ᐅ హనుమాన్ చాలీసా
ᐅ హనుమాన్ చాలీసా
సుప్రసిద్ధ హిందీ ప్రాచీన భక్తకవి, శ్రీరామ భక్తుల్లో అగ్రగణ్యుడు 'రామచరితమానస్' అనే పేరుతో రామాయణం రచించిన గోస్వామి తులసీదాసు తీర్థాటన చేస్తూ పండరీపురం చేరి, అక్కడ కొంతకాలం నివసించాడు. నిత్యకృత్యాల్లో భాగంగా ఓ రోజున 'చంద్రభాగా'నదిలో స్నానం చేసి, విఠలనాథుని ధ్యానిస్తూ నదీ తీరాన కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో ఒక అంధుడు ఇంట్లో తగాదాపడి, నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని అక్కడికొచ్చాడు. ధ్యానంలో ఉన్న తులసీదాసును ఆ అంధుడి పాదాలు తగిలాయి. అతడు పడిపోయాడు. తులసి వెంటనే ఆ అంధుణ్ని పైకిలేపి, ఆలింగనం చేసుకుని 'క్షమించు నాయనా! నీ కృపాదృష్టిని నాపైన ప్రసరింపజెయ్యి... ఇటు చూడు' అన్నాడు. అంతే... అంధుడికి చూపు వచ్చింది. పరమానందంతో తులసీదాసు పాదాలపైనపడి 'స్వామీ! మీరు నా పాలిట సాక్షాత్తు పాండురంగస్వామే. నాకు దృష్టిని ప్రసాదించారు. మరో జన్మకు నన్ను అర్హుణ్ని చేశారు. ఈ పునర్జన్మను ఆధ్యాత్మిక సేవతో సద్వినియోగం చేసుకుంటాను'. తులసీదాసు అన్నాడు- 'నాయనా. ఇది నా మహిమ కాదు. నేను సామాన్యుణ్ని. విఠల ప్రభువు అనుగ్రహ ప్రాప్తి కలిగింది నీకు. అది దివ్యదృష్టి. నీ శేష జీవితాన్ని దైవచింతనతో ధన్యం చేసుకో!'
తులసీదాసు జీవిత చరిత్రలో ఇలాంటి సంఘటనలెన్నో సంభవించాయి. అవన్నీ భగవంతుడు ఆయన ద్వారా వ్యక్తం చేయించినవే. ఈ విషయం ఆ కాలంలో భారతదేశాన్ని పాలిస్తున్న అక్బరు పాదుషాకు తెలిసింది. తన కొలువుకు రావాల్సిందిగా ఆహ్వానించాడు. 'నీకు చాలా మహిమలున్నట్లు తెలిసింది... నాకు కొన్ని చూపించు, మెప్పించి, పారితోషికాలు స్వీకరించు' అని కబురంపించాడు. 'పాదుషా చక్రవర్తీ! క్షమించు నేను రామదాసును. నాలో ఏ మహిమలు లేవు. నిమిత్తమాత్రుణ్ని. ఏమైనా ఎప్పుడైనా వ్యక్తమైతే, అవి శ్రీరామచంద్రమూర్తి లీలలు!' అని బదులిచ్చాడు. అక్బరుకు ఆగ్రహం కలిగింది. 'ఏమిటీ, పాదుషానే ధిక్కరిస్తున్నావా! నా మాట వినని వాళ్లకు మరణదండన తప్పదన్న సంగతి నీకు తెలుసా?' అని గద్దించాడు. తులసీదాసు వినమ్రుడై బదులు పలికాడు- 'మరణమే శరణ్యమని రాముడి సంకల్పమైతే ఆ తరుణం ఆపినా ఆగదు' అన్నాడు.
అక్బరు క్రోధం తీవ్రస్థాయికి చేరుకుంది. తన ఆజ్ఞను ధిక్కరించినందుకు భటుల్ని పిలిచి తులసీదాసును కొరడాలతో కొట్టవలసిందిగా ఆదేశించాడు. తులసి రెండు చేతులు జోడించి రామనామ స్మరణం చేశాడు. భటుల చేతుల్లోని కొరడాలు లేచినవి లేచినట్లే ఉండిపోయాయి. అక్బరుతో సహా భటులను భయంకరమైన చూపులతో, అరుపులతో అసంఖ్యాకమైన కోతులు బెదిరించసాగాయి. అంతా నిలువునా కంపించిపోసాగారు. చుట్టూ చేరిన కోతులు వాళ్లను అడుగైనా కదలనివ్వడం లేదు. అక్బరు దిగ్భ్రాంతి చెంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. తన పొరపాటు తెలుసుకున్నాడు. తులసీదాసు పాదాల మీద పడిపోయి కన్నీరు, మున్నీరుగా విలపించసాగాడు. తులసికేమీ అర్థం కాలేదు. కారణమడిగితే తన దయనీయస్థితిని వివరించాడు అక్బరు. తనకే కోతులు కనిపించడం లేదే. భక్తి ప్రపత్తులతో హనుమను ప్రార్థించాడు- 'స్వామీ! నాపైన ఎందుకింత నిర్దయ? వీరందరికీ దరిసెనమిచ్చి కరుణించావు కదా, నాకెందుకా సౌభాగ్యం ప్రసాదించవు? నేను చేసిన అపరాధం ఏదైనా ఉంటే క్షమించు' అంటూ దుఃఖ బాష్పధారలు స్రవిస్తూంటే, ఎలుగెత్తి వాయునందనుణ్ని అనేక విధాల స్తుతిచేశాడు. పవనసుతుని దరిసెనమంది పరమానందభరితమైనాడు.
అదే హనుమాన్ చాలీసాగా జగత్ప్రసిద్ధి పొందింది. మారుతి కటాక్ష వరమహిమచేత తులసీ విరచిత 'హనుమాన్ చాలీసా' మోక్ష తులసీదళమై రామనామ జపసాధకులను పునీతం చేస్తోంది.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి