ᐅ హితం కోరేదే మతం



 ᐅ హితం కోరేదే మతం!

మానవజాతి అంతటినీ ఏకతాటిపై నడిపించేది పరస్పర అవగాహన. మనిషిని చూస్తే మనిషికి పడకపోతే ఎలా? అవతలి వ్యక్తి ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడనే సందేహాలు, భేదభావాలు ఉన్నంతకాలం ప్రగతి కుంటువడుతుంది. ఏ మతంవారైనా సహృదయులైతే చాలు. విశాల దృక్పథం అవసరం. ప్రాథమిక నమ్మకాల విషయంలో మత గురువులు బోధించిన విషయాలను ఎంతవరకు పాటిస్తున్నాం? గురువుల బోధనలను స్వప్రయోజనం కోసం, అనుచిత కార్యకలాపాల కోసం వాటికి వక్రభాష్యం చెప్పి దుర్వినియోగం చేయడం సమంజసం కాదు.
ఏ మతమైనా జనహితమే కోరుతుంది. కత్తులు దూయమని, కుత్తుకలు కోయమని, నెత్తురు చిందించమని చెప్పదు. సాన్నిహిత్యాన్ని పెంపొందించుకొమ్మని, అందరూ ఒక్కటే అనే సద్భావన పెరగడానికి దోహదం చేసేదిగా మతం ఉండాలి. మనుగడను సక్రమ మార్గంలో నడపడానికి ఉపకరించే సాధనం కావాలి. అంతేగాని, మానవుడి ఉనికికే సవాలు కాకూడదు. నిశ్చలంగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఉండటానికి ప్రయత్నించండి. అదే మతమంటే అన్నారు స్వామి వివేకానంద. మతంలో రహస్యం సిద్ధాంతాల్లో లేదు. ఆచరణలో ఉందన్నారు. మంచిగా ఉండటం, మంచి చేయడం- ఇదే మతంలో సారాంశం.

ఎవరి మతాన్ని వారు పాటిస్తూ ఇతరుల మతాన్ని గౌరవించాలి. మత మౌఢ్యాన్ని పెంచుకుంటే సమాజం ఛిన్నాభిన్నమై శాంతి, భద్రతలు కరవై చివరికి దుఃఖమే మిగులుతుంది. మతం మార్గదర్శకం చేయాలి. మత్తుమందు కాకూడదు. అదే అందరి అభిమతమై సర్వజన సమ్మతంగా, ప్రజాశ్రేయమే ధ్యేయంగా విలసిల్లాలి. మతాన్ని ఇస్లాములో 'మఝూభ్‌' అంటారు. అంటే ధర్మపథం. ఆ భగవంతుని, ఆ అల్లాను చేరడానికి ఆనందమార్గం.

అన్ని మతాలూ ప్రేమనే బోధించాయి. ద్వేషాన్ని నిరసించాయి. అన్ని నదులూ సముద్రంలోనే కలుస్తాయి. అన్ని మతాలూ హితాన్నే కోరతాయి. హిందూమతం, ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం, జైనం, సిక్కుమతం- వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే వాటి రూపంలోనే కాకుండా సారంలో కూడా సాదృశ్యం కనిపిస్తుంది. భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ బోధించేది ఒక్కటే. అన్నింటిలోనూ ముఖ్యాంశాలు ఒక్కటే. కృష్ణుడైనా, అల్లా అయినా, ఏసయినా ఏ పేరుతో పిలిచినా అది దైవానికే చెందుతుంది. 'ఈశ్వర అల్లా తేరే నామ్‌' అనే అభిప్రాయంతో గీత, ఖురాన్‌ ఏకీభవిస్తాయి. భగవద్గీత ప్రకారం ఈశ్వరుడు ప్రజలను తమస్సు నుంచి తేజస్సులోకి గొనిపోతాడు. అలాగే అల్లా చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్తాడు అంటుంది ఖురాన్‌. పరబ్రహ్మను 'ఓం తత్‌సత్‌' అంటే, ఖురాన్‌ అల్లాను అల్‌హక్‌ అంటుంది. రెండింటికీ అర్థం సత్యం.

కర్మకాండలు, వివిధ సంస్కారాలు, అనుష్ఠానం తదితరాల్లో మతాల మధ్య తేడాలున్నా, అవన్నీ కేవలం మన ఆత్మతృప్తికి ఏర్పరచుకున్న బాహ్య విషయాలే. వాస్తవానికి మూలంలో సాదృశ్యం ఉంది. వేదసంబంధమైన సంధ్య, ఉపాసన, క్రైస్తవుల ప్రార్థన, ముస్లిముల నమాజు ఒకటే. అన్నీ విశ్వశక్తి, మానసిక, భౌతిక బలాన్ని, సదవగాహన, రుజువర్తన, అంతర్వికాసం ప్రసాదించమని, చెడు ఆకర్షణ నుంచి రక్షణ, కర్తవ్య నిర్వహణకు తగిన మనోబలం అనుగ్రహించమని ప్రార్థిస్తాయి. అర్హులైనవారికి ధర్మం చేయడం పట్ల అన్ని మతాలూ సమానంగా స్పందించి విభిన్న మార్గాలు నిర్దేశిస్తున్నాయి. మతాల వారీగా బాహ్య చిహ్నాలు వేరైనా- వాటి గమ్యం ఒక్కటే. విభిన్న మతాల ఆరాధనా స్థలాలను వివిధ పేర్లతో వ్యవహరించినా అర్థం, పరమార్థం ఒకటే. ఎవరైనా ఆ దేవుడి ముందు, అల్లా ముందు, ప్రభువు ఎదుట మోకరిల్లవలసిందే. ప్రాథమిక సత్యాలు, నైతిక బోధనలు చెక్కుచెదరవు.

బైబిలు 'నేనే సత్యం, జీవితం, మార్గం' అంటుంది. గీతలో కృష్ణభగవానుడు 'సమస్త జీవుల హృదయాల్లో ఉండే ఆత్మను నేనే. సర్వభూతాల ప్రవృత్తి, స్థితి, ప్రళయ కారణం నేనే' అంటాడు. ఖురాన్‌లోనూ ఇదే భావం కనిపిస్తుంది. మతకలహాలు ఎప్పుడూ పనికిరానివి. మతమంటే మాటలు కాదు లేదా పేర్లు కాదు లేదా వర్గాలు కావని, ఆధ్యాత్మికతను అవగాహన చేసుకోవడమని వివేకానందుడు అన్నారు.

ఈ భూమ్మీద మానవులుగా జన్మించినందుకు ఏదైనా సత్కార్యం చేసి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మతం బలహీనత కాకూడదు. ఆ బలహీనత దుష్కృతాలు చేయడానికి దోహదం చేయతగదు. వ్యక్తి వికాసానికి, సమాజ శ్రేయానికి ఉపకరించేలా మతాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకొని ఆశయాలను మాటలకు, ప్రసంగాలకే పరిమితం చేయకుండా అక్షరాలా ఆచరించిన నాడు అభ్యుదయం వెల్లివిరుస్తుంది.

- వి.ఎస్‌.ఆర్‌.మౌళి