ᐅ పునరుత్థానం [Good Friday]
ᐅ పునరుత్థానం
అర్ధరాత్రి సమయం. ఒక వైద్యుడి ఇంటికి రక్తసిక్తమైన గాయాలతో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకువచ్చారు. ఆ వైద్యుడు అతడికి అత్యవసర చికిత్స చేశాడు. కొంతసేపటికి అతడికి స్పృహ వచ్చింది. వైద్యుడి ముఖంలోకి చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఆయనను కొద్దిరోజుల క్రితం తీవ్రంగా గాయపరచి, ధనాన్ని దొంగిలించింది తానే. అయినా వైద్యుడు తనను కాపాడాడు అనుకుంటూ ఆయనకు రెండు చేతులూ జోడించాడు. ఆ మాటలకు వైద్యుడు- 'దైవకుమారుడు ఏ తప్పూ చేయకపోయినా కొరడాలతో కొట్టారు, ముఖంపై ఉమ్మివేశారు. తలపై ముళ్ళకిరీటం ఉంచారు. సిలువపై వేలాడదీశారు. అయినా వారినందరినీ క్షమించాడు. తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అంటూ దేవుడిని ప్రార్థించాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆయన చూపిన క్షమార్పణే నీపై నాకు ప్రేమను పెంచింది' అన్నాడు. ఏ నేరమూ చేయకపోయినా క్రీస్తుప్రభువును సిలువపై ఎందుకు వేలాడదీశారు? రెండువేల సంవత్సరాల క్రితం జరిగిందది.
అవి, రోమను చక్రవర్తి సీజరు పాలిస్తున్న రోజులు. యూదయ దేశాధినేత పొంతిపిలాతు దగ్గరకు యేసుక్రీస్తును తీసుకువచ్చారు. కొందరు ఛాందసవాదులు, పండితులు, చక్రవర్తికి అనుకూలురు అయినవారు ఆయన మీద అనవసరమైన నేరారోపణ చేశారు. అంధ విశ్వాసాలను, గుడ్డి నమ్మకాలను వ్యతిరేకించిన క్రీస్తు తెగువను జీర్ణించుకోలేకపోయారు. కుష్ఠురోగులను, గుడ్డివారిని ఇంకా అనేకమంది రోగగ్రస్తుల్ని తన మహిమలతో ఆరోగ్యవంతుల్ని చేస్తున్న ఆయనను చూసి అసూయపడ్డారు. తన ప్రేమ, కరుణలతో ప్రజలకు చేరువవుతున్న యేసుక్రీస్తు తమకు పోటీగా వస్తాడని భయపడ్డారు. ఆయనను సిలువ వేయమంటూ పొంతిపిలాతుపై ఒత్తిడి తెచ్చారు. పొంతిపిలాతుకు యేసు చేసిన నేరం ఏమీ కనబడలేదు. ఆయన నిరపరాధి అని గ్రహించాడు. అవి పస్కా పండుగ రోజులు. ఆ పండుగ సందర్భంగా ఒక నేరస్థుణ్ని విడుదల చేసే అధికారం దేశాధినేత అయిన పొంతిపిలాతుకు ఉంది. అయినా ఆయన ప్రయత్నం ఫలించలేదు. ఒక నిరపరాధికి శిక్ష వేసినందుకు బాధపడుతూ ఆయన నీరు నిండిన పాత్రలో తన చేతుల్ని శుభ్రపరచుకున్నాడు. పాపరహితుడు, పరమపవిత్రుడు అయిన యేసుప్రభువుకు సిలువ శిక్ష వెయ్యడంలో తనను ఏ పాపమూ అంటుకోకూడదని పొంతిపిలాతు అలా చేశాడు. అలా యేసుక్రీస్తు ప్రభువుకు సిలువశిక్ష అమలైంది. అది దైవనిర్ణయం.
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. అలా సమస్త మానవాళి పాపపరిహారం నిమిత్తం క్రీస్తు సిలువపై బలియాగం అయ్యాడు. ఆ పవిత్రమైన శుక్రవారం రోజు ('గుడ్‌ఫ్రైడే') శుభ శుక్రవారం. ఆయన తిరిగి లేచిన మూడోరోజు ఈస్టరు పర్వదినం.
ఒక ధనికుడు ఒకసారి యేసుక్రీస్తు వద్దకు వచ్చి, 'నీ రాజ్యంలోకి ప్రవేశించాలంటే నేనేం చెయ్యాలి?' అని అడిగాడు. 'ధర్మశాస్త్రంలో పేర్కొన్న ఆజ్ఞల్ని పాటించు' అన్నాడు ప్రభువు. 'అవన్నీ పాటిస్తున్నాను' అన్నాడు ఆ వ్యక్తి. అందుకు ప్రభువు 'నీ ఆస్తిని అంతటిని అమ్మి వాటిని పేదలకు పంచి, నన్ను అనుసరించు' అన్నాడు. ధనికుడికి ఆ మాటలు రుచించక వెళ్ళిపోయాడు. ఇహలోక సంబంధమైన ఆస్తులకన్నా ఆత్మీయ సంపదలను పెంపొందించుకోవాలని క్రీస్తు ఉద్బోధించాడు. నీతిని అనుసరించేవారు, న్యాయంకోసం తపించేవారు దేవుని స్వరూపం చూడగలరు అన్నాడు క్రీస్తు. 'నిన్ను ఒక మైలుదూరం రమ్మంటే ఇంకో రెండు మైళ్ల దూరం ప్రయాణం చెయ్యి. నిన్ను యాచించే వ్యక్తినుంచి నీ ముఖాన్ని తిప్పుకోకు. నీ శత్రువును ప్రేమించు, శపించేవారిని ఆశీర్వదించు, ద్వేషించేవారికి సహాయం అందించు- ఇవీ క్రీస్తు బోధనలు. అందరికీ అనుసరణీయమైనవి. ఆచరణయోగ్యమైనవి. అనుక్షణం అపనమ్మకం, అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతూ అశాంతిగా బతికేవారికి యేసుక్రీస్తు జీవితమే ఒక సందేశం. మంచివారిని, చెడ్డవారిని, పతితులను, పవిత్రులను ఒకే దృష్టితో ప్రేమించగలిగే దివ్యమైన మనసును మీలో ప్రతిష్ఠించుకోండి, అన్న క్రీస్తు ఉపదేశం ఒక్కటి చాలు- సమస్త మానవుల శాంతియుత సహజీవనానికి, విశ్వమానవ పౌరసత్వానికి.
పాపం చేసినవారిని శిక్షించడంకన్నా మనిషిలోని పాపానికి సిలువ వెయ్యాలి. ఆ క్రమంలో మనిషి ప్రేమ, క్షమ, కరుణ మూర్తీభవించిన క్రీస్తు ప్రభువులా పునరుత్థానం చెందుతాడు. అంటే తిరిగి లేస్తాడు. ఇదే, శుభ శుక్రవార పర్వదినం అందించే శుభసందేశం.
- డాక్టర్ ఎమ్.సుగుణరావు