ᐅ సప్త వ్యసనాలు


 ᐅ సప్త వ్యసనాలు

జీవితం ఓ అద్భుతం. జీవన విధానం అంతకంటే అద్భుతం. సుఖసంతోషాలను జీవితంలో అనుభవించి, ఆదర్శ వ్యక్తిగా తనను తాను తీర్చిదిద్దుకోవాలంటే మనిషి సదభ్యాసాలను ఆహ్వానించాలి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. చెడు అటవాట్లనే వ్యసనాలంటాం. మనిషిని అధఃపాతాళంలో పడేసేవి ఈ వ్యసనాలే. వీటిలో ప్రమాదకరమైనవి సప్త వ్యసనాలున్నాయని శాస్త్రం చెబుతోంది. 1. స్త్రీ వ్యసనం, 2. ద్యూతం (జూదం), 3. వేట, 4. మద్యం, 5. వదరుబోతుతనం, 6. నేరాన్ని మించిన శిక్ష విధించటం, 7. పూర్వీకులు ఆర్జించిన సంపదను విచ్చలవిడిగా ఖర్చుచేయటం. ఈ సప్త వ్యసనాల్లో ఏ ఒకటైనా చాలు- మనిషిని పతనావస్థకు దిగజార్చటానికి. వీటికి దూరంగా ఉన్న మనిషి పరిపూర్ణుడే.
స్త్రీవ్యామోహం వల్ల చరిత్రహీనులై అపఖ్యాతి పాలైనవారెందరో ఉన్నట్లు ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. కండు మహర్షి ప్రమోచని అనే స్త్రీ వలలో పడి, కామపరతంత్రుడై తొమ్మిది వందల సంవత్సరాలు వ్యర్థంగా గడిపాడట. మేనక సౌందర్యానికి వ్యామోహితుడై విశ్వామిత్రుడు వందల సంవత్సరాల తపస్సును భంగం చేసుకుని, ఆమె వెంటపడ్డాడు. రావణాసురుడు పరస్త్రీ వ్యామోహంలో పడి స్వర్ణలంకను చేజేతులా పాడుచేసుకున్నాడు. కుటుంబాన్ని, సైన్యాన్ని, అందరినీ కోల్పోయి, చివరికి తానే అసువులు బాశాడు. కామప్రకోపితుడై సుగ్రీవుడు కాలాతీతాన్ని, మైత్రీధర్మాన్ని విస్మరించాడు. కీచకుడు ద్రౌపది వ్యామోహంలో పడి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు. స్త్రీ ఆకర్షణ వల్లనే రాజులు, చక్రవర్తులు రాజ్యాల మీద దండెత్తి, యుద్ధాలు చేసి, రక్తపుటేర్లు ప్రవహింపజేశారు. గోస్వామి తులసీదాసు భార్య రత్నావళిని హద్దుమీరి ప్రేమించి, కొంతకాలం అజ్ఞానంలో గడిపాడు. 'ఎంతవారలైనా కాంత దాసులే' అన్నాడు నాదబ్రహ్మ త్యాగరాజు. మోహిని మోహంలో పడి భస్మాసురుడు భస్మమైపోయాడు. దేవేంద్రుడు పరస్త్రీల సౌరుకు జోహారులు పలికి అపఖ్యాతి పొందాడు. శంతనుడీ వ్యసనం వల్లనే తన వాళ్లనందరినీ కష్టాలపాలు చేశాడు.

జూద వ్యసనానికి బానిసలైన ధర్మరాజు, నలుడు ఎన్నో కష్టాలపాలైనారు. జూదం వల్ల గుణనిధి చేయని పాపమంటూ లేదు. జూదం అనేక హత్యలకూ, ఆత్మహత్యలకూ కారణమైంది.

