచానికేం చేశాను?' అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. ప్రతి జీవిలో అనంతమైన శక్తి అంతర్గతంగా ఉంటుంది. దాన్ని లోకకల్యాణం కోసం వినియోగిస్తే మనిషి మహనీయుడిగా భూమ్మీద నిలిచిపోతాడు.
మానవప్రయత్నం లేకపోతే ఏ చిన్న కార్యక్రమమైనా సుసంపన్నం కాదు. ప్రయత్నిస్తే ఎలాంటి పెద్దకార్యమైనా సిద్ధిస్తుంది. దివి నుంచి గంగను భువికి రప్పించడానికి భగీరథుడు పడ్డ శ్రమ, చేసిన తపస్సు వర్ణనాతీతం. అయినా లోకకల్యాణం కోసం భగీరథుడు ఆ కార్యంలో విజయం సాధించి చిరస్మరణీయుడిగా అందరిలో నిలిచిపోయాడు. కొన్నివేల శతాబ్దాల కిందట వాల్మీకి, వేదవ్యాసుడు ఎంతగానో శ్రమించి రామాయణం, మహాభారతం లోకానికి అందించారు. వారి కృషి సామాన్యమైనది కాదు కదా! సత్కార్యాచరణంలో నిమగ్నమైన నరశ్రేష్ఠుణ్ని జయలక్ష్మి తప్పక వరిస్తుంది. దైవబలం తోడవుతుంది.
- విశ్వనాథ రమ