ᐅ సద్భావనాశీలం
ᐅ సద్భావనాశీలం
'కాశీలో ఉన్నప్పుడు శివభక్తుడిలా ఉండాలి. తిరుపతిలో ఉన్నప్పుడు వైష్ణవుడిగా ఉండాలి' అనేది పెద్దలవాక్కు. అంటే, ఏ ప్రదేశంలో మనం ఉంటామో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలనేది అందులోని భావం. అంతేకాదు, మన ఉనికివల్ల అక్కడివారికి, ఆ ప్రదేశానికి మేలు జరగాలి.
జగన్నాథుడైనా, శ్రీరాముడు అయోధ్యాపతిగా ఉన్నప్పుడు ఒక మంచి రాజుగానే వ్యవహరించాడు. అరణ్యాల్లో ఉన్నప్పుడు నారవస్త్రాలు ధరించి అరణ్యవాసిగానే జీవిస్తూ, లోక కంటకులైన రాక్షసులను వధించి, తాపసులకు రక్షణతో పాటు ప్రశాంత జీవితాన్ని ప్రసాదించాడు.
శ్రీకృష్ణపరమాత్మ గురుకులంలో సాందీప మహర్షివద్ద అణకువతో, వినయవిధేయతలతో అందరిలో ఒకడిగానే వ్యవహరించాడు. అంతేతప్ప తన దైవత్వాన్ని ఆధిక్యాన్ని ప్రదర్శించలేదు.
స్వయంగా వేదమూర్తి అయిన శ్రీరాముడు- వసిష్ఠుడు, విశ్వామిత్రులనుంచి జ్ఞానబోధను సవినయంగా స్వీకరించాడు. వారి పూజలు పొందగలిగినా వారినే పూజించాడు. వీటినే లోక మర్యాదలుగా చెబుతారు. భూలోకంలోని మర్యాదల్ని పరమాత్మ కూడ పాటించడం మనకు ఆదర్శం కావాలి.
ఈ ప్రాథమిక విషయంపట్ల చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. తమ అర్హతలను తామే అధికంగా అంచనాలు వేసుకుని, ఎక్కడికి వెళ్లినా అందరూ తమ ఘనతను గుర్తించి గౌరవ మర్యాదలు చూపాలని ఆశిస్తారు.
ఆశించినవన్నీ జరగవు గనుక, ఎవరికీ అర్హతను మించిన అధిక గౌరవాలు, మర్యాదలు లభించవు. ఇందుకు ఆక్రోశించి తమకు అవమానం జరిగిందని ఆగ్రహించడం సరికాదు. దీనివల్ల మనమే నష్టపోతాం.
తనంతటి భక్తుడు తానే అనుకుంటూ, నిత్యమూ గుడికి వెళ్తూ, అక్కడ దేవుడి దగ్గర అనేక కోరికలు కోరతారు కొందరు. అవేమీ తీరని పక్షంలో గుడికి వెళ్లడం మానె య్యడం వివేకం అనిపించుకుంటుందా?
చెరువు మీద కోపంతో స్నానం చెయ్యడం మానేస్తే- చెరువుకేమిటి నష్టం? ముందు మన మనసును కలుషితం చేస్తున్న చెడు భావాల్ని విసర్జించాలి. నిత్యమూ శరీర శుభ్రత చేసుకుంటున్నట్లే మనో మాలిన్యాలను కూడా ఆత్మవిచారం ద్వారా ఆత్మ దర్శన ధ్యానం ద్వారా క్షాళన చేసుకుంటూ ఉండాలి. ఒక గదిని కొన్నాళ్లు అలా వదిలేస్తే ధూళి పేరుకుపోతుంది. బూజు దట్టంగా పట్టుకుంటుంది. చీమలు పుట్టలు పెడతాయి. అందులోకి పాములు ప్రవేశించి, దాన్ని విషనిలయంగా మార్చివేస్తాయి.
సరిగ్గా, ఇదే విధంగా మనసులోనూ జరుగుతుంది. మనసును మందిరంగా చెబుతారు. పూజామందిరం లాగా నిత్యమూ దాన్ని పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. లేకపోతే అది పాముల పుట్టగా మారిపోతుంది. అనేక దుశ్చర్యలకు, దుర్మార్గాలకు ప్రేరణ కలిగిస్తుంది. ఏ సమాజంలో ఆధ్యాత్మిక వికాసం ఉండదో, అక్కడ సద్భావనాశీలం ఉండదు. మానవతా విలువలు ఉండవు. అక్కడ అరిషడ్వర్గాలుగా చెప్పే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలదే పెత్తనమవుతుంది. ఆ సమాజం అశాంతికి నిలయంగా నిత్య సంఘర్షణలతో, అంతర్గత విభేదాలతో కునారిల్లుతుంటుంది.
ఈ దుస్థితి నుంచి రక్షణ కలిగించేదే ఆధ్యాత్మిక వికాసం. భారతీయత సజీవంగా ఉన్నంత కాలం, ఇక్కడ ఆధ్యాత్మిక వికాసం వర్ధిల్లుతూనే ఉంటుంది. అందులోనే సద్భావనాశీలం ఇమిడి ఉంది.
మనం ప్రయత్నపూర్వకంగా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశ్రయించి, సద్భావనాశీలాన్ని పెంపొందించుకోవాలి.
అదే మనకు శ్రీరామరక్ష అవుతుంది.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్