మృగయా వినోదార్థం పరీక్షిన్మహారాజు అడవికి వెళ్ళి, శమీకుడి మెడలో సర్పం వేసి, ఆ ముని క్రోధానికి, శాపానికి గురైన విషయం తెలిసిందే. పాండురాజు, దశరథుడు కూడా వేటలకు వెళ్ళి ఇబ్బందులపాలైనారు. ఈ వ్యసనంవల్ల వత్సరాజు శత్రువులకు చిక్కి బందీ అయిపోయాడు. మద్యపానం వల్ల రాక్షసులంతా హీనచరితులైనారు. శుక్రాచార్యుడు, కీచకుడు మద్యానికి బానిసలైనారు. కళ్లు ఉండీ కూడా అంధులైపోయారు. వాచాలత్వానికి, ప్రగల్భాలకు ఉత్తరకుమారుడే ప్రథమ శ్రేణికి చెందినవాడిగా కనిపిస్తాడు. ఆత్మస్తుతి, ప్రగల్భాల్లవల్ల అతడు ఎంతో చులకనయ్యాడు. శిశుపాలుడు తన వదరుబోతుతనం వల్ల, అహంకారం వల్ల వాసుదేవుడి చేత చచ్చాడు.

పరుషమైన వాక్కు ఎప్పుడైనా ప్రాణాంతకమే. నేరం చేయకపోయినా, లేదా కొద్ది నేరానికైనా, కఠినమైన శిక్షలు అనుభవించినవారెందరో మనకు ఇతిహాస, పురాణాల్లో తారసిల్లుతారు. నేరం చేయని కచుడు దేవయాని శాపానికి గురైనాడు. ఏకలవ్యుడు పాండవుల శునకం మీదికి బాణంవేసిన చిన్ననేరానికి బొటనవేలిని కోల్పోయాడు. నాయకురాలు నాగమ్మ వ్యక్తిగతమైన పగ, ద్వేషం వల్ల కోడిపందాలు సృష్టించి బ్రహ్మనాయుడి మీద దాడి చేసింది. నేరమనేది చేసెరుగని ప్రహ్లాదుడు, ధ్రువుడు ఎన్నో భయంకరమైన దండనలు అనుభవించారు. హరిశ్చంద్రుడి చేత అసత్యమాడించడం కోసం విశ్వామిత్రుడు అతడికెన్నో పరీక్షలు పెట్టాడు. ఎన్నో బాధలు పెట్టాడు. అమాయకుడైన సారంగధరుణ్ని తండ్రి రాజరాజ నరేంద్రుడు కారాగారంలో పెట్టి హింసించాడు. ప్రేమించిన నేరానికి అనార్కలి- అక్బరు ఆదేశంతో సజీవ సమాధి అయింది. ఇలా నిరపరాధులకు తీవ్రమైన దండన విధించడం కూడా సప్తవ్యసనాల్లో ఒకటిగా కనిపిస్తోంది. చెప్పుడు మాటలకు చెవులొగ్గిన కృష్ణదేవరాయలు తిమ్మరుసును చెరసాలపాలు చేసి కనుగుడ్లు పెరికించాడు. రామాయణంలో జటాయువు ఏం నేరం చేశాడని ఖండితపక్షుడైనాడు? సుగ్రీవుడికీ ఉగ్రదండనమనే వ్యసనముంది. చాలామంది రాజులు ఈ వ్యసనం వల్లనే అపకీర్తిపాలైనారు.

సప్తవ్యసనాల్లో చివరిది తాతముత్తాతల సంపాదనలను విశృంఖలంగా ఖర్చుపెట్టడం. ఈ లక్షణం కూడా ఐతిహాసిక, పౌరాణిక పురుషుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దుర్యోధనుడు ప్రజల సొమ్మును విచ్చలవిడిగా దుర్వినియోగం చేశాడు. జీవితమంతా పాండవులను ద్వేషించడంలోను, వారిని కష్టాలపాలు చేసే కార్యక్రమాల్లోనే ఖర్చుచేసేశాడు.

ప్రస్తుత సమాజంలో మనమింతవరకు చెప్పుకొన్న సప్తవ్యసనాల బారినపడి తమ అమూల్య జీవితాన్ని బలి చేసుకుంటున్న దురదృష్టవంతులు అడుగడుగునా కనిపిస్తారు. భారతీయ సనాతన ధర్మం, ఆధ్యాత్మిక చింతన, పారమార్థికత, పాపభీతి కొరవడిన కారణంగానే స్వావలంబన, స్వాధ్యయనం, సదాచరణ, సత్సంగం, సద్గురు బోధకు దూరమై యువత పరదేశ సభ్యతా సంస్కృతులకు ఆకర్షితమవుతున్నది. ఇదెంతో శోచనీయం, గర్హనీయం. సంయమనంతో సప్తవ్యసనాలనే కాదు, సహస్ర వ్యసనాలనైనా సమాధి చేయవచ్చు.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి