ᐅ శ్రీకూర్మనాథ డోలోత్సవం
మహావిష్ణువు అవతారాల్లో రెండోదైన కూర్మావతారం ప్రధాన దైవంగా వెలసిన క్షేత్రం శ్రీకూర్మం. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళానికి సమీపంలో నెలకొని ఉంది. శ్రీకూర్మనాథుడి దేవి లక్ష్మి. చతుర్భుజి. గరుడవాహన. ఆలయం పూర్వాభిముఖంగా ఉన్న స్వామి పశ్చిమాభిముఖంగా ఉండటం, గర్భాలయం మధ్య భాగంగా గాక దక్షిణ పార్శ్వంలో ఉండటం, రెండు ధ్వజస్తంభాలు ఉండటం- ఈ ఆలయం ప్రత్యేకతలు.
ప్రధానాలయం తూర్పు గాంగరాజైన అనంతవర్మ చోడగాంగుడు(క్రీ.శ. 1078-1148) కాలంలో నిర్మాణమైనట్లు తెలుస్తోంది. ఆలయం మంటప స్తంభాలపైన తూర్పు చాళుక్య, మత్స్య, వెలమ, గజపతి రాజవంశీకుల దానశాసనాలు ఉన్నాయి. క్రీ.శ. 1178లో సింహళ దేశానికి చెందిన గాయని భాగలదేవి శ్రీకూర్మనాథుడికి అఖండ దీపం నిలిపి అమూల్యాభరణాలు ఇచ్చినట్లు తెలిపే శాసనం ఉంది. క్రీ.శ. 1273నాటి ఒక శాసనం రాజరాజ నరేంద్రుడు నన్నయ చేత మహాభారతాంధ్రీకరణం చేయించిన విషయం పేర్కొంటోంది. చైతన్య మహాప్రభువు క్రీ.శ. 1512లో ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. ఆనందతీర్థుడి శిష్యులైన నరహరితీర్థుల ప్రస్తావన ఒక శాసనంలో ఉంది. మధ్వ సంప్రదాయానికి చెందిన ఈయన పూర్వాశ్రమ నామధేయం శ్యామశాస్త్రి అని చెబుతారు.
చారిత్రక విశేషాలు ఈవిధంగా ఉండగా ఇక్కడ స్థలపురాణం భిన్నంగా ఉంటుంది. పద్మ, బ్రహ్మాండ పురాణాలు, పాంచరాత్రాగమ సంహిత- ఈ క్షేత్ర మహిమను, స్థలపురాణాన్ని విశదీకరిస్తున్నాయి.
శ్వేతపురాన్ని పాలించే రాజు శ్వేత చక్రవర్తి. ఆయన భార్య విష్ణుప్రియ మహా భక్తురాలు. ఒక ఏకాదశి రోజున ఉపవాసం చేస్తూ వ్రతనిష్ఠలో ఉండగా రాజు కామమోహితుడై అంతఃపురానికి వచ్చాడు. పూజా మందిరంలో ఉన్న రాణి రాజు ఉద్దేశం గ్రహించి శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. 'నీవు కూర్మ రూపంలో భూమిని ధరింపలేదా, అబలనైన నన్ను ఉద్ధరించలేవా, వ్రతభంగం కాకుండా కాపాడవయ్యా' అని వేడుకోగా- శ్రీమన్నారాయణుడు కటాక్షించి గంగను 'నీవు రాణి పూజా మందిరంలో ఉద్భవించి ప్రవహించమని ఆజ్ఞాపించాడు. అంతఃపురం మధ్యగా నదీ ప్రవాహాన్ని చూసి రాజు ఆశ్చర్య భయాలతో శ్వేతగిరి వద్దకు పరివారంపాటు పారిపోయి వృద్ధ మంత్రివల్ల జరిగిన విషయం తెలుసుకున్నాడు. పాప పరిహారార్థం ఆ నదిలో స్నానం చేస్తూ, మహావిష్ణువును ధ్యానం చేసేవాడు. దేవర్షి నారదుడు ప్రత్యక్షమై ఈ నదీ ప్రవాహం వంశధార నామంతో ప్రసిద్ధమవుతుందని ఇది సాగర సంగమ ప్రదేశమని, స్నానమాత్రం వల్లనే హరి భక్తిని కలిగించే పుణ్యతీర్థంగా వాసికెక్కుతుందని తెలిపాడు. శ్వేత చక్రవర్తి నారదుడు ఉపదేశించిన కూర్మ మంత్ర జప దీక్షను సాగించాడు. కూర్మనాథుడు ప్రసన్నుడై రాజుకు దర్శనమిచ్చి తనకు ఆలయం కట్టించమన్నాడు. రాజు ఆలయం నిర్మించి కూర్మనాథుని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ.
ఈ క్షేత్రానికి తూర్పున చక్రతీర్థం ఉంది. శ్వేత చక్రవర్తి తపస్సు చేశాక శ్రీకూర్మనాథుడు ఈ తీర్థంనుంచే అవతరించాడని చెబుతారు. శ్రీకూర్మనాథుని చక్ర ప్రయోగంచే నిర్మితమై శ్రీమహాలక్ష్మి అవతరించిన శ్వేతగుండంలో- స్నానంచేసి ఆలయ శిఖరాన్ని దర్శించి కూర్మనాథుని దర్శించి, ఈ కుండంలో పిండప్రదానం చేసినవారు విష్ణుసాయుజ్యం పొందగలరని భక్తుల విశ్వాసం. సముద్ర స్నానం చేసి కూర్మనాథుని దర్శించడం ఒక సంప్రదాయం.
ఇది పంచలింగారాధ్య క్షేత్రం అయిదుగురు శివులు క్షేత్ర పాలకులు. తూర్పున కర్పూరేశ్వరుడు, ఉత్తరాన హడికేశ్వరుడు, పశ్చిమంలో కోటీశ్వరుడు, దక్షిణ దిశలో సుందరేశ్వరుడు, శ్రీకూర్మక్షేత్ర సుధాకుండ తీరాన పాతాళ సిద్ధేశ్వరుడు వెలశారు. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారాన భైరవుడు ఉన్నాడు.
వైష్ణవ ఆగమాలను అనుసరించి ఇక్కడ అర్చనలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ఫాల్గుణ పౌర్ణమి నాటి డోలోత్సవం ప్రముఖమైనది. డోల అనగా వూయల- స్వామిని వూయలలూగించే ఈ ఉత్సవం తిలకించడానికి అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగే తిరునాళ్లను 'డోలా యాత్ర' అంటారు. ఈ పౌర్ణమి డోలా పౌర్ణమిగా ప్రసిద్ధి. వైశాఖశుద్ధ ఏకాదశినాడు స్వామివారి కల్యాణం, కార్తీకశుద్ధ ద్వాదశినాడు తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి- ఇక్కడ నిర్వహించే ఇతర ముఖ్యమైన ఉత్సవాలు.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు